close

ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ 80 శాతానికి చేరొచ్చు

ఈవీఎం సమస్యలు 0.03 శాతమే
ఏ పార్టీకి ఓటు వేశారో  వీవీప్యాట్లలో స్పష్టం
7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన వారు అరెస్ట్‌
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి
ఈనాడు డిజిటల్‌ - అమరావతి, తాడేపల్లి - న్యూస్‌టుడే

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ సరళిపై సంతృప్తిగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్‌ 80 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం సచివాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీకి ఓటు వేసినపుడు మరో పార్టీకి పడిందనేది వాస్తవం కాదని,  ఓటు ఏ పార్టీకి వేసిందీ వీవీ ప్యాట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 92 వేల ఈవీఎంలు ఉంటే 381    ఈవీఎంలలో మాత్రమే సమస్యలు వచ్చాయి. ఇది 0.03 శాతమే. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా మొరాయించాయి. వీటన్నింటిని పరిష్కరించాం. రాజకీయ దురుద్దేశ్యంతో చేసేవ్యాఖ్యలకు స్పందించం’’ అని చెప్పారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 25 హింసాత్మక ఘటనలు జరిగాయి. వీటిలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగింది. రీపోలింగ్‌కు కొన్నిచోట్ల ఫిర్యాదులు అందాయి. కేంద్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా రిటర్నింగ్‌ అధికారి నివేదిక ఇస్తారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఆరు చోట్ల మాక్‌ పోలింగ్‌ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించడంలో పోలింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారిపై చర్యలు ఉంటాయి. కొన్ని చోట్ల ఒకరిద్దరు ఉద్యోగుల కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ జిల్లాల పరిధిలో ‘సున్నా’ శాతం ఓట్లు నమోదైన పోలింగ్‌ కేంద్రాలు ఉండొచ్చు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలింగ్‌ జరగలేదు. దీనిపై రేపు నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు. తాము కోరినన్ని బలగాలు కేంద్రం నుంచి రాలేదని అన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు వరుసలో ఉన్న వారందరికీ పోలింగ్‌ అవకాశం కల్పించామని తెలిపారు.

ద్వివేదికి చేదు అనుభవం
ఈవీఎం మొరాయించడంతో వెనుదిరిగిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

రాజధాని ముఖద్వారమైన తాడేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఏడింటికి వచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి చేదు అనుభవం ఎదురైంది. తన నివాసానికి సమీపంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం నంబరు 35లో ఓటేసేందుకు ఆయన వచ్చారు. అప్పటికే ఈవీఎం, వీవీప్యాట్‌లు మొరాయించాయి. యంత్రాలను పరిశీలించి సంబంధిత ఇంజినీరును వెంటనే రప్పించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. దాదాపు 40 నిమిషాలపాటు ద్వివేది సిబ్బందితో కలిసి ఈవీఎం,   వీవీప్యాట్‌లను పరిశీలించి లోపాన్ని గుర్తించారు. యంత్రాలు తెచ్చే సమయంలో వాటిలోని డేటాను తొలగించకుండా మాక్‌పోలింగ్‌ నిర్వహించటం వల్ల పని చేయనట్లు తేల్చారు. యంత్రాలు బాగయ్యాక మాక్‌ ఓటింగ్‌ నిర్వహించేసరికి గంటన్నర సమయం పట్టింది. అప్పటికే భారీ సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఐదున్నరకు వచ్చి ఈవీఎంలను పరిశీలించాలని ఆదేశించినా అధికారులు చర్యలు తీసుకోలేదని, అందుకే ఈ సమస్య ఉత్పన్నమైందని ద్వివేది వివరించారు. ఉదయం ఏడింటిలోగా అన్నీ సరిచూసుకోవాలని చెప్పామన్నారు. ఎక్కడికక్కడ తమ ఇంజినీర్లను అప్రమత్తం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈవీఎంలలో ఉన్న డేటాను తొలగించకుండా కనెక్షన్‌ ఇచ్చినందున ఎర్రర్‌ చూపుతోందని వివరించారు. కేంద్రంలో యంత్రాలు పనిచేయకపోవడంతో ద్వివేది ఓటేయకుండానే వెనుదిరిగారు. సాయంత్రం మూడింటికి మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. రాష్ట్రంలో అన్ని ఈవీఎంలు సక్రమంగా పని చేస్తున్నాయని ద్వివేది తెలిపారు. 381 చోట్ల సమస్యలు వచ్చాయని, అన్నీ పరిష్కారమయ్యాయని చెప్పారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు