close

ఆంధ్రప్రదేశ్

అవినీతిలేని పాలన అందిస్తాం 

13 జిల్లాల్లో ప్రజల కష్టాలను చూశా 
సాయం కోసం ఎదురుచూసే  ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటా 
పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు 
నర్సీపట్నం, డెంకాడ, అంబాజీపేట  ప్రచార సభల్లో జగన్‌ హామీలు 
చంద్రబాబు పాలన  దోపిడీమయం అంటూ ధ్వజం

‘‘రాష్ట్రంలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 13 జిల్లాల ప్రజల కష్టాలను చూశాను. సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి కుటుంబానికి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని మాట ఇస్తున్నాను. మరో 20 రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అవినీతి రహిత పాలన అందిస్తాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి’’ అని వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.‘‘చంద్రబాబు పాలనలో రేషన్‌కార్డు కావాలన్నా, పింఛను పొందాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అందరి ఆశీస్సులతో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతికి తావులేని, కులానికి అతీతమైన పాలన అందచేస్తా’’నని అన్నారు. 
ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం, విజయనగరం జిల్లా డెంకాడ, తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపాకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. 
ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు 
‘‘రాష్ట్రంలో 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసింది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తాం. డీఎస్సీలు నిర్వహించి అందరికీ ఉద్యోగవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చట్టసభలో మొదటి తీర్మానం చేస్తాం’’ అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మభూమి కమిటీలను రద్దుచేస్తామని, భూ రికార్డులను సర్వే చేసి అక్రమాలకు తావులేకుండా హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.‘‘అయిదేళ్లలో అందరినీ లక్షాధికారులను చేస్తాం. సంక్షేమ పథకాలను అమలు చేసేటప్పుడు కులమతాలనుచూడం, రాజకీయ పార్టీలను పట్టించుకోం. మీ భూములు, ఆస్తులను ఎవరూ ఆక్రమించుకోకుండా చట్టంలో మార్పులూ తీసుకువస్తాం.’’అని  భరోసా ఇచ్చారు. 

బాబు చేతిలో కీలుబొమ్మ సిట్‌ 
‘చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడంటే ఆయనే హత్య చేయిస్తారు. ఆ సాక్ష్యాలు లేకుండా చేయడానికి తానే తిరిగి సిట్‌ వేయిస్తారు. ఆ సిట్‌ ఎలా ఉంటుందంటే చంద్రబాబు సిట్‌ అంటే సిట్‌, స్టాండ్‌ అంటే స్టాండ్‌. అది ఆయన చేతిలో కీలుబొమ్మ.’ అని ఆరోపించారు.  రాష్ట్ర ప్రజలందరి ఆధార్‌, రేషన్‌కార్డు, ఫోన్‌నెంబర్లు, బ్యాంకు ఖాతా సంఖ్యలు సేకరించి సేవామిత్రలకి, జన్మభూమి కమిటీలకు, తన ప్రైవేటు సంస్థలకు అందజేసిన ముఖ్యమంత్రి ప్రజలకి భద్రత, భరోసా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాల్‌మనీ రాకెట్‌లో నిందితుడ్ని చంద్రబాబే దాచిపెట్టారని ఆరోపించారు. మహిళా తహసీల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడిచేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాని తాకట్టుపెట్టి ప్యాకేజీ తెస్తానంటూ భాజపా నేతలకు సన్మానాలు చేసి ప్రజల్ని మోసగించారన్నారు. ప్రతీ ఒక్కరికీ నిరుద్యోగభృతి కింద నెలకు రూ.2,000 చొప్పున ఇస్తామన్నారని, ఆ లెక్కన ప్రతీ నిరుద్యోగికి ఈ అయిదేళ్లలో రావలసిన రూ.1.20 లక్షలు అందలేదని ఆరోపించారు. గత ఐదేళ్లలో 108, ఆరోగ్యశ్రీ పథకాలకు ఎలాంటి భరోసా దక్కలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక పిల్లల్ని చదివించడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి పట్టిందని చెప్పారు. 
అంతా దోపిడీయే.. 
‘‘తెదేపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఇసుక, మట్టి, భూముల్ని వదల్లేదు. జన్మభూమి కమిటీల్ని నియమించి ప్రతీ పథకంలోనూ దోపిడీకి పాల్పడ్డారు. అయిదేళ్ల పాటు దొంగపనులు చేసి చట్టానికి దొరక్కుండా ఉండటానికి అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ప్రతీ కులానికి ఓ పేజీ కేటాయించి అందరినీ మోసగించారు’’ అని ఆయన ఆరోపించారు. దేశంలో 130 విమానాశ్రయాలంటే దాంట్లో 126 ఎయిర్‌ఫోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియానే నడుపుతోందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌ఫోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టెండరు దక్కించుకుంటే ఆ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పటికీ విజయనగరం ప్రజలు మాత్రం ఇప్పటికీ విమానాశ్రయం వస్తుందని ఎదురుచూస్తున్నారని చెప్పారు.అయిదేళ్ల పాటు డ్వాకా సంఘాలను  పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. 
ఒక్కసారి అవకాశం ఇవ్వండి 
‘‘వైకాపా అధికారంలోకి వస్తే పిల్లలను బడికి పంపిస్తే చాలు.. ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తాం. ఇంజినీరింగ్‌, వైద్యం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత చదువులకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం. పొదుపు సంఘాల సభ్యులకు బ్యాంకుల్లో ఉన్న రుణాలను నాలుగు దఫాల్లో పూర్తిగా రద్దు చేస్తాం. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తాం. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే మా ధ్యేయం. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.12,500 వంతున ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం. వృద్ధాప్య పింఛన్లు రూ.మూడు వేలు ఇస్తాం.’’ అని జగన్‌ హామీ ఇచ్చారు. ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. జగన్‌ సభల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పాల్గొన్నారు.

- ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే, 
ఈనాడు-విజయనగరం, రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు