సంక్షిప్త వార్తలు
close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సంక్షిప్త వార్తలు

రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులపై గెజిట్‌ ప్రచురణకు ఆదేశం

ఈనాడు, అమరావతి: నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్‌, పురపాలక, నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్‌ పదవులకు సంబంధించి పురపాలక చట్టంలో చేసిన సవరణలను గవర్నర్‌ ఆమోదించడంతో మూడు భాషల్లో గెజిట్‌ ప్రచురించాలని అధికారులను ఆదేశిస్తూ న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పుర చట్ట సవరణకు సంబంధించి గవర్నర్‌ మొదట ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన బడ్జెట్‌ సమావేశంలో బిల్లును ఆమోదించారు. నగరపాలక, పురపాలక, నగరపంచాయతీ పాలకవర్గాల మొదటి సమావేశం నిర్వహించిన 14 రోజుల్లోగా రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్‌ను ఎన్నుకోవాలన్న నిబంధనలను కూడా ఇటీవల సవరించారు. కాలపరిమితితో సంబంధం లేకుండా రెండో సమావేశం నిర్వహించిన సమయంలోనే వారిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించారు.


సచివాలయ స్థాయిలో తెలుగు అమలు సరిగా లేదు: యార్లగడ్డ

ఈనాడు, అమరావతి: సచివాలయ స్థాయిలో తెలుగు భాష అమలు సరిగా జరగడం లేదని అంగీకరిస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. కొవిడ్‌-19 నివారణ చర్యలకు అధికార భాషా సంఘం తరఫున సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్‌మస్తాన్‌లతో కలిసి బుధవారం రూ.5లక్షల విరాళానికి సంబంధించిన చెక్కులను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘కరోనా సమయంలోనూ తెలుగు భాష అమలుపై అన్ని జిల్లాలు తిరిగాం. సీఎంకు వార్షిక నివేదికను సమర్పించాం. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నాం. తెలుగును పాలనా భాషగా అమలు చేయడానికి సహకారం అందిస్తామని సీఎం హామీనిచ్చారు’’ అని అన్నారు.


సుప్రీంకోర్టు సీజే పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

తిరుమల, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పర్యటన సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని తితిదే అధికారులను అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. బుధవారం వసంత మండపంలో అధికారులతో సమావేశమయ్యారు. గురువారం సుప్రీంకోర్టు సీజే తిరుమలకు చేరుకొని, శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు.


వీరబ్రహ్మం జలాశయానికి 48.68 కోట్లు

ఈనాడు, అమరావతి: కడప జిల్లాలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మం జలాశయానికి (ఎస్‌. పి. వి. బి. ఆర్‌) కటాఫ్‌ వాల్‌ నిర్మాణం కోసం రూ.48.68 కోట్లకు పాలనామోదం ఇచ్చారు. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొంది.


రెవెన్యూలోటు కింద ఏపీకి రూ.1,438 కోట్లు విడుదల

ఈనాడు, దిల్లీ: ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ఆర్థికశాఖ దేశంలోని 17 రాష్ట్రాలకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడో విడత రెవెన్యూలోటు భర్తీ గ్రాంట్‌ కింద రూ.9,871 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.1,438.08 కోట్లు దక్కాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.4,314.24 కోట్లు వచ్చినట్లయింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 17 రాష్ట్రాలకు కలిపి రూ.1,18,452 కోట్ల రెవెన్యూలోటు గ్రాంటును ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఈ మొత్తాన్ని కేంద్రం 12 వాయిదాల్లో చెల్లించనుంది. దీని ప్రకారం ఏపీకి ఈ ఏడాదిలో రూ.17,256.96 కోట్లు రానున్నాయి.


మొదటి ఏడాది బీడీఎస్‌ ఫలితాల వెల్లడి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఏప్రిల్‌/మే నెలల్లో జరిగిన మొదటి సంవత్సరం బీడీఎస్‌ పరీక్షల ఫలితాలను విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం వెల్లడించింది. రీటోటలింగ్‌ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.రెండు వేలు రిజిస్ట్రార్‌ పేరిట చెల్లించి ఈ నెల 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పి.దుర్గాప్రసాదరావు తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.


తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ పరీక్షలు రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటించారు. మార్కులు ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయమై విధి విధానాలు రూపొందించేందుకు అధికారులతో కమిటీని నియమించామని, రెండు మూడు రోజుల్లో నివేదిక అందుతుందని, అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కేటాయించిన మార్కులు సరిపోవనుకున్న వారికి కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo