close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బాబు కోసమే ఈ థెరపీలు!

కన్నబిడ్డ ఎదుగుదలలో లోపం ఆ తల్లికి కునుకు లేకుండా చేసింది. ఆమె తిరగని ఆసుపత్రి లేదు. సమస్య తెలియక, ఎంచుకున్న చికిత్సలు సాంత్వన ఇవ్వక చాలా ఇబ్బందులే పడిందా తల్లి. అవన్నీ చూశాకే మరే చిన్నారీ తన బిడ్డలా బాధపడకూడదని ఓ పరిష్కారం వెతికింది. అదే పినాకిల్‌ బ్లూమ్స్‌. నాడీ సంబంధ సమస్యలు, లెర్నింగ్‌ డిజేబిలిటీస్‌, మానసిక ఇబ్బందులతో బాధపడేవారికి అవసరమైన థెరపీలను అందిస్తుందీ సంస్థ. ఆమే హైదరాబాద్‌కి చెందిన శ్రీజ సరిపల్లి.

ర్భం దాల్చినప్పటినుంచీ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నా. పొత్తిళ్లలో పిల్లాడిని చూసి ఎంత మురిసిపోయానో! కాలం గడిచేకొద్దీ బాబు సంహిత్‌  అమ్మా అని కూడా పిలిచేవాడు కాదు. భయమేసింది. ఇంట్లో పెద్దవాళ్లేమో ‘అబ్బాయిలు ఆలస్యంగానే మాట్లాడతారు’ అని నచ్చజెప్పేవారు. కొన్నాళ్లు ఓర్పు పట్టినా ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యులు ‘ఆటిజం’ అన్నారు. ఆ పదాన్ని అప్పుడే మొదటిసారి విన్నా. అది ఎందుకొస్తుందో తెలియదు కానీ... లక్షణాలను బట్టి సమస్యను గుర్తిస్తారు. అప్పటినుంచి నేను, మా వారు దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. వాటిని చదివితే మా అబ్బాయికి ఆ లక్షణాలు లేవనిపించింది. మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాం. ఈ సారి వినికిడి సమస్య అన్నారు. కాస్త కుదుట పడ్డాం. ముప్ఫై లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్‌ చేయించాం. అయినా సరే కొన్నాళ్లపాటు కొన్ని థెరపీలు చేయించాలన్నారు. నిజానికి ఆటిజం అయినా మరో సమస్య అయినా మొదటి దశలో గుర్తించగలిగితే... ఇంత క్లిష్టం కాదనీ చెప్పారు. అందుకే ఆ థెరపీలు తీసుకోవడం మొదలుపెట్టాం. నలభై ఐదు నిమిషాలు చేసే ఆ చికిత్సలో తల్లిదండ్రులుగా మేం ఎలా ఉండాలో సూచించేవారు కాదు. మేము అలా చెప్పాలని ఆశించేవాళ్లం. పైగా బాబుని లోపలికి తీసుకెళ్లి ‘ఈ రోజు మాట్లాడాడు. ఇవాళ ఏం స్పందించలేదు...’ అని అనేవారే తప్ప మా బాధని అర్థం చేసుకోలేకపోయేవారు. ఆ అసంతృప్తితో చాలా థెరపీ సెంటర్లనే మార్చాం. అన్ని చోట్లా అదే పరిస్థితి.

పరిశోధన చేశాం...
మాకు భారత్‌ హెల్త్‌కేర్‌ ల్యాబొరేటరీస్‌ అనే సంస్థ ఉంది. అక్కడ ఈ నాడీ సంబంధ సమస్యలు, పరిష్కారాలపై ఓ అధ్యయనమే చేశాం. ఆటిజం, ఏడీహెచ్‌డీ, స్లో లెర్నింగ్‌... ఇలా సమస్య ఏదైనా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది బాధపడుతున్నారని, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 11 లక్షల మంది ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయా. వీటిల్లో చాలా వాటికి చికిత్స లేదు. అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. కేవలం థెరపీలతో కొంత మార్పు తేవొచ్చు. ఇవన్నీ ఆలోచించే మేమే సొంతంగా ఓ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయాలనుకున్నాం. అలా మూడేళ్ల క్రితం పినాకిల్‌ బ్లూమ్స్‌ సంస్థను ప్రారంభించాం. ప్రస్తుతం ఇది ఏడు శాఖలతో పనిచేస్తోంది. ఉదాహరణకు... స్లో లెర్నర్స్‌ని తీసుకుంటే...

వాళ్లు అందరితో పాఠశాలకు వెళ్లినా... త్వరగా అర్థం చేసుకోలేరు. చదవలేరు, రాయలేరు. దాంతో అందరితో పోటీ పడలేక మానసికంగా కుంగిపోతారు. ఆయా పాఠశాలలు వారిని అక్కున చేర్చుకోవు. ఇలాంటి వారికి కూడా సైకలాజికల్‌ థెరపీలు అందిస్తాం. ఓ అబ్బాయి సరిగ్గా చదవక, రాయలేక పోతుంటే వినికిడి లోపం ఉందేమో అన్నారు టీచర్లు. ఆ తల్లిదండ్రులు కొన్ని ఆసుపత్రులకు తిప్పినా సమస్య గుర్తించలేకపోయారు. ఆర్థిక స్థోమతా అంతంతమాత్రమే కావడంతో ఇంట్లోనే చదువు చెప్పేవారు. మేం ఎనిమిది నెలల పాటు థెరపీని అందించాం. ఇప్పుడు అతడు చక్కగా చదువుతున్నాడు. రాస్తున్నాడు.

తల్లిదండ్రులకూ అవసరం...
ఈ థెరపీలు పిల్లలకే అవసరం అనుకోకూడదు. చిన్నారుల పరిస్థితిని బట్టి వారితో ఎలా మెలగాలో ఆ తల్లిదండ్రులకూ శిక్షణ అవసరమే. ఇలా ఇద్దరికీ ఉపయోగపడేలా ఈ సంస్థను అందుబాటులోకి తెచ్చాం. ఇవన్నీ ఖరీదుతో కూడుకున్న థెరపీలు. అయితే సామాన్యులకూ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో మా సేవా ఫౌండేషన్‌ ద్వారా...33 శాతం రిజర్వేషన్‌తో వారికి అవసరమైన సాయం అందిస్తాం. తెల్ల రేషన్‌కార్డు లేదా పాతికవేల రూపాయల జీతం కంటే తక్కువ ఉండే కుటుంబాల్లోని చిన్నారులకు ఆ సౌలభ్యం ఉంటుంది. ఇప్పటివరకూ ఇలా ఉచితంగా నూటయాభై మందికి అవసరమైన చికిత్సలు అందించాం. ఇకపైనా వీలైనంతమందికి సాయం చేస్తాం.

అన్నీ ఒక్కచోటే...
సాధారణంగా ఒక్కోచోట ఒక్కోరకమైన థెరపీ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ థెరపీలు అవసరమైనప్పుడు అన్నిచోట్లకు వెళ్లడం కష్టమే. అందుకే అన్నీ ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేశాం. ఇందుకోసం ఇప్పటి వరకూ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మా నాన్న పేపర్‌ కప్పులు రూపొందించే యంత్రాలను తయారు చేస్తారు. అమ్మ గృహిణి. ఇంటర్‌లోనే మేనమామ కోటిరెడ్డితో పెళ్లయ్యింది. ఆ తరువాత ఆయన ప్రోత్సాహంతో న్యూట్రిషన్‌ అండ్‌ డైటీషియన్‌ కోర్సు చేశా. మాకు కుటుంబ వ్యాపారం ఉంది. నేను భారత్‌ హెల్త్‌కేర్‌కి  డైరెక్టర్‌గా వ్యవహరిస్తూనే... పినాకిల్‌ బ్లూమ్స్‌ బాధ్యతలను చేపట్టా.

ప్రతిదానికీ ఓ థెరపీ...

నిజానికి ఆటిజం, ఏడీహెచ్‌డీలాంటి సమస్యలు  ఉన్న పిల్లల్ని పెంచడం చెప్పినంత సులువు కాదు. నలుగురిలో వారిని కట్టడి చేయలేం. వారి భావోద్వేగాలను నియంత్రించడం, రోజువారీ పనులు చేసుకునేలా చూడటం... వంటివన్నీ అలవాటు చేయడం సవాలే. అయితే ఇవన్నీ మొదట్లోనే గుర్తిస్తే... పరిస్థితి తీవ్రం కాకుండా థెరపీల ద్వారా కొంత నయం చేయొచ్చు. ఇక, కొంతమంది చిన్నారులు కనీసం అమ్మనీ గుర్తుపట్టరు. నీళ్లంటే భయం, వాసనలు భరించలేరు, అతిగా నవ్వుతారు, మాట్లాడతారు....ఇలా ఎన్నో ప్రవర్తనాపరమైన సమస్యలూ ఉంటాయి. వాటన్నింటినీ పోగొట్టాలి. కొన్నాళ్ల క్రితం ఓ అబ్బాయి మా దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మా అని కూడా పిలిచేవాడు కాదు. ఎనిమిది నెలల థెరపీ అనంతరం అమ్మా అని పిలిస్తే ఆ తల్లి ఎంత పొంగిపోయిందో! ఆ క్షణంలో నేనూ చాలా సంతోషించా. ఇలాంటి పిల్లలకు నడక, మాట, ప్రవర్తన అన్నీ పద్ధతి ప్రకారం వారికి అలవాటు చేయగలగాలి. మా దగ్గర ఆక్యుపేషనల్‌, ఫిజియో, సెన్సరీ ఇంటిగ్రేషన్‌, హైడ్రో, స్పీచ్‌, యోగా, గ్రూప్‌ టీచింగ్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌... వంటివెన్నో ఉన్నాయి.

మరిన్ని