Gujarat vs Chennai: రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్‌ విజయం

ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నైపై గుజరాత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 196 పరుగులకు పరిమితం అయింది. 

Updated : 11 May 2024 00:32 IST

అహ్మదాబాద్‌: కీలక మ్యాచ్‌లో గుజరాత్‌ చెలరేగింది. సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నైని 35 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో మిణుకుమిణుకు మంటున్న ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (103: 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (104: 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బౌలింగ్‌లో చెన్నైని 20 ఓవర్లలో 8 వికెట్లు తీసి 196 పరుగులకే పరిమితం చేసింది. చెన్నై జట్టులో డారిల్‌ మిచెల్‌ (63: 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (56: 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. చివర్లో ఎంఎస్‌ ధోనీ (26*: 11 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌) విజృంభించినప్పటికీ అప్పటికే సాధించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో చెన్నై ఓటమి పాలైంది. గుజరాత్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ సూపర్‌ బౌలింగ్‌తో చెన్నై పతనాన్ని శాసించాడు. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగుతున్న సమయంలో 3 కీలక వికెట్లు తీసి కోలుకోకుండా చేశాడు. 

ఆదుకున్న మిచెల్‌, అలీ.. మోహిత్‌ శర్మ అదుర్స్‌..

232 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన చెన్నైకి తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆరో బంతికి పరుగు తీసే క్రమంలో రచిన్‌ రవీంద్ర రనౌట్‌ అయ్యాడు. సందీప్‌ వారియర్‌ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి తెవాతియాకి క్యాచ్‌ ఇచ్చి రహానె వెనుదిరిగాడు. స్వల్ప తేడాతో ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ గైక్వాడ్‌ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 10 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. వీరి ఔట్‌తో క్రీజులోకి వచ్చిన డారిల్‌ మిచెల్‌, మొయిన్‌ అలీ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వారియర్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదిన మిచెల్‌ మెళ్లిగా గేర్‌ మార్చాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో అలీ సైతం రెండు ఫోర్లు కొట్టి నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. సందీప్‌ వేసిన ఏడో ఓవర్లో వీరిద్దరూ చెరో సిక్స్‌ బాదారు. కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో మిచెల్‌ మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. దీంతో 10 ఓవర్లకు చెన్నై 3 వికెట్ల నష్టానికి 86 పరుగులతో నిలిచింది. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అలీ వరుసగా మూడు సిక్స్‌లు బాది చెన్నై శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.

అయితే లక్ష్య చేధనలో చెలరేగుతున్న మిచెల్‌, అలీ భాగస్వామ్యాన్ని మోహిత్‌ శర్మ విడదీశాడు. స్లో బంతితో డారిల్‌ మిచెల్‌కు చెక్‌ పెట్టాడు. మిచెల్‌ బంతిని గాల్లోకి షాట్‌ కొట్టడంతో షారుఖ్‌ ఖాన్‌ అందుకున్నాడు. దీంతో 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మోహిత్‌ బౌలింగ్‌లోనే అలీ.. నూర్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చెన్నై 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 143 పరుగులతో నిలిచింది. కార్తీక్‌ త్యాగి వేసిన 16వ ఓవర్‌లో శివమ్‌ దూబె వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టగా, జడేజా ఓ సిక్స్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై లక్ష్యం 70 పరుగులుగా మారడంతో చెన్నై శిబిరంలో గెలుపుపై ఆశలు రెకెత్తాయి. మరోమారు బౌలింగ్‌కు వచ్చిన మోహిత్‌.. దూకుడుగా ఆడుతున్న దూబెను ఔట్‌చేశాడు. 18 ఓవర్లో జడేజా, శాంట్నర్‌ను రషీద్‌ ఖాన్‌ ఔట్‌ చేయడంతో పాటు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చెన్నై ఓటమి ఖరారైంది. 19 ఓవర్లో 10 పరుగులు రాగా, చివరి ఓవర్లో ధోనీ చెలరేగాడు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాదినప్పటికీ కేవలం అంతరాన్ని మాత్రమే తగ్గించాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ రెండు, ఉమేశ్‌ యాదవ్‌, సందీప్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు