Run Out: వారు ఎప్పుడూ బాధితులమనే చెబుతారు: అశ్విన్‌

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఛార్లీ డీన్‌ను భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ రనౌట్‌ చేసిన విధానంపై చర్చ కొనసాగుతోంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు గగ్గోలు పెట్టారు. అయితే దీప్తి శర్మ చేసినదాంట్లో తప్పేమీ లేదని ఆమెకు మద్దతుగా నిలిచేవారూ లేకపోలేదు. ఈ క్రమంలో 2019 భారత టీ20 లీగ్‌ సీజన్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఇలాగే రనౌట్ (మన్కడింగ్‌) చేయడం అప్పట్లో సంచలనం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో అశ్విన్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘రనౌట్ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వీక్షించారు. బౌలర్‌ ఎలాంటి నేరం చేయలేదని గ్రహించడం ఇప్పుడిప్పుడే మొదలైంది. దోషిగా ఉండాల్సిన వ్యక్తిని అడగకుండా వేరేవారిని ఎందుకు అడుగుతున్నావు అని చాలా మంది అడగడం ప్రారంభించారు. ఒక నిర్దిష్ట వర్గం ప్రజలకు మాత్రమే దీనితో సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వారే ఎప్పుడూ బాధితులమనే పావును ముందుకు తెస్తారు. ఏదైనా సంఘటన జరగగానే కొంతమంది నుంచి ప్రతిఘటన వస్తుంది’’

‘‘నేను దీప్తిశర్మ చేసిన రనౌట్‌పై ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను. ఇక్కడ ప్రధానంగా రిస్క్‌ .. రివార్డ్‌.. గురించే ప్రస్తావించాలి. ఎవరైనా బ్యాటర్ క్రీజ్‌ను దాటేసి ముందుకు వస్తే స్టంపౌట్‌ అయ్యేప్రమాదం ఉంది. అలానే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండే బ్యాటర్ క్రీజ్‌ను వదిలేసి వస్తే రనౌట్‌ అవుతారు. బంతి విడుదల చేయకముందే బ్యాటర్‌ అడుగులు ముందుకు వేస్తే అదనపు ప్రయోజనం పొందినట్లు కాదా..? ఇదే అంశం గురించి చిన్నారులకు తొలి నుంచీ నేర్పించాలి. ప్రస్తుతం తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఏ చిన్న అవకాశం చేజార్చుకూడదు. చాలా జట్ల కెప్టెన్లు బ్యాటర్లు ఎక్కువమంది ఉన్నారు. అయితే దీని గురించి వారికి తెలుసో లేదో చెప్పలేను. ఆటలో పోటీతత్వం పెరిగిపోయిన క్రమంలో నాన్‌స్ట్రైకర్ క్రీజ్‌ను దాటకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఛార్లీ డీన్‌ను ‘నువ్వు ఎందుకు క్రీజ్‌ దాటావు?’ అని ఎవరూ అడగలేదు. ఎప్పటికీ అడగరు కూడానూ. పవర్‌ ఉన్న వాళ్లు తమ కట్టు కథలను నియంత్రించగలరు. నా మద్దతు హర్మన్‌ ప్రీత్‌, దీప్తి శర్మతోపాటు జట్టు మొత్తానికి ఇస్తా. ప్రతి కెప్టెన్‌ తన ప్లేయర్‌కు సపోర్ట్‌ ఇవ్వడం చాలా ముఖ్యం’’ అని అశ్విన్‌ తెలిపాడు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు