close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రోషిణి పాఠం... యూట్యూబ్‌ పీఠం!

పాఠాలు అర్థంకాక... పరీక్షలు రాయలేక చనిపోయిన ఓ విద్యార్థి కథ... మరో అమ్మాయి భయం... బాధ... ఆమెను ఆలోచింపజేశాయి. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి... ఉపాధ్యాయినిగా మారింది. అదీ యూట్యూబ్‌లో. 6 నుంచి 12వ తరగతి పాఠ్యాంశాలు వీడియోలుగా తయారుచేసి కష్టమైన అంశాలు ఇష్టంగా నేర్చుకునేలా చేస్తోంది. లక్షలమంది విద్యార్థులకు చేరువైంది. ఆమె బెంగళూరుకు చెందిన రోషిణి ముఖర్జీ.

కప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడిన రోషిణి... పరీక్షలు తప్పి, భవిష్యత్తును చీకటి చేసుకుంటున్న విద్యార్థులను చూశాకే ఇలా వీడియోలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆంగ్లం, హిందీ భాషల్లో పాఠాలు బోధిస్తూ... విద్యార్థుల సందేహాలను తీరుస్తోంది. రోషిణి స్వస్థలం బెంగళూరు. చిన్న వయసు నుంచి చదువులో చురుకు. తాను చదువుకుంటూ తోటివారికి పాఠాలు చెప్పేది. కాలేజీకి వెళ్లినా అదే కొనసాగింది. ‘చిన్నప్పటి నుంచి నాకు చదువంటే ఇష్టం. కాలేజీ స్థాయికి వచ్చేసరికి నా స్నేహితులకు పాఠాలు చెప్పేదాన్ని. నేను చెప్పే విధానం వారికి తేలికగా అర్థమయ్యేదట. అందుకే నన్ను బోధనా రంగాన్ని ఎంచుకోమనేవారు వాళ్లు. కానీ నేను ఇంజినీరింగ్‌ పూర్తిచేసి విప్రోలో చేరా. అలా ఆరేళ్లపాటు ఉద్యోగం చేశా’ అని అంటుందామె.

రోషిణి ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు తనకు తెలిసిన విద్యార్థి గురించి రోషిణికి చెప్పిందోసారి. కేవలం పాఠాలు అర్థంకాక, పరీక్షలకు వెళ్లలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి చాలా బాధపడింది రోషిణి. అతనే కాదు చాలామందిలో ఈ సమస్య ఉందని గుర్తించింది. ‘నాకు తెలిసిన ఓ అమ్మాయి తన స్కూల్‌లో పాఠాలు చెప్పే విధానం అర్థం కావడంలేదనేది. తనతోపాటు ఎంతోమంది ఇలాగే బాధపడుతున్నారనేది. అవన్నీ విన్నప్పుడు నా వంతుగా ఏదో ఒకటి చేయాలని ఉండేది. చివరకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకోవాలనుకున్నా. అలా 2011, జులైలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం భౌతిక శాస్త్రంలో కొన్ని పాఠాలను బోధిస్తూ వీడియోగా చేసి యూట్యూబ్‌లో పెట్టా. వారం రోజులయ్యేసరికి మంచి స్పందన వచ్చింది. అప్పట్లో ఇది కొత్తే. దాంతో చాలామంది విద్యార్థులు మరిన్ని పాఠాలు చెప్పమంటూ సందేశాలు పెట్టేవారు. అలా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరిన్ని వీడియోలు రూపొందించా. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి వీడియోలను రికార్డు చేసేదాన్ని. తరువాత పదోతరగతి పాఠాలు మొదలుపెట్టా. అలా మూడేళ్లపాటు చేశా.

వెబ్‌సైట్‌గా...
మూడేళ్ల తరువాత రోషిణి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటువైపు వచ్చింది. 2014లో ‘ఎగ్జామ్‌ ఫియర్‌ డాట్‌ కామ్‌’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. యూట్యూబ్‌ ఛానల్‌లో పిల్లలు కోరుకున్న పాఠాలు వీడియోల రూపంలో ఉంటాయి. ఇప్పుడు ఆరో తరగతి నుంచి ఇంటర్‌ రెండో ఏడాదివరకూ పాఠాల వీడియోలు అందులో ఉంచుతోంది. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ ఆధారంగా పాఠాలు చెబుతుందామె. సిలబస్‌ మారితే వెంటనే అప్‌డేట్‌ అవుతుంది. ‘మా సైట్‌లో ఇంగ్లిష్‌ గ్రామర్‌ పూర్తిగా ఉంటుంది. ఇది విద్యార్థులకే కాదు, పోటీపరీక్షలకు వెళ్లేవారికీ ఉపయోగపడుతుంది. పరీక్షల ముందు ఆన్‌లైన్‌లో కొన్ని రివిజన్‌ టెస్టులు కూడా నిర్వహిస్తా. అలా ప్రతి సబ్జెక్టుపై విద్యార్థులకు పట్టు వచ్చేలా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటా. గతేడాది భూగోళశాస్త్రం కూడా ప్రారంభించా. ఈ ఏడాది సివిక్స్‌ను మొదలుపెట్టాలనుకుంటున్నా...’ అని చెబుతుందామె.

విద్యార్థుల్లో మరింత స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో... తమ వెబ్‌సైట్‌ ద్వారా చదువుకుని మంచి ర్యాంకు తెచ్చుకుని అవార్డులు అందుకున్నవారి కథనాలను కూడా ఈ సైట్‌లో పెట్టడం మొదలుపెట్టింది రోషిణి. ఆ కథనాలు మరెందరో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనేది రోషిణి ఆలోచన. అలాగే గ్రామీణప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లి, అక్కడ వర్క్‌షాపులను కూడా నిర్వహిస్తుంది. కష్టం అనుకునే సబ్జెక్టులను తీసుకుని వాటిని ప్రయోగాత్మకంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే ఆమె పని. దీనికోసం ఓ 20 మందిని బృందంగా ఏర్పాటుచేసుకుంది. ఇప్పటివరకు జార్ఖండ్‌, నోయిడా, బెంగళూరు వంటి దాదాపు 50 ప్రాంతాల్లోని పాఠశాలల్లో వర్క్‌షాపులు నిర్వహించింది.

లక్షల్లో వీక్షకులు...

ప్పటివరకూ ఆరువేల వీడియోలు ఇందులో పొందుపరిచిందామె. ప్రస్తుతం దీనికి ఏడు లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఇప్పటివరకూ వీటిని చూసినవారి సంఖ్య 190 మిలియన్లు. ఇందులో సైన్స్‌ ప్రయోగాలు కూడా ఉంటాయి. నీట్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా జనరల్‌ నాలెడ్జ్జ్‌తో కూడిన ప్రశ్నపత్రాలు కూడా ఈ వీడియోల్లో చూడొచ్చు.
- సీహెచ్‌. వసుంధరాదేవి

మరిన్ని