సీఎస్‌ అధ్యాపకుల వలస

 కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధ కోర్సుల్లో భారీగా పెరిగిన సీట్లు

బోధకులకు పెరిగిన గిరాకీ

జేఎన్‌టీయూహెచ్‌ ర్యాటిఫికేషన్‌కు ఆరు వేల దరఖాస్తులు

అందులో అయిదు వేలు వీరివే

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా ఐటీ కంపెనీల్లో వలసలు ఉండేవి. వేతనం పెరుగుతుందంటే ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగులు మారిపోయేవారు. ప్రస్తుతం ఆ సమస్య ఇంజినీరింగ్‌ కళాశాలలకు వచ్చింది. గత ఏడాది నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత సీట్లు భారీగా పెరగడంతో ఆ పాఠ్యాంశాలు బోధించే అధ్యాపకులకు ఎక్కడలేని గిరాకీ పెరగడమే దానికి కారణం. ఫలితంగా సాధారణంతోపాటు ప్రముఖ కళాశాలల్లోనూ ఆ విభాగంలో 25-40 శాతం బోధన సిబ్బంది ఖాళీలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2020-21 విద్యా సంవత్సరం నుంచి బీటెక్‌లో కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ లాంటి పలు కొత్త కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి(2022-23) రాష్ట్రంలోని 190 కళాశాలల్లో 1.11 లక్షల సీట్లకు ఆమోదం తెలపగా, అందులో 40 వేలు తప్ప మిగిలినవన్నీ సీఎస్‌, ఐటీ సంబంధితమైనవే. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. అధ్యాపకులను ఆయా కళాశాలలే నియమించుకుంటున్నప్పటికీ, దానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆమోదం తప్పనిసరి. దాన్నే ర్యాటిఫికేషన్‌గా పిలుస్తారు. అధ్యాపకులుగా నియమితులయ్యే వారి విద్యార్హత ధ్రువపత్రాలను, వారి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు సిబ్బంది నియామక కమిటీ సమావేశం (స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిటీ మీటింగ్‌, ఎస్‌సీఎం) నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి మొదలైంది. ఆయా కళాశాలలు 6 వేల మందిని నియమించుకుంటామంటూ వర్సిటీకి దరఖాస్తు చేశాయి. అందులో 5 వేల దరఖాస్తులు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఏఐ అండ్‌ ఎంఎల్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను బోధించే ఎంటెక్‌ సీఎస్‌ అభ్యర్థులవే ఉన్నాయని జేఎన్‌టీయూహెచ్‌ వర్గాల సమాచారం. అందులో 3,205 మందికి శనివారం ఎస్‌సీఎంలు జరిగాయి. అందులో ప్రముఖ కళాశాలల్లో పనిచేస్తూ దరఖాస్తు చేసుకున్న వారు 50-100 మంది వరకు ఉండటం గమనార్హం.

వలసలకు కారణాలు ఇవీ...

* మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుంటున్న కళాశాలలు వాటి స్థానంలో డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత కోర్సుల సీట్లను పెంచుకుంటున్నాయి. కొత్తగా 60 సీట్లు పెరిగితే 1:20 నిష్పత్తి ప్రకారం ముగ్గురు అధ్యాపకులు అవసరం. నాలుగేళ్లను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థుల సంఖ్య 240కి చేరుతుంది. అంటే 12 మంది అధ్యాపకులు కావాలి.

* కరోనా కారణంగా డిజిటల్‌ సాంకేతిక వినియోగం పెరగడంతో ఐటీ కంపెనీలకు నిపుణుల అవసరం పెరిగింది. దాంతో కొత్తగా అధ్యాపక వృత్తిలోకి వచ్చిన వారిలో 10-15 శాతం మంది బోధనకు స్వస్తిచెప్పి ఐటీ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారని కళాశాల డైరెక్టర్‌ ఒకరు తెలిపారు.

* కొన్ని మినహా ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు అధ్యాపకులకు అరకొర వేతనాలే ఇస్తున్నాయి. గిరాకీ నేపథ్యంలో వేతనాలు పెంచి ఇస్తామంటూ పిలుపులు అందడంతో వారు ఒకచోట నుంచి మరోచోటుకు వెళ్లిపోతున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని