close

జాతీయ- అంతర్జాతీయ

జమ్మూ-కశ్మీర్‌లో శాసనసభ స్థానాల పెంపు సాధ్యమేనా?: ఈసీలో చర్చ

ఈనాడు, దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌ విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా ఆ రాష్ట్ర శాసనసభ స్థానాలను 107 నుంచి 114కి పెంచే అంశంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గతంగా చర్చ జరిగినట్లు తెలిసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 ప్రకారం... 2026 తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా తదుపరి నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఆ కారణంగానే నిలిచిపోయింది. ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌ డీలిమిటేషన్‌కు ఆర్టికల్‌-170లోని నిబంధనలు అడ్డుగా మారతాయా? లేదా? అన్న దానిపై ఎన్నికల సంఘం చర్చించినట్టు సమాచారం.

ఇక్కడా తెలుగు రాష్ట్రాల నిబంధనే... 
అసెంబ్లీ స్థానాలను పెంచే విషయంలో ఏ రాష్ట్రానికైనా ఆర్టికల్‌ 170లోని నిబంధనలే వర్తిస్తాయని న్యాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కి అనుగుణంగా ఆర్టికల్‌ 170(3)ని సవరించకపోతే... తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యంకాదని, అదే నిబంధన ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌కూ వర్తిస్తుందని వ్యాఖ్యానించాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు