ప్రేమ పేరుతో వలవేసి అత్యాచారం.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి..

ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు

జఫర్‌గఢ్‌, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో బాలిక(16)ను లోబర్చుకుని అత్యాచారం చేయడంతో పాటు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రఘుచందర్‌ వివరాలు వెల్లడించారు. చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన గుర్రం శ్యాం ఓ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఆమెపై శ్యాం అత్యాచారం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తుపాకుల సాంబరాజు వీడియో తీశాడు. ఇద్దరూ కలిసి మరో నలుగురు బాలికలకు ఈ వీడియో చూపించి.. తాము చెప్పినట్లు వినకపోతే మీ వీడియోలు కూడా తీస్తామని బెదిరించారు. అత్యాచారం వీడియోను తెలిసిన కొందరికి పంపడంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విషయం బాధితురాలి తల్లికి తెలియడంతో ఆమె చిల్పూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను విచారించి గుర్రం శ్యాం, సాంబరాజును అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో వీరితో పాటు మరో నలుగురు బాలలు ఉన్నారని ఏసీపీ పేర్కొన్నారు. సమావేశంలో జనగామ రూరల్‌ సీఐ సంతోష్‌కుమార్‌ ఉన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు