కార్లలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ ఇంజిన్లు.. త్వరలో కంపెనీలకు ఆదేశాలు: గడ్కరీ - Will soon issue order mandating carmakers to introduce flex-fuel engines in vehicles: Gadkari
close

Published : 24/09/2021 19:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్లలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ ఇంజిన్లు.. త్వరలో కంపెనీలకు ఆదేశాలు: గడ్కరీ

పుణె: పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని, కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కార్లలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ (ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలతో నడిచే) ఇంజిన్‌లను అమర్చడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. మూణ్ణాలుగు నెలల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు పుణెలోని ఓ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

బీఎండబ్ల్యూ, మెర్సెడెస్‌ నుంచి టాటా, మహీంద్రా వరకు అన్ని కార్ల కంపెనీలకు ఫ్లెక్స్‌ ఇంజిన్లు అమర్చాలని రాబోయే 3-4 నెలల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు గడ్కరీ వివరించారు. ఇప్పటికే బజాజ్‌, టీవీఎస్‌ కంపెనీలకు ఫ్లెక్స్‌ ఇంజిన్లు అమర్చాలని సూచించానని చెప్పారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పూర్తిగా ఆగిపోయి, బయో ఇంధనాలతో నడిచే వాహనాలను చూడాలన్నదే తన కల అని వివరించారు. దీనివల్ల స్థానిక రైతులకు ఇథనాల్‌ రూపంలో ప్రత్యామ్నాయ ఆదాయం వస్తుందని వివరించారు. పుణెలో ఇది వరకే ప్రధాని మోదీ మూడు ఇథనాల్‌ పంపులను ప్రారంభించారని గుర్తుచేశారు.

శిలాజ ఇంధనాలు, కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వినియోగదారులకు ఊరట కల్పించడం వీలు పడుతుందని మంత్రి వివరించారు. పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.110 ఉండగా.. బయో ఇథనాల్‌ లీటర్‌ రూ.65కే లభిస్తుందని, దీనివల్ల విదేశీ మారకం సైతం ఆదా అవుతుందని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ తరహాలోనే బయో ఇంధనాలను సైతం అదే చోట విక్రయించాలని ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలకు సూచించినట్లు తెలిపారు. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ లేదా ఫ్లెక్సిబుల్‌ ఫ్యూయల్‌ను ప్రత్యామ్నాయ ఇంధనం అంటారు. గ్యాసోలిన్‌తో పాటు మిథనాల్‌ లేదా ఇథనాల్‌ కాంబినేషన్‌తో దీన్ని తయారుచేస్తారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని