close

తాజా వార్తలు

బడ్జెట్‌ ప్రసంగం అర్థమవుతోందా..?

పద్దు ప్రవేశపెడుతున్న తీరిలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వాలను బట్టి బడ్జెట్‌లో ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. అంకెల విషయం ఎలా ఉన్నా పద్దును ప్రవేశపెడుతున్న సమయంలో ఆర్థిక మంత్రులు చేసే ప్రసంగాలే ఆయా ప్రభుత్వ విధానాలను తెలియజేస్తుంటాయి. సగటు మనిషి సైతం వారి ప్రసంగాన్ని వినే బడ్జెట్‌పై ఓ అంచనాకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆయా మంత్రులు వారి బడ్జెట్‌ ప్రసంగాన్ని ఎలా రూపొందించారు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారో ఓ లుక్కేద్దాం..!

తొలినాళ్లలో ప్రణాళికకు పట్టం...

భారత బడ్జెట్‌ చరిత్ర దేశ ఆర్థిక చరిత్రకు తార్కాణంగా నిలుస్తుంది. 1950-51లో తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన జాన్‌ మతాయ్‌ ప్లానింగ్‌ కమిషన్‌ ఏర్పాటు ప్రకటనతో ప్రణాళికా తరహా విధానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటారు. ఆ విధానం 1991 మన్మోహన్‌ సరళీకృత ఆర్థిక విధానాల అమలుతో కనుమరుగవుతూ వస్తోంది. అంతకు ముందు ప్రణాళిక అన్న పదం బడ్జెట్‌ ప్రసంగాల్లో ఎక్కువగా వినిపించేది. కానీ, ఆర్థిక సంస్కరణల తర్వాత ఆ విధానానికి క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. తాజాగా దేశం, దేశ భద్రత అన్న విధానానికి ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. 


తగ్గుతున్న పదాలు...

ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ 1991లో మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్‌ ప్రసంగం. నాటి బడ్జెట్‌ 18,700 పదాలతో సుదీర్ఘంగా కొనసాగింది. ఇక పలువురు మంత్రులు తమ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్‌ ప్రసంగాల్లో.. యశ్వంత్‌సిన్హా సగటున 15,700 పదాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లు పెద్దవిగా నిలిచాయి. ఇక యశ్వంతరావు చవాన్‌ 9,700, మొరార్జీ దేశాయ్‌ 10,000 పదాలతో చిన్న బడ్జెట్‌ ప్రసంగాలుగా చరిత్రలో నిలిచాయి. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్‌ 11,000 పదాలతో 2018-19లో తన పద్దును ప్రజలకు వివరించారు.

పెరిగిన కఠినత్వం...

పదాలపరంగా ప్రసంగాల నిడివి తగ్గుతున్నా పదాల్లో మాత్రం కఠినత్వం పెరుగుతూ వస్తోంది. 1991కి ముందునాటి ప్రసంగాల్లో సామాన్య ప్రజలకు అర్థమయ్యే పదాలు విస్తృతంగా వినియోగించారు. కానీ, అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రసంగం ఎంతవరకు చదవగలం అనే అంశాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ‘ఫ్లెష్‌-కిన్సైడ్‌ రీడింగ్‌ ఈజ్‌’ స్కోర్‌ ప్రకారం..జైట్లీ, సిన్హా ప్రసంగాలు అత్యంత కఠినంగా ఉన్నట్లు తేలిందని ఓ ప్రముఖ జాతీయ పత్రిక తెలిపింది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో చింతామన్‌ ద్వారక్‌నాథ్‌ దేశ్‌ముఖ్‌, మొరార్జీ దేశాయ్‌ పద్దులు చదవడానికి సులువుగా ఉన్నట్లు గుర్తించారు. 

వ్యవసాయం రంగంలో పండని పంట..

ఇక ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ప్రముఖంగా వినిపించే రంగం వ్యవసాయం. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ప్రతి బడ్జెట్‌లో ప్రస్తావిస్తూ.. తీసుకోబోతున్న చర్యల్ని వివరిస్తారు. అలాగే కల్పించబోతున్న రాయితీలు, కొత్త పథకాలు, నీటి పారుదలకు కేటాయిస్తున్న నిధులకు క్రమం తప్పకుండా వివరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఆ రంగంలో గణనీయ మార్పు కనిపించకపోవడం విచారకరం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.