క్రెడిట్ కార్డుతో డ‌బ్బు విత్‌డ్రా చేస్తున్నారా? - do-you-withdrawal-money-from-a-credit-card
close

Published : 03/05/2021 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్ కార్డుతో డ‌బ్బు విత్‌డ్రా చేస్తున్నారా?

క్రెడిట్ కార్డు అందించే అనేక ప్రయోజనాల్లో నగదు ఉపసంహరణ కూడా ఒకటి. ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయినప్పుడు, క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును ఉపసంహరించుకోవడం అంత శ్రేయస్కరం కాదు. అలా చేయడం ద్వారా మీరు అనేక చార్జీలను బ్యాంకుకు చెల్లించాల్సి రావచ్చు.

ఉదాహరణకు, ఒకవేళ క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదును ఉపసంహరించుకున్నట్లైతే, మీరు తీసుకున్న మొత్తం ఆధారంగా నెలకు సుమారు 2.5 నుంచి 3 శాతం వరకు రుసుము వసూలు చేస్తారు, కనీసం మొత్తం రూ. 500 నుంచి రూ. 700 వరకు ఉంటుంది, అయితే ఇది కొన్నిసార్లు తక్కువగా, అలాగే కొన్నిసార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అలాగే ఈ చార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా మారుతూ ఉంటాయి.

అలాగే, కేవలం ఉపసంహరణ ఫీజు మాత్రమే కాకుండా, లావాదేవీకి సంబంధించిన వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, సాధారణంగా మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు, 45 రోజుల వడ్డీ రహిత సమయం ఉంటుంది. నిర్దిష్ట వ్యవధిలోగా బకాయిలను చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, అవుట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీని బ్యాంకు వసూలు చేస్తుంది. అయితే, క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించినట్లైతే, వడ్డీ రహిత సమయాన్ని ఉండ‌ద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. నగదు ఉపసంహరించుకున్న రోజు నుంచి తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించే వరకు పూర్తి మొత్తంపై వడ్డీ, ఫైనాన్స్ ఛార్జీలను విధిస్తారు.  ఈ వడ్డీ రేటు అనేది ఒక్కో బ్యాంకుకు ఒక్కో మాదిరిగా ఉంటుంది. అలాగే ఇది వార్షికంగా 48 శాతం వ‌ర‌కు ఉండొచ్చు.

క్రెడిట్ కార్డుల ద్వారా నగదును పొందడం చాలా సులభమైన, అలాగే అనుకూలమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే, క్రెడిట్ కార్డు ద్వారా నగదును పొందే ముందే దానిపై విధించే వడ్డీ రేటు, ఇతర చార్జీలను ఒకసారి పరిగణలోకి తీసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరించుకుంటే అమలయ్యే కొన్ని రకాల చార్జీల వివరాలను కింద చూద్దాం.

నగదు ఉపసంహరణ ఫీజు ..
క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకున్న ప్రతిసారీ ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉపసంహరించిన మొత్తంపై 2.5 నుంచి 3 శాతం వరకు ఉంటుంది.

వడ్డీ ..
క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణలపై వడ్డీని నెలవారీ ప్రాతిపదికన వసూలు చేస్తారు. లావాదేవీ చేసిన తేదీ నుంచి తీసుకున్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించేంత వరకు వడ్డీ విధిస్తారు. బ్యాంకులు అన్ని నగదు లావాదేవీలపై నెలకు 2.5 నుంచి 4 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వడ్డీ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటాయి.

ఆలస్యపు చెల్లింపు ఫీజు..
ఒకవేళ మీరు ఉపసంహరించుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే, అప్పుడు మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ పై 15 శాతం నుంచి 30 శాతం వరకు ఆలస్యపు చెల్లింపు ఛార్జీలను విధిస్తారు. 

చివ‌రిగా ..
పై అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకోవడం మానేసి, మరొక మార్గంలో అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని