close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆరు రుచులతో ఆరోగ్యం

మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఉంది.  ఏ పర్వదినాల్లో ఏం వండుకోవాలనే నియమాలన్నీ ఆయుర్వేద సూత్రాలపై ఆధారపడినవే. మన శరీర ఆరోగ్యానికి, అనారోగ్యానికి ప్రధాన కారణమైన వాత, పిత్త, కఫాలు... రుతువుల్లో వచ్చే మార్పులతో  ప్రభావితమవుతాయి.  అందుకే మారే రుతువులతోపాటు ఆహారంలో మార్పులు చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి.

షడ్రుచుల్లో... ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉండే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు రుచులు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ షడ్రుచుల్లో మధుర రసం అంటే... చెరకు, అరటిపండు, బెల్లం, ఆమ్ల రసంగా.. చింతపండు, లవణ రసంగా...ఉప్పు, కటు రుచిగా... పచ్చిమిర్చి, మిరియాలు, తిక్త రుచికి... వేప పువ్వు, కషాయం...రుచికి మామిడి పిందెలను వాడతాం. వీటిని ఎక్కువ, తక్కువ పరిమాణంలో నిత్యం ఆహారం ద్వారా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

వేప పువ్వే ప్రధానం... వసంత రుతువు, చైత్రమాసం, పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరాది రోజున ఆరు రుచుల కలయికతో చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైంది. ఇందులో వేపపువ్వు పాత్ర కీలకం. ఈకాలంలో శరీరంలో పెరిగే కఫ దోషాన్ని వేప పువ్వు తగ్గిస్తుంది. మలినాల్ని పోగొట్టి, రక్తశుద్ధి చేస్తుంది. దీనివల్ల కడుపులో పురుగులు నశిస్తాయి.

తీపి.. మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైంది తీపి... అలాగని చక్కెరతో తయారయ్యే స్వీట్లు, కేకులూ, చాక్లెట్లు కాదు. బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి. శరీరానికి అవసరమైన చక్కెర (పిండిపదార్థాలు) వీటి నుంచి అందుతుంది. ఇది శరీరంలోని కణాలు నశించిపోకుండా, కొత్తకణాల పెరుగుదలకు, వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. డైటింగ్‌ పేరుతో వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అయితే తీపిని పరిమితంగా తీసుకుంటే మంచిది.

పులుపు... ఈ రుచి ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం లేకుండా ఉండటానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. దీన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అలాగే ఎక్కువగా తీసుకున్నా కూడా రక్తం దూషితమై పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.

ఉప్పు... శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. ఖనిజలవణాలు మనం వాడే ఉప్పు నుంచే కాకుండా...కాయగూరలు, పండ్ల నుంచి కూడా అందుతాయి. ఉప్పును ఎక్కువగా వినియోగించే ఊరగాయలు, చిప్స్‌, నిల్వ ఉంచే ఆహారపదార్థాలు, రసాయనాలు చేర్చినవాటిని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. చర్మం ముడతలు పడి వృద్ధాప్యఛాయలు త్వరగా వస్తాయి. వాత వ్యాధులు కలుగుతాయి.

కారం... ఉత్తేజాన్నిచ్చి, శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా పడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అయితే ఈ రుచిని కూడా కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. లేదంటే కడుపులో మంట, పిత్త సంబంధితమైన వ్యాధులు వస్తాయి. శరీరం బలహీనమవుతుంది. కోపం పెరుగుతుంది.

చేదు... దీన్ని కొద్దిగానే తీసుకోవాలి. రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను బయటికి పంపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. వేప, మెంతులు, గోరుచిక్కుడు వంటివి చేదు రుచికి ఉదాహరణలు. చేదును ఎక్కువగా తింటే శరీరం ఎండిపోయినట్లుగా మారి, బలహీనమవుతుంది. బాధ, దిగులు ఎక్కువవుతాయి.

వగరు... వగరు ఆహారంలో కొద్దిగా ఉండేలా చూసుకోవాలి. రక్తస్రావం ఎక్కువ కాకుండా, అలాగే చెమట అధికంగా పట్టకుండా, శరీరం దృఢంగా ఉండటానికి ఇది అవసరం. గాయాలు మాని, మంట తగ్గడానికి ఈ వగరు రుచి ఉన్న పదార్థాలు తోడ్పడతాయి. అయితే అతిగా తీసుకుంటే వాత వ్యాధులు, పేగుల్లో సమస్యలు వస్తాయి. మానసికంగా భయపడే లక్షణం ఎక్కువవుతుంది.

మీ ప్రశ్నలు ఇకపై vasuayur @eenadu.net కు పంపించగలరు.


మరిన్ని