నిర్మలమ్మ సిక్సర్‌: అభివృద్ధికి ఆరు పిల్లర్లు! - 6 Pillars of Budget Nirmala
close

Published : 01/02/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మలమ్మ సిక్సర్‌: అభివృద్ధికి ఆరు పిల్లర్లు!

కేంద్ర బడ్జెట్‌ 2021-22లో కీలకాంశాలు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేలవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు పిల్లర్లుగా ఉండే కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, ఉద్యోగ కల్పన, మూలధనం, మౌలిక సదుపాలయాలపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పలువురు కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. అయితే, నిర్మలమ్మ చెప్పిన ఆరు పిల్లర్లు ఏమిటంటే..!

ఆరోగ్యం-శ్రేయస్సు..
కొవిడ్‌ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్యవ్యవస్థ ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రూ.2,23,846 కోట్లను వీటికి కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం పెరుగుదల అని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ఆరోగ్యం ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసమే రూ. 35వేల కోట్లను కేటాయించామని, ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్త్‌ భారత్‌ యోజన పథకానికి రూ.64వేల కోట్లు కేటాయించామన్నారు. వీటితో పాటు మిషన్‌ పోషణ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

భౌతిక ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97లక్షల కోట్లను దాదాపు 13రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు బడ్డెట్‌ ప్రసంగంలో కేంద్రమంత్రి వెల్లడించారు. తద్వారా ప్రపంచ సరఫరా గొలుసులో తయారీ సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడులతో ఏడు టెక్స్‌టైల్‌  పార్కులను ప్రారంభిస్తామని, జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీటిలో లక్ష కోట్ల విలువైన 217 ప్రాజెక్టులు పూర్తయినట్లు వెల్లడించారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా లక్షా 18వేల కోట్ల మూలధనంతో జాతీయ రహదారుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.  ఆర్థిక నడవాలను అభివృద్ధిచేయడంతో పాటు , రైల్వేలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

సమగ్రాభివృద్ధి..
దేశ ఆశయాలకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు గోధుమ, వరి, పప్పుధాన్యాల సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతున్నామని అన్నారు. చేపల పెంపకంలో పెట్టుబడులతో హర్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వలస కార్మికులు, కూలీలకు అండగా ఉండేదుకు వారికోసం ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇలా పలు రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

మూలధనం పెంపు..
మానవవనరుల విభాగంలో మూలధనం పెంచడంలో భాగంగా వారికి కావాల్సిన చదువు, నైపుణ్యాలకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వేల పాఠశాలలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100 సైనిక్‌ పాఠశాలలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లను నెలకొల్పుతున్నామని వెల్లడించారు.

ఇన్నోవేషన్‌ ఆర్‌&డీ..
జాతిప్రయోజనాలకు అనుగుణంగా పరిశోధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం ఇన్నోవేషన్, పరిశోధనాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్‌ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌(NTLM) విధానాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇక బ్రెజిల్‌తోపాటు భారత్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన PSLV-CS51 ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇన్నోవేషన్‌ కోసం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

కనిష్ఠ పాలన, అధిక పర్యవేక్షణ..
సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణలు తీసుకురావడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, తమ బడ్జెట్‌ రూపకల్పనలోనూ ఇవే ముఖ్యస్తంభాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు.

ఇవీ చదవండి..
ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!
బడ్జెట్‌ ‘ఎరుపు’ రంగు ఎందుకంటే..?


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని