close

తెలంగాణ

దూరం.. కాదిక భారం!

రాష్ట్ర రాజధాని ట్రాఫిక్‌ కష్టాలకు ‘మధ్యంతర’ పరిష్కారం
రెండు వలయాల మధ్య మరో ఇంటర్మీడియట్‌ రింగ్‌రోడ్డు
రూ. 200 కోట్ల వ్యయంతో 103 కి.మీ. మేర నిర్మాణం
కేవలం 10 కి.మీ. ప్రయాణంతో అవుటర్‌పైకి

  హెచ్‌ఎండీఏ నివేదికఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చే మరో భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌)- బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)కి మధ్య కొత్తగా మధ్యంతర రహదారి (ఇంటర్మీడియట్‌ రింగ్‌రోడ్డు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రాథమిక సర్వే పూర్తి చేసి ఒక నివేదిక రూపొందించింది. 103 కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్‌ కష్టాలు చాలావరకు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. దీనికి రూ. 200 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం మధ్యలో 50 కిలోమీటర్ల పొడవుతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఉంది. ఇది మాసాబ్‌ట్యాంక్‌ నుంచి మొదలై బంజారాహిల్స్‌, పంజాగుట్ట, తార్నాక, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, సంతోష్‌నగర్‌,  ఆరాంఘర్‌, అత్తాపూర్‌, మెహిదీపట్నం  మీదుగా తిరిగి మాసాబ్‌ట్యాంక్‌కు చేరుతుంది. నగరం వెలుపల 158 కిలోమీటర్ల పొడవునా అవుటర్‌ రింగ్‌రోడ్డు ఉంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి అవుటర్‌లోకి ప్రవేశించాలంటే ఎటునుంచి ఎటైనా 25 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. వాహనాల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఇన్నర్‌ రింగ్‌రోడ్డు రద్దీగా మారిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఈ రెండు రింగ్‌రోడ్ల మధ్యలో మరో మధ్యంతర రహదారి (ఇంటర్మీడియట్‌ రింగ్‌రోడ్డు) నిర్మిస్తే బాగుంటుందని పలువురు నిపుణులు హెచ్‌ఎండీయేకు సలహా ఇచ్చారు. దీంతో సంస్థ ఇంజినీర్లు సర్వే చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

103 కిలోమీటర్ల పొడవు..
* రంగారెడ్డి జిల్లా హరిగూడ వద్ద బాహ్యవలయ రహదారి నుంచి ఈ రోడ్డు మొదలవుతుంది. లంగర్‌గూడ, శంషాబాద్‌ విమానాశ్రయం రోడ్డు, నాదర్‌గుల్‌, కమ్మగూడ, ఇంజాపూర్‌, హయత్‌నగర్‌, పి.సింగారం, కొర్రేముల్‌, పోచారం, రాంపల్లి, దుమ్ముగూడ, హకీంపేట, కొంపల్లి, గండిమైసమ్మ, బాచుపల్లి, అమీన్‌పూర్‌, ఐడీఏ బొల్లారం మీదుగా వట్టినాగులపల్లి దగ్గర మళ్లీ బాహ్యవలయ రహదారిలో కలుస్తుంది.
* మొత్తం 103 కి.మీ. పొడవునా ఇది సాగుతుంది. ఇందులో 73 కిలోమీటర్ల మేర ఇప్పటికే రోడ్డు ఉంది. కానీ కొన్నిచోట్ల ఒక వరుస, కొన్నిచోట్ల రెండు వరుసలు.. ఇలా రకరకాల వెడల్పుతో ఉంది.
* మిగిలిన 29 కిలోమీటర్లలో 16 కిలోమీటర్ల మేర రోడ్డు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నా క్షేత్రస్థాయిలో రోడ్డు లేదు.
* మరో 13 కిలోమీటర్ల వరకు రోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో కూడా లేదు. దీని కోసం భూసేకరణ చేయాలి.
* మొత్తం 103 కిలోమీటర్ల రోడ్డును ఆరు వరుసలుగా నిర్మించాలనేది ప్రతిపాదన. ఇది జరగాలంటే 74 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలి. మిగిలిన 29 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించాలి.
* పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో దీనిపై ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రేడియల్‌ రోడ్లతోనూ అనుసంధానం
ప్రస్తుత అవుటర్‌కు ఇన్నర్‌రింగ్‌ రోడ్డును కలుపుతూ 33 రేడియల్‌ రోడ్లను నిర్మించాలని తలపెట్టారు. ఇప్పటి వరకు 10 రోడ్ల వరకు నిర్మాణం పూర్తయింది. కొత్త రోడ్డు కూడా ఈ రేడియల్‌ రోడ్లను అనుసంధానం చేస్తారు.

లక్షల వాహనాలు
ఇన్నర్‌రింగ్‌ రోడ్డులో ప్రతిరోజూ తిరిగే వాహనాలు: 15 లక్షలు
బాహ్యవలయ రహదారిలో నిత్యం తిరిగే వాహనాలు: 1.30 లక్షలు
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి బాహ్య వలయ రహదారికి ప్రస్తుతం సగటు దూరం: 25 కి.మీ.
ఇంటర్మీడియట్‌ రింగ్‌రోడ్డు పూర్తయితే బాహ్యవలయ రహదారికి దూరం: 10 - 12 కి.మీ.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు