close

బిజినెస్‌

విమాన ఛార్జీలపై 3 నెలల నియంత్రణ

ప్రయాణ సమయం ఆధారంగా 7 విభాగాలుగా విభజన
కనిష్ఠ ఛార్జీ రూ. 2000; గరిష్ఠం రూ. 18600  
40% టికెట్లను గరిష్ఠ- కనిష్ఠ మధ్య ధరకు విక్రయించాలి  
పీఎస్‌ఎఫ్‌, యూడీఎఫ్‌, జీఎస్‌టీ అదనం
25 నుంచి 33% సర్వీసుల పునఃప్రారంభం: మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి
ఈనాడు - దిల్లీ

వచ్చే సోమవారం (25న) పునఃప్రారంభమవుతున్న విమాన సర్వీసుల్లో, ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్‌ ధరలపై నియంత్రణ అమలు చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి గురువారం ఇక్కడ తెలిపారు. మెట్రో నగరాల మధ్య ఈ వేసవిలో నడపడానికి అనుమతిచ్చిన సర్వీసుల్లో 33.33% మొదలవుతాయని వెల్లడించారు. మెట్రో- నాన్‌ మెట్రో నగరాల మధ్య డిపార్చర్స్‌ వారానికి వందకు మించి ఉంటే, అక్కడ అనుమతించిన వేసవి సర్వీసుల్లో మూడోవంతే ప్రస్తుతం మొదలుపెట్టడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇలాంటి నగరాల మధ్య డిపార్చర్స్‌ వారానికి 100 లోపు ఉంటే అనుమతిచ్చిన వాటిల్లో 33% సర్వీసులను ఏ మార్గంలోనైనా నడుపుకునే స్వేచ్ఛను విమానయాన సంస్థలకు వదిలిపెడుతున్నట్లు ప్రకటించారు. మిగిలిన మార్గాల్లో వేసవిలో నడపడానికి అనుమతిచ్చిన సర్వీసుల్లో మూడోవంతును ఎక్కడికైనా నడుపుకోవచ్చని వెల్లడించారు. ఈ నిబంధనలు ఆర్‌సీఎస్‌ ఉడాన్‌ మార్గాలకు వర్తించవని పేర్కొన్నారు. మెట్రో నగరాల కిందకు దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కత్తా వస్తాయని చెప్పారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 24వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు.


మున్ముందు మరిన్ని నడపాలంటే..

దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. ప్రస్తుత అనుభవం ఆధారంగానే మున్ముందు దేశీయ సర్వీసుల సంఖ్య పెంచుకుంటూ పోతామని, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు. విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చే వందే భారత్‌మిషన్‌లో ప్రైవేట్‌ విమానయాన సంస్థలు కూడా పాల్గొనవచ్చని మంత్రి తెలిపారు.


దిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో హెచ్‌ఓఐ యాప్‌ ద్వారా భోజనం

దిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో జీఎంఆర్‌ సంస్థ హెచ్‌ఓఐ యాప్‌ ద్వారా భోజనం అందించనుంది.  ప్రయాణికులు ఈ యాప్‌ ద్వారా, అక్కడి అవుట్‌లెట్లను ఎంచుకుని ఆహారాన్ని ఆర్డర్‌ చేయొచ్చు. ఆర్డరు సిద్ధమైన వెంటనే వినియోగదారుడికి మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అలర్ట్‌ వస్తుంది. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి దాన్ని తీసుకోవచ్చు.   విమానాశ్రయ కార్యకలాపాల వివరాలన్నీ ఈ యాప్‌ ద్వారా ప్రయాణికుడు తెలుసుకోవచ్చు. రియల్‌ టైమ్‌ ఫ్లైట్‌ స్టేటస్‌ అలర్ట్స్‌, బోర్డింగ్‌ గేట్‌ ఇన్ఫర్మేషన్‌, తాము చేరుకోబోయే గమ్యస్థానంలో వాతావరణ పరిస్థితులన్నీ  ఈ యాప్‌లో ఉంటాయని జీఎంఆర్‌ సంస్థ తెలిపింది.


ప్రయాణికులు ఇవి పాటించాలి

* వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలున్న వారు, వైరస్‌ వ్యాప్తి పూర్తిగా నియంత్రణ అయ్యే వరకు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
* ప్రతి ప్రయాణికుడి మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ ఉండాలి. అందులో ఎర్రమార్క్‌ వచ్చినవారిని ప్రయాణానికి అనుమతించరు. ఈ యాప్‌ లేనివారు స్వీయ ప్రకటన పత్రం (సెల్ఫ్‌డిక్లరేషన్‌) ఇవ్వాలి.
* కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో నివసించే వాళ్లకు, కరోనా పాజిటివ్‌గా తేలిన వాళ్లకు  ప్రయాణ అనుమతి లేదు.
* విమానాశ్రయాల్లో ప్రస్తుతం భౌతిక తనిఖీ (చెక్‌ ఇన్‌) కౌంటర్లు నిర్వహించడం లేదు. వెబ్‌ చెక్‌ఇన్‌ చేసుకోవాలి.
* శరీర ఉష్ణోగ్రత పరిశీలన (థర్మల్‌ స్క్రీనింగ్‌) తప్పనిసరి.
* విమానాల్లో భోజనం ఇవ్వరు. తాగునీటి సీసాలు గ్యాలరీ ప్రాంతం, సీట్ల వద్ద మాత్రమే ఇస్తారు.
* ప్రతి ప్రయాణికునికి ఒక చెకిన్‌ బ్యాగ్‌ మాత్రమే అనుమతి.
* విమానాశ్రయాల్లో అడుగుపెట్టాక, ఆ తర్వాత కూడా ప్రయాణికులు మాస్క్‌ తప్పక ధరించాలి.
* విమానం బయలుదేరే సమయానికి రెండుగంటల ముందే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకుని, భౌతిక దూరం నిబంధన తప్పనిసరిగా పాటించాలి.
* ప్రయాణికులు ప్రొటెక్టివ్‌గేర్‌, శానిటైజర్‌ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
* కేబిన్‌ సిబ్బంది పూర్తిస్థాయి పీపీఈలు ధరించాలి.
* గమ్యస్థానం చేరాక, అక్కడి రాష్ట్రాలు నిర్దేశించిన వైద్య మార్గదర్శకాలు అనుసరించాలి.


విమానాశ్రయాలకు మార్గదర్శకాలు..

* విమానాశ్రయాల్లో ప్రతి ముఖ ద్వారం (ఎంట్రీ పాయింట్‌) వద్ద, చేతితో తాకాల్సిన అవసరం ఉన్న ప్రాంతాల వద్ద (టచ్‌ పాయింట్స్‌) శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
* ప్రయాణికులు ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే, కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలి.
* కొవిడ్‌- 19 జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలనే షరతుతో ఆహార, పానీయాల విక్రయ కేంద్రాలకు అనుమతి.


క్వారంటైన్‌కు అక్కర్లేదు

దేశీయ విమానాల్లో ప్రయాణించినవారు గమ్యం చేరాక క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని పురి చెప్పారు. వందే భారత్‌ కింద విదేశాల నుంచి వచ్చే వారు సుదీర్ఘకాలం ప్రయాణం చేసి వస్తారు కాబట్టే వారిని క్వారెంటైన్‌కు పంపుతున్నామని, దేశీయ ప్రయాణాలు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి ఆ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.  


ఛార్జీలు ఎంతంటే

ప్రయాణ సమయం ఆధారంగా మొత్తం మార్గాలను ఏడు విభాగాలుగా విభజించి, వాటికి కనిష్ఠ, గరిష్ఠ ధరలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి విమానంలో 40 శాతం సీట్లను కనిష్ఠ, గరిష్ఠ ఛార్జీల మధ్యస్థ ధరకు విక్రయించాలని షరతు విధించినట్లు వెల్లడించారు. ఉదాహరణకు.. దిల్లీ- ముంబయి మార్గానికి  కనీస ఛార్జి రూ.3,500 కాగా.. గరిష్ఠ ఛార్జి రూ.10000. ఇందులో 40% సీట్లను కనిష్ఠ, గరిష్ఠ మధ్య ధర అయిన రూ.6,750కి విక్రయించాలి.


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు