Singapore: సింగపూర్‌లో జాతీయ స్మారకంగా నేతాజీ ‘దిల్లీ చలో’ మైదానం

సింగపూర్‌: రెండు శతాబ్దాలుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచి.. సింగపూర్‌ నగర నడిబొడ్డున 11 ఎకరాల్లో వెలసిన పచ్చిక మైదానాన్ని 75వ జాతీయ స్మారకంగా ఆ దేశం మంగళవారం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కవాతు అనంతరం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే మైదానం నుంచి ‘దిల్లీ చలో’ నినాదమిచ్చారు.  స్థానికులకు క్రీడామైదానంగానూ ఇది ఉపయోగపడుతోంది. 57వ జాతీయ దినోత్సవం సందర్భంగా సింగపూర్‌ ఈ స్మారక ప్రకటన చేసింది. స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం కింద ఇకపై ఈ మైదానానికి అత్యున్నత స్థాయి రక్షణ కల్పిస్తామని సింగపూర్‌ జాతీయ వారసత్వ మండలి (ఎన్‌హెచ్‌బీ) తెలిపింది. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయనాల వేదిక హెడ్‌ ఆచార్య రాజేశ్‌ రాయ్‌ మాట్లాడుతూ.. నేతాజీ సారథ్యంలోని ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’ (ఐఎన్‌ఏ)కి ఈ మైదానంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ‘ఈ మైదానం భారతీయులకు ప్రత్యేకమైనది. బ్రిటిషర్లు ఈ ద్వీపంలో అవుట్‌పోస్ట్‌ పెట్టినపుడు భారతీయ సిపాయిలు తమ శిబిరాలను ఇక్కడే స్థాపించారు. వందలాది.. వేలాది ఐఎన్‌ఏ సైనికులు, స్థానిక భారతీయులను ఉద్దేశించి నేతాజీ ప్రసంగాలు చేశారు. రాణీ ఆఫ్‌ ఝాన్సీ రెజిమెంటు ఇక్కడే రూపుదిద్దుకొంది. ఈ మైదానానికి దక్షిణ మూలన నేతాజీ ఐఎన్‌ఏ స్మారకాన్ని కూడా ఏర్పాటు చేశారు’ అని తెలిపారు. 1945 సెప్టెంబరు 12న జపాన్‌ సేనలు లొంగిపోయినపుడు విజయ కవాతు కూడా ఇక్కడే జరిగింది. ఏటా సింగపూర్‌లో జరిగే హోలీ (థాయ్‌పుసం) వేడుకలకూ ఇదే వేదిక.


మరిన్ని

ap-districts
ts-districts