close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాయిదా కోరడం తెలంగాణకు అన్యాయం చేయడమే

11న ఏపీ టెండర్లు తెరుస్తుంటే.. 20 తర్వాత ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అంటారా?
సీఎం కేసీఆర్‌నుద్దేశించి బండి సంజయ్‌ వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ‘తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రాష్ట్ర భాజపా వినతిపత్రం ఇస్తే.. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఆగస్టు 5న ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. రాష్ట్ర సర్కార్‌ జాప్యం చేస్తూ 20వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కోరడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి’ అని ఆయన ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ‘పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు పనుల టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆగస్టు 11న తెరుస్తోంది. ఈ నేపథ్యంలో ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి తొందరపడాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దాన్ని వాయిదా వేయాలని కోరడం తెలంగాణకు అన్యాయం చేయడమే. తెరాస ప్రభుత్వ తీరుతో నదీజలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఏ చిన్న అవకాశం దొరికినా సంబంధిత టెండర్ల ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ‘విభజనచట్టం ప్రకారం తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలని కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ఏర్పాటుచేస్తే.. సమయం లేదంటూ తర్వాత నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ కోరడం దారుణం. టెండర్లు ఖరారైతే పనులు ఆపడం కష్టం. సచివాలయం కూల్చివేత, ఇతర అంశాలపై గంటల తరబడి సమావేశాలు నిర్వహించే ముఖ్యమంత్రికి 5వ తేదీన ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం హాజరుకు సమయం లేదా?’ అని ఆయన ప్రశ్నించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు