close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడో త్రైమాసికంలో మాంద్యం ముప్పు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అంచనా

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మూడో త్రైమాసికంలో మాంద్యం ముప్పు పొంచి ఉందని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీస్‌ నివేదిక అంచనా వేసింది. ‘ఆదాయాలు, ఉద్యోగాలు కోల్పోవాల్సి రావడంతో వినియోగదారులు చాలా అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇందువల్ల వినియోగదారు గిరాకీ అంత సులభంగా కోలుకునే అవకాశం ఉండకపోవచ్చు. దేశ ఆర్థిక పునరుత్తేజం అనేది ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీ అమలు సమర్థత, వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ఉద్దీపన చర్యల ప్రభావం మూడు అంశాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. లాక్‌డౌన్‌ ఉపసంహరణకు తీసుకున్న సమయం, ఇటీవల ప్రకటించిన ఉద్దీపన చర్యల అమలులో సమర్థత, అమలుపరచడానికి పట్టే సమయం కీలకమ’ని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త అరుణ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అందరూ ఊహించిన దాని కంటే ప్రభుత్వం అతి పెద్ద ఉద్దీపన పథకం ప్రకటించడంతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ భారీ ఉద్దీపన పథకానికి తోడు ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటులో 40 బేసిస్‌ పాయింట్లు కోత విధించి 4 శాతానికి పరిమితం చేయడం, రుణ వాయిదాల మారటోరియంను మరో 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ ఫైనాన్సింగ్‌ సదుపాయం కల్పించడం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా ముందుకు నడిపించేందుకు దోహదపడతాయని నివేదిక అభిప్రాయపడింది. ‘ప్రభుత్వం ప్రకటించిన చర్యలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో సరఫరా వైపును బలోపేతం చేసే విధంగా ఉన్నాయి. అయితే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంద’ని అరుణ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్దీపన పథకంలో ప్రజల చేతుల్లోకి నేరుగా నగదు వెళ్లే అవకాశం లేకపోవడంతో వస్తు, సేవలకు గిరాకీ నిరుత్సాహకరంగా ఉంటుందని నివేదిక తేల్చింది.
బ్యాంకింగ్‌ రంగం వెలవెల: ప్రజల ఆదాయాలు తగ్గిపోవడంతో పాటు చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో వినియోగదారు సెంటిమెంటు దెబ్బతిని గిరాకీ మందగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. మొండి బకాయిలు పెరిగిపోయి బ్యాంకుల మీద ఒత్తిడి పెరగొచ్చని, దీంతో బ్యాంకింగ్‌ రంగం సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలిపింది. నాలుగో దశ లాక్‌డౌన్‌లో నిబంధనలు చాలావరకు సడలించినా, వ్యవస్థ అంత తొందరగా గాడిన పడే అవకాశం లేకపోవడంతో 2020-21 మూడో త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) భారత్‌లో మాంద్యం పరిస్థితులు తలెత్తుతాయని నివేదిక వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.