మన బుల్‌ కుదురుకుంది.. కుమ్మేసింది..! - 5 Budget announcements that made Sensex jump 2000 points
close

Updated : 01/02/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన బుల్‌ కుదురుకుంది.. కుమ్మేసింది..!

* వారం తర్వాత మార్కెట్లో లాభాల సునామీ

* బ్రైట్‌ మండే ట్రేడింగ్‌ సెషన్‌
 
ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వారం రోజుల్లో దాదాపు రూ. 11 లక్షల కోట్ల నష్టాలు.. భల్లూక కౌగిలిలో చిక్కుకొని మార్కెట్‌ విలవిల్లాడింది. మరోపక్క బుల్‌ బడ్జెట్‌ టెన్షన్‌తో పడకేసింది. నేడు పార్లమెంట్‌లో సీతమ్మ బడ్జెట్‌ ప్రసంగం ఒక్క సారిగా బుల్‌లో జోష్‌ నింపింది. గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి చెప్పినట్లే ఈసారి మూల ధన వ్యయాలకు నిధులను పెంచడం మార్కెట్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే  మార్కెట్‌ సూచీల్లో హెవీవెయిట్‌ షేర్లు దూసుకుపోవడానికి అవసరమైన గన్‌పౌడర్‌ లాంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. ఫలితంగా సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 2,314 పాయింట్ల లాభంతో 48,600 వద్ద, నిఫ్టీ 646 పాయింట్ల లాభంతో 14,281 వద్ద ఉన్నాయి.  ఇక ప్రధాన రంగాలకు చెందిన అన్ని సూచీలు భారీగా పెరిగాయి. నేడు అత్యధికంగా లాభపడిన ప్రతిషేరు 10శాతానికి పైగా పెరిగిందంటే ఇన్వెస్టర్ల జోష్‌ అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ 14వేల మార్కును దాటేసింది. 

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, సుందరం క్లేటోన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌సీసీ, శ్రీరామ్‌ సిటీ షేర్లు భారీగా లాభపడగా.. కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌, జిందాల్‌ స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, న్యూక్లియస్‌ సాఫ్ట్‌వేర్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి. 

బుల్‌ జోరుకు కారణాలు..

కొత్త పన్నులు లేకపోవడం..

ఈ సారి కొవిడ్‌ ట్యాక్స్‌ విధిస్తారని సర్వత్రా ప్రచారం జరిగింది. ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో ఆ ఊసే తీసుకురాలేదు. దీనికి తోడు ఆదాయం కోసం ప్రభుత్వం ఈ సారి పన్నులపై ఎక్కువగా ఆధారపడలేదు. దీంతో ఆర్థికవ్యవస్థలోకి నగదు ప్రవాహం పెరుగుతుందనే సంకేతాలు ఇన్వెస్టర్లలోకి వెళ్లాయి. 

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడం

ప్రభుత్వం ఈ సారి ఎఫ్‌డీఐల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించింది. జీవిత బీమా రంగంలోకి ఎఫ్‌డీఐలను 49శాతం నుంచి 74శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికి తోడు యాజమాన్యం విషయంలో కొన్ని సరళమైన నిబంధనలను విధించారు. దీంతోపాటు జీవిత బీమా చట్టంలో సవరణల అంశం కూడా ఆర్థికమంత్రి ప్రస్తావించారు. దీంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌, న్యూఇండియా ఇన్స్యూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ , ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు 3 నుంచి 5శాతం వరకు లాభపడ్డాయి. 

పెట్టుబడుల ఉపసంహరణ..

ఆర్థిక మంత్రి ఈ సారి బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు వెల్లడించారు. దీంతోపాటు బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌ నిధులు కూడా ఇస్తామని తెలిపారు. దీంతో సెంట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బీవోబీ, కెనరా బ్యాంక్‌ షేర్లు భారీగా పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 3శాతానికి పైగా లాభపడింది. దీంతోపాటు కీలకమైన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడంతోపాటు.. ఒక బీమా కంపెనీని కూడా ప్రైవేటీకరిస్తామన్న ప్రకటన జోష్‌ నింపింది. బ్యాంకుల్లో మూలధన అవసరాలు తీర్చేందుకు రూ.20వేల కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 

తుక్కుపాలసీ ప్రకటనతో జోరు

ఆటోమొబైల్‌ పరిశ్రమకు డిమాండ్ పెంచేలా ప్రభుత్వం తుక్కుపాలసీని ప్రకటించింది. వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు. గత కొన్ని సంవత్సరాలుగా వేచిచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రానుండడంతో ఆటోమొబైల్‌ రంగం సానుకూల దిశగా పయనించే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో వాహన రంగంలోని షేర్లు దాదాపు 6శాతం వరకు లాభపడ్డాయి. మహీంద్రా, టాటామోటార్స్‌, హీరోమోటోకార్ప్‌, మారుతీ, బజాజ్‌ ఆటో షేర్లు దూసుకుపోయాయి. 
ఎల్‌ఐసీ ఐపీవో..

ఈ ఏడాది ఎల్‌ఐసీ ఐపీవోకు వస్తుందని ప్రభుత్వ ప్రకటించడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను పెంచింది. ఎల్‌ఐసీ ఐపీవోకు ఈ ఏడాదిని ఎంచుకోవడంతో ప్రభుత్వం నుంచి మార్కెట్‌ వ్యతిరేక నిర్ణయాలు ఉండకపోవచ్చనే  సంకేతాలు వెళ్లాయి. ఎందుకంటే అటువంటి నిర్ణయాలు ఎల్‌ఐసీ ఐపీవోను ప్రభావితం చేస్తాయి. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి. 

ఇవీ చదవండి

ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!

పెన్ను, పేపర్ లేకుండా జనాభా లెక్కింపు

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని