T20 Cricket : టీ20ల్లో టాప్‌ స్కోరర్‌.. మళ్లీ రోహిత్‌ను అధిగమించిన కివీస్‌ ఓపెనర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ మధ్య ఓ విషయంలో దోబూచులాట జరుగుతోంది. అంతర్జాతీయ టీ20ల్లో టాప్‌ స్కోరర్‌గా ఒకరినొకరు అధిగమిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు 3,487 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రోహిత్‌ శర్మ.. ఇవాళ రెండో స్థానానికి పడిపోయాడు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్‌ గప్తిల్ 15 పరుగులు చేశాడు. దీంతో 3,497 పరుగులకు చేరిన మార్టిన్‌ అగ్రస్థానం దక్కించుకున్నాడు. గప్తిల్‌ 121 మ్యాచులకుగాను 117 ఇన్నింగ్స్‌ల్లో 3,497 పరుగులు చేయగా.. ఇందులో రెండు శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. 

అయితే విండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కివీస్‌కు ఇదే చివరి టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. ఇక ఇప్పటి నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు కివీస్‌కు టీ20 మ్యాచ్‌లు లేవు. అయితే టీమ్‌ఇండియా మాత్రం ఆగస్ట్‌ 28న పాకిస్థాన్‌తో ఆసియా కప్‌ వేదికగా టీ20 ఫార్మాట్‌లోనే తలపడనుంది. అంతేకాకుండా గ్రూప్‌ స్టేజ్‌లోనే కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం భారత్‌కు ఉంటుంది. అందుకే మార్టిన్‌ గప్తిల్‌ రికార్డును అధిగమించడం రోహిత్ శర్మకు పెద్ద కష్టమేమీ కాదు. రోహిత్ శర్మ ప్రస్తుతం 132 మ్యాచులకుగాను 124 ఇన్నింగ్స్‌ల్లో 3,487 పరుగులు చేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలు బాదేయడం విశేషం. ఇక వీరిద్దరి తర్వాత టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (3,308 రన్స్‌) ఉన్నాడు. కోహ్లీ కేవలం 99 మ్యాచుల్లో 91 ఇన్నింగ్స్‌ల్లోనే 3,308 పరుగులు సాధించడం విశేషం. అయితే గత రెండున్నరేళ్లుగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.


మరిన్ని

ap-districts
ts-districts