Microsoft: 2 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా మైక్రోసాఫ్ట్‌..! - Microsoft Joins Apple In Exclusive 2 Trillion dollar Club
close

Updated : 23/06/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Microsoft: 2 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా మైక్రోసాఫ్ట్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును సాధించింది. 2 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన రెండో అమెరికా కంపెనీగా నిలిచింది. ముఖ్యంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపారంలో అద్భుతమైన పురోభివృద్ధి సాధించడంతో కంపెనీ విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. అంతకుముందు ఈ రికార్డును యాపిల్‌ అందుకొంది. మంగళవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో కంపెనీ షేరు ధర 1.2 శాతం పెరగడంతో ఈ మార్కును దాటింది. రెండు ట్రిలియన్‌ డాలర్ల పోటీలో ఉన్నట్లు భావిస్తున్న సౌదీ అరామ్‌కో ప్రస్తుతం 1.9 ట్రిలియన్‌ డాలర్ల వద్ద ఉంది.

మార్పులతోనే సాధ్యం..

2014లో మైక్రోసాఫ్ట్‌ పగ్గాలు చేట్టినప్పటి నుంచి సత్య నాదెళ్ల పలు మార్పులు చేశారు. భ్యవిష్యత్తు ఆశాకిరణమైన క్లౌడ్‌ వ్యాపారంపై ఎక్కువ దృష్టిపెట్టేట్లు చూశారు. ప్రస్తుతం కంపెనీ ప్రపంచంలోనే అత్యధికంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ ఇన్ఫ్రా,ఆఫీస్‌ అప్లికేషన్ల యూనిట్లను బాగా విస్తరించింది. అమెరికా యాంటీ ట్రస్ట్‌ నియంత్రణ సంస్థ నుంచి సమస్యలు ఎదురుకాకుండా పనిచేసుకుపోవడం విశేషం.  2008-11 వరకు ఆయన క్లౌడ్‌ రంగంపై విశేషమైన పట్టు సాధించారు. ఆయన పగ్గాలు చేపట్టాక విండ్‌ డివిజన్‌ను, క్లౌడ్‌ డివిజన్‌ (అజ్యూర్‌)ను వేరు చేశారు. విక్రయ బృందాల్లో కూడా మార్పులు చేశారు. ఫలితంగా అమెజాన్‌ క్లౌడ్‌ వ్యాపారానికి బలమైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అది ఇప్పుడు ఉపయోగపడుతోంది. ఫలితంగా 130 బిలియన్‌ డాలర్లు విలువైన క్లౌడ్‌ మార్కెట్లో దాదాపు 20 శాతం వాటా దక్కించుకొంది.  మైక్రోసాఫ్ట్‌ ఆదాయాల్లో క్లౌడ్‌ వాటా 33.8 శాతంగా బ్లూమ్బె‌ర్గ్‌ పేర్కొంది. గతేడాది 24 శాతం వ్యాపార వృద్ధిని సాధించింది. 

షేర్లకు సత్య బూమ్‌..!

2014లో సత్యనాదెళ్ల పగ్గాలు చేపట్టే నాటికి మైక్రోసాఫ్ట్‌ ఇబ్బందుల్లో ఉంది. 2013లో కంపెనీ విలువ 310 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కానీ, అటువంటి కంపెనీని నాదెళ్ల తన నిర్ణయాలు, వ్యూహచతురతతో 2019 నాటికి ట్రలియన్‌ డాలర్ల మార్కును దాటించేశారు. 1975లో ప్రారంభమైన ఈ కంపెనీ  ట్రిలియన్‌ డాలర్ల విలువ దాటేందుకు 33 ఏళ్లు పట్టింది. అక్కడి నుంచి దాదాపు రెండేళ్లలోపే దానికి మరో ట్రిలియన్‌ డాలర్లు జోడించడం సత్య వ్యాపార కుశలతకు అద్దంపడుతుంది.  ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీ షేరు విలువ 19 శాతం పెరగడం విశేషం. ఈ విషయంలో యాపిల్‌, అమెజాన్‌ను వెనక్కి నెట్టేసింది.

కొవిడ్‌తో డిమాండ్‌ పుంజుకొని‌..

ముఖ్యంగా కొవిడ్‌19 వ్యాప్తి కారణంగా టెక్‌ వ్యాపారం పుంజుకోవడం బాగా కలిసివచ్చింది. లాక్‌డౌన్‌ల కారణంగా రిమోట్‌ పనివిధానం పెరిగింది. దీంతో కంపెనీ ఆన్‌లైన్‌ మీటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు, నెట్‌వర్కింగ్‌ సాఫ్ట్‌వేర్లు డిమాండ్‌ వచ్చింది. అంతేకాదు చాలా మంది ఇళ్లలో ఉండిపోవడవంతో గేమింగ్‌ విభాగమైన ఎక్స్‌బాక్స్‌కు డిమాండ్‌ పెరిగింది.



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని