స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్ పెద్దల‌కు లాభ‌దాయ‌క‌మేనా? - Senior-citizens-special-fixed-deposit-scheme
close

Published : 29/03/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్ పెద్దల‌కు లాభ‌దాయ‌క‌మేనా?

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో పాటు మ‌రికొన్ని ప్ర‌భుత్వ, ప్రవేట్ బ్యాంకులు ప్ర‌త్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ని అమ‌లు చేస్తున్నాయి. అయితే ఈ పథ‌కం మార్చి 31తో ముగియనుండ‌గా,  జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తాజాగా ప్ర‌క‌టించాయి.

బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ప‌డిపోతుండ‌టంతో సీనియ‌ర్ సిటిజ‌న్ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు గత సంవ‌త్స‌రం ‘మే’ లో ‘Wecare’ ను ప్రారంభించారు. 5 నుంచి 10 సంవ‌త్స‌రాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎస్‌బీఐ ప్ర‌స్తుతం ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా వ‌డ్డీ అందిస్తుంది.  

5-10 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎస్‌బీఐ 6.20శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. వడ్డీ రేట్లు త‌క్క‌వ‌గా ఈ స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ద్వారా ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తున్నప్ప‌టికీ,  5 సంవత్సరాల సుదీర్ఘ కాలం డబ్బును లాక్ చేయ‌డం మంచి ఆలోచన కాదు. అందువ‌ల్ల ఇలాంటి ప‌థ‌కంలో పెట్ట‌డం అంత ఆచ‌ర‌ణ‌యోగ్యం కాద‌ని  మ్యూచువల్ ఫండ్ పంపిణీ సంస్థ- ఫిన్వైస్ పర్సనల్ ఫైనాన్స్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకురాలు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రతిభా గిరీష్ అన్నారు.

వీటి స్థానంలో సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌,  లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ వ‌యో వంద‌న యోజ‌న కూడా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎంచుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు దిగువ‌న ఈ స‌మ‌యంలో ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ఎంచుకోవ‌డం ద్వారా కూడా అధిక ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చ‌ని ప్ర‌తిభా గిరీష్ తెలిపారు. 

పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ ప‌థ‌కం 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియ‌డ్‌తో వ‌స్తుంది.  ప్రస్తుత వ‌డ్డీ రేటు 7.4శాతం.  ఇది బ్యాంక్ ఎఫ్‌డిపై అందిస్తున్న వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ ప‌థ‌కంలో గరిష్టంగా రూ.15 ల‌క్షల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎలాంటి గ‌రిష్ట ప‌రిమితి లేదు. ముంద‌స్తు విత్‌డ్రాల‌పై రెండింటిలోనూ పెనాల్టీ విధిస్తారు. 

వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్‌స్కీమ్‌లో ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి ప్ర‌కారం రూ.1.5 ల‌క్షల వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంత వ‌ర‌కు సుర‌క్షితం?

ఒక ఉత్ప‌త్తి అధిక రాబ‌డినిస్తుదంటే, దానిలో రిస్క్ కూడా ఎక్కువ‌గా ఉంటుందని అర్ధం. బ్యాంకు ఎఫ్‌డీల‌కు ప్ర‌భుత్వ హామీ ఉండ‌దు. అయితే బీమా స‌దుపాయం ఉంది. డిపాజిట్ల‌ను చెల్లించ‌డంలో నిర్ధిష్ట బ్యాంకు విఫ‌ల‌మైతే  రూ.5 ల‌క్షల వ‌ర‌కు బీమా ఉంటుంది. స‌కాలంలో ప్రీమియం చెల్లించిన బ్యాంకు డిపాజిట్ల‌కు ఆర్‌బీఐ అనుబంధం సంస్థ డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ లిమిటెడ్(డీఐసీజీసీ) బీమా స‌దుపాయం క‌ల్పిస్తుంది. 

ఒక బ్యాంకులో ఉన్న..  పొదుపు ఖాతా, క‌రెంట్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్, రిక‌రింగ్ డిపాజిట్లు.. ఇలా అన్ని రకాల డిపాజిట్ల‌కు క‌లిపి బీమా వ‌ర్తిస్తుంది. బీమా బ్యాంకు మొత్తం ప్రాతిప‌దికన ల‌భిస్తుంది..కానీ ప్ర‌త్యేకించి ఏదో ఒక శాఖ‌కు కాదు. 

ఒక‌వేళ మీ బ్యాంకు సంక్షోభానికి లోనైతే, బ్యాంకు బీమా చేసిన‌ప్ప‌టికీ డ‌బ్బు వెంట‌నే తిరి‌గిరాదు. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి ఆరు నెలల నుంచి రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్ట‌చ్చు. 

అంతేకాకుండా బ్యాంకు దివాళ తీసీన రోజు వ‌ర‌కు మాత్ర‌మే మీ డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లిస్తారు. బ్యాంకు సంక్షోభానికి గురైన రోజు నుంచి సెటిల్‌మెంట్ చేసే మ‌ధ్య కాలానికి వ‌డ్డీ చెల్లించరు. కాబ‌ట్టి ఈ కాలంలో వ‌డ్డీ కోల్పోయే ప్ర‌మాదమూ ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని