close

తాజా వార్తలు

‘బడ్జెట్‌’మే సవాల్‌..!

 ఆర్థిక చక్రాన్ని ముందుకు కదిలించేలా బడ్జెట్‌2020
 
ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

భారత్‌ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది..2020 బడ్జెట్‌.. సమస్యలతో టీ20 మ్యాచ్‌లానే ఉండనుంది. ఏమాత్రం తేడా వచ్చినా.. కోలుకొనే లోపే ఫలితం తలకిందులయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక విష వలయంలో చిక్కుకొందనే చెప్పాలి. ఒకదానికి మరొకటి కారణమవుతూ వృద్ధి రేటును వెనక్కు గుంజుతున్నాయి. ప్రస్తుతం జీడీపీ వృద్ధిరేటు 11ఏళ్ల కనిష్ఠ స్థాయిలో 5 శాతానికి రావడం ప్రధాన సమస్యగా మారింది. దేశీయంగా డిమాండ్‌ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.. డిమాండ్‌ తగ్గడంతో ఉత్పాదక రంగం కుంటుపడింది.. ఫలితంగా పన్ను వసూళ్లు పడిపోయాయి.. దీంతో ద్రవ్యలోటు పెరిగిపోయి ప్రభుత్వ వ్యయం తగ్గింది.. వీటన్నిటి ప్రభావంతో ఉద్యోగాలు తగ్గిపోయి నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది... నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు పెరగడంతో ప్రజల చేతిలో డబ్బు లేక డిమాండ్‌ పడిపోయింది. ఇలా ఒక్కో అంశానికి మరో అంశం కారణమవుతూ ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుతున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం వీటిల్లో  కొన్నింటిని పరిష్కరించినా.. మిగిలిన సమస్యలకు కొంత ఉపశమనం లభించి ఆర్థిక వ్యవస్థ పుంజుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మఖ్యంగా దేశీయంగా డిమాండ్‌ పెరిగితే చాలా వరకు సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఈ సారి బడ్జెట్‌ కూడా ప్రభుత్వం డిమాండ్‌ను పెంచేలా చర్యలు తీసుకొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని అంశాలను ఇందు కోసం ప్రభుత్వం వినియోగించుకోనే అవకాశాలు ఉన్నాయి. 

ద్రవ్యలోటులో కొంత మినహాయింపు.. 

ప్రభుత్వం ఈ సారి వ్యయాన్ని పెంచేందుకు ద్రవ్యలోటు కట్టడి విషయంలో మరికొంత పట్టువిడుపు ధోరణిలో ఉండే అవకాశం ఉంది. గతం కంటే ఎక్కువగా ద్రవ్యలోటును చూపించి.. వ్యయాన్ని పెంచే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వ్యయాన్ని కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులపై పెట్టే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగాలు రావడంతోపాటు.. ఈ ప్రాజెక్టుల రూపంలో భవిష్యత్తులో ప్రభుత్వానికి మరిన్ని ఆదాయ వనరులు సమకూరుతాయి. వీటిల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చిన్నస్థాయి ప్రాజెక్టులు అయ్యే అవకాశం ఉంది.

పన్నుల్లో సంస్కరణలకు పదును

ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీఎస్‌టీలో ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత సరళంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. పన్ను విధానాల్లో సంక్లిష్టతలు తొలగిపోయే కొద్దీ పన్ను వసూళ్లు పెరుగుతుంటాయి. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని స్థిరంగా ఉంచి.. ద్రవ్యలోటును నిర్ణీత లక్ష్యంలో ఉంచేలా చేస్తుంది. 

వ్యవస్థలోకి నగదును పంపించడం..

వ్యవస్థలోకి నగదును ప్రవహింపజేసి డిమాండ్‌ను పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కానుంది. కాకపోతే ఇందుకోసం ప్రభుత్వం వద్ద రాబడి ఉండాలి. గత ఏడాది మొత్తంగా చూస్తే పన్ను వసూళ్లు తగ్గడంతో ప్రభుత్వ రాబడి తగ్గింది. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచకోవడం ద్వారా నగదు వినియోగించుకొనే అవకాశాలను ప్రభుత్వం మెరుగు పర్చుకోవచ్చు. ఇప్పటికే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం.. పన్ను మినహాయింపులు పెంచడం.. వంటి వాటితో ప్రజల వద్ద నగదు నిల్వలను పెంచవచ్చు.

2020లో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసి ప్రభుత్వం నిధులను సమకూర్చుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి ద్రవ్యలోటు పెరగడానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం తప్పడం కూడా ఒక ప్రధాన  కారణంగా నిలిచింది. ఇప్పటికే 2019-20లో లక్ష్యాన్ని చేరేందుకు మార్చి31వరకు గడువు ఉంది. ఈ లోపు ముందుగా నిర్ణయించిన సంస్థల్లో వాటాలను విక్రయించుకొంటే ప్రభుత్వం చేతికి నగదు అందుతుంది.  

ఎంపిక చేసిన రంగాలకు అధిక ప్రాధాన్యం..  

అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసి ఉద్యోగాలను పెంచవచ్చు. వ్యవసాయం, రియల్‌ఎస్టేట్‌, హౌసింగ్‌, రహదారుల నిర్మాణం, నీటిపారుదల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించి డిమాండ్‌ను పెంచవచ్చు.

అదే సమయంలో కేవలం డిమాండ్‌ తగ్గడం వల్లే రుణాలు చెల్లించలేని సంస్థల అప్పులను రోలోవర్‌ (చెల్లింపు గడువు పెంచి) చేసి ఆ సంస్థలను నిలబెట్టడం ద్వారా ఉద్యోగాలు పోకుండా చూడవచ్చు. లేకపోతే చాలా కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయి భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయి. 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా రిజర్వు బ్యాంకు ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేసింది. దీంతోపాటు దేశంలో సులభతర వాణిజ్యాన్ని ఆకర్షణీయంగా మార్చే సాహసోపేతమైన సంస్కరణలను వేగంగా పట్టాలపైకి ఎక్కించి పెట్టబడులను ఆకర్షించాలి. ఫలితంగా దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి.  

ఆర్థిక వ్యవస్థలో బలాలు.. బలహీనతలు 

బలహీనతలు

* జీడీపీ వృద్ధిరేటు 11ఏళ్ల కనిష్టానికి పడిపోవడం
* ఆర్థిక వ్యవస్థకు నగదును సమకూర్చే నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు ఇబ్బందుల్లో ఉండటం. ఇవి  తీవ్రమైన నగదు కొరత ఎదుర్కోవడం
* ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత డిమాండ్‌ను పెంచలేకపోవడం. గత ఏడాది ఐదుసార్లు వడ్డీరేట్లు తగ్గించినా డిమాండ్‌ పుంజుకోలేదు. 

బలాలు..

* దివాల చట్టాన్ని బలంగా అమలు చేయడంతో బ్యాంకులకు నగదు లభ్యత పెరిగింది. ఫలితంగా మరింత అప్పులు ఇచ్చేందుకు అవకాశం లభించింది.
* 2019 చివరి రెండు నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు పెరగడం భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాయి.
* ఆటోమొబైల్‌ పరిశ్రమలో సాంకేతికత మారుతుండటంతో బీఎస్‌-6 అమల్లోకి వచ్చాక కొనుగోళ్లు ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగాలు కూడా పెరగవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.