close

ఫీచర్ పేజీలు

పరిశ్రమించేందుకు..పరిక్రమించండి

యువజాగృతి

500 మంది.. ఒక్కొక్కరిదీ ఒక్కో ఊరు. పల్లె నుంచి వచ్చిందొకరు. పట్నంలో పుట్టిపెరిగింది ఇంకొకరు. సర్కార్‌ బడిలో చదివిందొకరు. కార్పొరేట్‌ చదువులో ఆరితేరిందొకరు.  అందరి సంకల్పం ఒకటే.. ఏదైనా చేయాలి! అందరి లక్ష్యం ఒకటే.. ఎలాగైనా నిరూపించుకోవాలి!! వారి సంకల్పాన్ని నెరవేర్చేలా.. లక్ష్యం దిశగా సాగేలా.. ప్రోత్సహిస్తోంది జాగృతి ఎక్స్‌ప్రెస్‌. 11 సంవత్సరాలుగా ఏటా దూసుకొచ్చే ఈ రైలు.. విహారంలోనే జీవితాన్ని తీర్చిదిద్దుతోంది. వినోదం పంచుతూనే గెలుపు మజిలీ చేరుస్తోంది.
సాధారణ ప్రయాణంలోనే రకరకాల మనుషులు ఎదురవుతుంటారు. జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలు కలుగుతాయి. ‘జాగృతి ఎక్స్‌ప్రెస్‌’లో స్ఫూర్తిప్రదాతలు పరిచయం  అవుతారు. మనలాగే ఆలోచించే మనుషులు ఎదురవుతారు. 500 మంది యువతీయువకులు. 20-27 ఏళ్ల మధ్యనున్న ఉత్సాహవంతులు 425 మంది. వీరికి దిశానిర్దేశం చేయడానికి 75 మంది ఫెసిలిటేటర్లు. వీరంతా డిసెంబరు 24న రైలులో యాత్రకు సిద్ధమవుతున్నారు. ముంబయిలో మొదలయ్యే యాత్ర అహ్మదాబాద్‌, తిలోనియా, దిల్లీ,  దేవరియా, నలంద, గంజామ్‌, విశాఖపట్నం, శ్రీసిటీ, బెంగళూరు, మదురై, కన్యాకుమారి మీదుగా 15 రోజులు ప్రయాణించి 2020 జనవరి 8 నాటికి తిరిగి ముంబయి చేరుకుంటుంది.

జాగృతి సేవా సదన్‌, జాగృతి సేవా సంస్థాన్‌ ఆధ్వర్యంలో ఏటా ఈ యాత్ర సాగుతుంది. యువశక్తిని ప్రోత్సహించడం, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం,  వారికి ఎంట్రప్రెన్యూర్‌ అవకాశాలు కల్పించడమే ఈ యాత్ర ఉద్దేశం. దీనిలో పాల్గొనేందుకు ప్రతిసారీ పదివేల మంది రిజిష్టర్‌ చేసుకుంటే.. ఇంటర్వ్యూ నిర్వహించి 500 మంది యాత్రికులను ఎంపిక చేస్తారు. ప్రయాణ ఖర్చులు యాత్రికులే భరించాలి. అర్హులకు నిర్వాహకులు స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. వ్యక్తిగత చైతన్యంతో పాటు సామాజిక  శ్రేయస్సును కోరి జాగృతి యాత్ర నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉత్పాదకరంగం, నీరు-పారిశుద్ధ్యం, కళలు-సంస్కృతి-క్రీడలు అంశాలే ప్రధాన అజెండాగా యువతకు దిశానిర్దేశం చేస్తారు. యాత్రంతా వీటి చుట్టూనే తిరుగుతుంది. ప్రతి కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. యాత్రికులంతా సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. తమకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకుంటారు. యాత్ర పూర్తయ్యేసరికి కొన్ని ఆలోచనలు అంకుర పరిశ్రమలుగా మొగ్గ తొడుగుతాయి. కొన్ని నూతన ఆవిష్కరణలకు దారితీస్తాయి. యువతలో నూతన జాగృతి నింపే ఈ యాత్రలో పాల్గొనాలంటే ‌www.jagritiyatra.com/వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు