close

Published : 26/01/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముకేశ్‌ సెకను సంపాదన.. సామాన్యుడి మూడేళ్ల ఆర్జన

కరోనాతో ఆదాయాల్లో మరింత అసమానతలు

మార్చి నుంచి రూ.13 లక్షల కోట్లు పెరిగిన 100 మంది కుబేరుల సంపద

13.8 కోట్ల మందికి రూ.94,045 చొప్పున పంచొచ్చు

ఆక్స్‌ఫ్యామ్‌ నివేదిక

దిల్లీ

దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో కార్యకలాపాలు స్తంభించి, పనులు లేక ప్రజల ఆదాయాలు తీవ్రంగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో భారత్‌లోని అపర కుబేరుల్లో తొలి 100 మంది సంపద రూ.12,97,822 కోట్ల మేర పెరగడం గమనార్హం. ఈ డబ్బుతో దేశంలోని 13.8 కోట్ల మంది పేదలు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున ఇవ్వొచ్చట. అత్యంత కుబేరుడైన ముకేశ్‌ అంబానీ ఒక గంటలో ఆర్జించిన డబ్బు సంపాదించేందుకు, నైపుణ్యం లేని ఒక సాధారణ కార్మికుడికి 10,000 సంవత్సరాలు పడుతుందట. ముకేశ్‌ అంబానీ ఒక సెకనులో ఆర్జించిన డబ్బును కూడబెట్టాలన్నా, ఇలాంటి కార్మికులకు మూడేళ్లు అవసరం అవుతుందట. ‘ద ఇన్‌ఈక్వాలిటీ వైరస్‌’ (వైరస్‌ ప్రభావంలో అసమానతలు) పేరుతో రూపొంచిందిన నివేదికలో ఆక్స్‌ఫ్యామ్‌ ఈ విషయాలను వెల్లడించింది. నివేదిక రూపకల్పన నిమిత్తం 79 దేశాల్లోని 295 ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు సంస్థ తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్‌ చర్చల ప్రారంభ రోజునే ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. ఈ ప్రకారం..
* కొవిడ్‌-19.. గత వందేళ్లలో ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిన అత్యంత దుర్భర పరిణామం. 1930లో వచ్చిన మహామాంద్యం స్థాయిలో ఆర్థిక వ్యవస్థలను సంక్షోభాల్లోకి నెట్టింది. దేశంలో ధనిక, పేదల మధ్య ఆదాయ వ్యత్యాసాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
* బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణకు అత్యంత తక్కువ కేటాయింపులు జరిపే దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానం. కొవిడ్‌ సంక్షోభ సమయంలో దేశంలోని 11 మంది దిగ్గజ శ్రీమంతులు ఆర్జించిన ఆదాయాలపై 1 శాతం పన్ను విధిస్తే జన్‌ఔషధి పథకానికి 110 రెట్లు అధికంగా కేటాయింపులు చేయొచ్చు.  వీరు పెంచుకున్న సంపదతో గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ పథకాన్ని 10 ఏళ్ల పాటు నడిపించవచ్చు.
* లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి శ్రీమంతులు తప్పించుకున్నారు. ఇంటి వద్ద నుంచే పని చేస్తూ స్థిరవేతన ఉద్యోగులు కూడా బయటపడగలిగారు. కాని 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో 75 శాతం మంది అంటే 9.2 కోట్ల మంది అసంఘటిత రంగానికి చెందిన వాళ్లే.  
* బొగ్గు, చమురు, టెలికాం, ఔషధాలు, విద్య, రిటైల్‌ విభాగాల్లో వ్యాపార కార్యకలాపాలున్న గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌, సైరస్‌ పూనావాలా, ఉదయ్‌ కోటక్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, సునీల్‌ మిత్తల్‌, రాధాకిషన్‌ దమాని, కుమార్‌ మంగళం బిర్లా, లక్ష్మీ మిత్తల్‌ ఆదాయాలు 2020 మార్చి నుంచి గణనీయంగా పెరిగాయి.
* 2020 ఏప్రిల్‌లో గంటకు 1,70,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ నెలలో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. మహిళల నిరుద్యోగిత 15 శాతం మేర పెరిగింది.
* కరోనా కాలంలో అంబానీ ఆర్జించిన డబ్బుతో కనీసం 40 కోట్ల మంది సాధారణ కార్మికులు పేదరికంలోకి జారుకోకుండా, కనీసం ఐదు నెలల పాటు కాపాడవచ్చు.
* లాక్‌డౌన్‌ సమయంలో భారత శ్రీమంతుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుంచి ఇప్పటికి వీరి సంపద 90 శాతం హెచ్చి 422.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. శ్రీమంతుల సంపద వృద్ధిలో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్‌ తర్వాత భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది.
* లాక్‌డౌన్‌ కారణంగా ఆత్యహత్యలు, సరైన సమయంలో చికిత్స అందకపోవడం, ఆకలి బాధలతో 300 మందికి పైగా అసంఘటిత కార్మికులు చనిపోయారు.  
* పాఠశాలలను సుదీర్ఘకాలం పాటు మూసివేయడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పెరగొచ్చు.
* గ్రామీణ ప్రాంతాల్లో 4 శాతం కుటుంబాల్లోనే కంప్యూటర్లుంటే, 15 శాతం కంటే తక్కువ కుటుంబాలకే ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది.
* ఆరోగ్య, వైద్య సదుపాయాలు, ఆదాయాల్లో కరోనా తీసుకొచ్చిన అసమానతలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆక్స్‌ఫ్యామ్‌ ఇండియా సీఈఓ అమితాబ్‌ బెహర్‌ అన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని