close

తెలంగాణ

హైదరాబాద్‌పై ఇంకా చిన్నచూపేనా?

‘దగాపడిన దక్షిణ భారత్‌’ సదస్సులో వక్తలు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ రెండో రాజధాని కావాలని, ఇక్కడే సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటుచేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. దక్షిణ భారత రాజకీయ; న్యాయవాదుల ఐకాసల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య కళానిలయంలో ‘దగాపడిన దక్షిణ భారత్‌’పై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.అధ్యక్షత వహించిన రాజకీయ ఐకాస ఛైర్మన్‌ గాలి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి వంటి దక్షిణాది ప్రాంతాలు అన్ని రంగాల్లోనూ వెనుకబాటు బారిన పడ్డాయన్నారు. ఇకనైనా దక్షిణాది అభివృద్ధి మండలిని పునరుద్ధరించాలని, భాషా సాంస్కృతిక మండలిని ఏర్పాటుచేయాలని కోరారు. ప్రత్యేక హోదా వంటి హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రసంగిస్తూ, ఉత్తరాది రాష్ట్రాలపై ఉన్న శ్రద్ధను దక్షిణాదిపై కేంద్రం ఎందుకు కనబరచడం లేదని ప్రశ్నించారు. జల వివాదాలు, ఇతర అంశాలపై రాష్ట్రాలను విభజించి పాలించే ధోరణి కనిపిస్తోందని ఆచార్య కె.నాగేశ్వర్‌ విమర్శించారు. నిధులను తగ్గిస్తున్న కేంద్రం..వనరులపై ఆధిపత్యం మాత్రం పెంచుతోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు తప్పక జరగాలన్నారు. సమావేశంలో న్యాయవాదుల ఐకాస కన్వీనర్‌ ఎస్‌.నాగేందర్‌, సీనియర్‌ న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి సతీష్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్‌ సుధాకర్‌, తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయప్ప, ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ నాయకుడు గూడూరు చెన్నారెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు