
గ్రేటర్ హైదరాబాద్
గిరిజన శక్తి సంఘం నాయకులకు షర్మిల భరోసా
ఈనాడు, హైదరాబాద్: పలు సమస్యలపై పోరాడుతున్న గిరిజనులకు మద్దతుగా ఉంటానని వై.ఎస్.షర్మిల భరోసా ఇచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లో ఆమెతో గిరిజన శక్తి సంఘం నాయకులు సమావేశమయ్యారు. తండా బోర్డు, గిరిజన భాషాభివృద్ధి, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆవశ్యకతలను వారు వివరించారు. వైఎస్ పరిపాలనా కాలంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వగా ప్రస్తుతం తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకులు వివరించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్, జాతీయ అధ్యక్షుడు రాజేశ్ నాయక్, కార్యనిర్వాహక కార్యదర్శి శరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం పలు జిల్లాలకు చెందిన అభిమానులు లోటస్ పాండ్‌కు వచ్చారు.