ప్రపంచం సాంకేతికతను అందిపుచ్చుకునే తీరుని సమూలంగా మార్చేసిన ఆయన.. ప్రచారానికి ఆమడదూరం; నాడు ఆయన ఆలోచనలను పరిహాసం చేసిన కొన్ని సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు.. అతని విజయాల ముందు సాగిలపడ్డాయి; జెఫ్‌ బెజోస్‌కు నీడగా.. అమెజాన్‌కు అండగా అండీ జాస్సీ ఉండటానికి ఇంతకన్నా అర్హతలేముంటాయి!

వాషింగ్టన్‌: ఆన్‌లైన్‌ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆండీ జాస్సీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కు సారధ్యం వహిస్తున్న ఆయన.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమెజాన్‌ సీఈఓ బాధ్యతలను స్వీకరిస్తారు. కాగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ జెఫ్‌ బెజోస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు.

పక్కా న్యూయార్కర్‌..

ఆండ్రూ ఆర్‌ జాస్సీ జనవరి 13, 1968న జన్మించారు. తల్లితండ్రులు మార్గరీ, ఎవరెట్‌ జాస్సీ న్యూయార్క్‌లోని స్కార్స్‌డేల్‌ పట్టణానికి చెందినవారు. తండ్రి ఎవరెట్‌ జాస్సీ ఓ కార్పొరేట్‌ న్యాయసేవా సంస్థ చైర్మన్‌, భాగస్వామిగా ఉండేవారు. జాస్సీ ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఆనర్స్‌, ఎంబీఏ పట్టాలను పొందారు. 53 ఏళ్ల ఆండీ సతీమణి ఎలానా రోచెల్లె కప్లాన్‌, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌. వీరి తండ్రులు కూడా ఒకే న్యాయ సలహా సంస్థలో భాగస్వాములు, స్నేహితులు కూడా. ప్రస్తుతం సియాటెల్‌లో నివసిస్తున్న జాస్సీ జంటకు ఇద్దరు పిల్లలు. న్యూయార్క్‌ నగరంలో పెరిగిన జాస్సీ.. న్యూయార్క్‌ స్పోర్ట్స్‌కు వీరాభిమాని. అందుకే ఆయన జాతీయ హాకీ టీం, సియాటెల్‌ క్రాకెన్‌ ఐస్‌ హాకీ టీమ్‌లో కూడా వాటాదారు అయ్యారంటారు.

దాడికీ, దానానికీ కూడా తయారే..

తన పేరు అంతగా బయటకు రాకుండా ప్రచారానికి, ఆర్భాటానికి దూరంగా ఉండటం ఆండీ జాస్సీ శైలి. కానీ సాంకేతిక రంగంలో మాత్రం ఆయన దశాబ్ద కాలంగా పతాక స్థాయిలోనే ఉన్నారు. వినియోగదారుడిని లోతుగా అర్థం చేసుకోవటం ఆండీ జెస్సీ లక్షణం. నవంబర్‌ 2020 నాటికి  377 మిలియన్‌ డాలర్ల నికర సంపద (సుమారు ఇరవై ఏడున్నర వేల కోట్ల రూపాయిలు) కలిగిన ఆండీకి సేవా దృక్పధం, దాతృత్వం కూడా అధికమే. పేద కుటుంబాల చిన్నారులకు అత్యుత్తమ పాఠశాలల్లో చదివేందుకు ఈయన చేయూతనిస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలకు విరాళాలిచ్చినా.. తన పేరు బయటకు రాకుండా చూసుకుంటారు.

అది వారిద్దరిలో కామన్‌..

1997లో అమెజాన్‌లో చేరిన ఆండీ.. తొలినాళ్లలో బెజోస్‌కు సాంకేతిక సలహాదారుగా వ్యవహరించారు. ఆండీతో ఎంతోకాలంగా సహోద్యోగులుగా ఉన్న వారు ఆయనను ‘జెఫ్‌ బెజోస్‌ నీడ’  అంటారు. అదే నిజం కూడా.. అమెజాన్‌కు సంబంధించి అతి కీలకమైన, విధానపరమైన విషయాలను చర్చించే ప్రతీ ఉన్నత స్థాయి సమావేశంలోనూ ఆండీ హాజరు తప్పనిసరి. మనసుకు నచ్చిన చిన్న చిన్న ప్రాజెక్టులకు మైక్రో మేనేజర్‌గా వ్యవహరించటం కూడా వీరిద్దరికీ ఉన్న ఉమ్మడి లక్షణం.

అభివృద్ధికి మూలస్తంభం

2006లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకు.. ఆండీ సంస్థ అభివృద్ధికి మూలస్తంభంగా ఉన్నారు. అత్యంత త్వరితంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలో భారీగా వ్యాపారావకాశాలున్నాయని.. అందరికంటే ముందే గుర్తించడం ఆయన  ఆయన దూరదృష్టికి నిదర్శనం.. అమెజాన్‌ ఘన విజయానికి సోపానం. కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ సేవలను ఏకమొత్తంగా కాకుండా చిన్న భాగాలుగా వర్గీకరించటం.. వాటిని అధిక మొత్తాలకు కొనుగోలు చేయనవసరం లేకుండా ఇంటర్నెట్‌ ద్వారా అద్దెకివ్వటం వంటి నూతన విధానాలతో ప్రపంచం సాంకేతికతను అందిపుచ్చుకునే విధానాన్నే ఆయన మార్చేశారు. ఇదిలా ఉండగా వినియోగదారులను, వాణిజ్యం విభాగాలను అర్థం చేసుకోవడమే అమెజాన్‌ సీఈవోగా ఆండీ జాస్సీ ముందున్న ప్రధాన సవాళ్లు.

ఇవీ చదవండి..

తప్పుకోనున్న జెఫ్‌ బెజోస్‌

వేలానికి హిట్లర్‌ వస్తువు