close

Updated : 25/02/2021 06:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాటరాని మార్కెట్ ఇది..

సాంకేతిక కారణాలతో ఎన్‌ఎస్‌ఈలో నిలిచిన ట్రేడింగ్‌

 గం.11.40 నుంచి దాదాపు 4 గంటల పాటు షేర్లు, సూచీలు ఎక్కడివక్కడే ః గం.3.30కు పునఃప్రారంభం
ఎక్స్ఛేంజీ చరిత్రలో ఇంతసేపు ఆగడం ఇదే మొదటిసారి  ః బీఎస్‌ఈలో యథావిధిగా ట్రేడింగ్‌
సెన్సెక్స్‌కు 1,030 పాయింట్ల లాభం ః 274 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

రైలు మార్గ మధ్యంలో ఆగింది. ఎప్పుడు కదులుతుందో తెలియదు. ఒకతనేమో రైలు ఫలానా కారణం వల్ల ఆగిందని అంటాడు.. ఇంకో అతనేమో మరికాసేపట్లో కదులుతుందని చెబుతాడు. రైలు ఆగడానికి అసలు కారణం ఇతనికి తెలియదు..
ఎప్పుడు కచ్చితంగా కదులుతుందో అతనికి తెలియదు. అయినా కానీ మన చెవిని తాకే ఆ మాటలు వింటూనే లోలోన రైలు ఎప్పుడు కదులుతుందోనని ఆందోళన చెందుతుంటాం. ఉక్కపోత భరించలేక చిన్న పిల్లల ఏడుపులు.. వృద్ధుల ఆపసోపాలు..
తోటి ప్రయాణికుల తగువులాటలు.. ఇలా అన్నింటిని చూస్తూ దేవుడా రైలు వెంటనే కదిలేలా చూడు అని ప్రార్థిస్తుంటాం.. రైలు ప్రయాణం మధ్యలో ఆగినప్పుడు ఓ ప్రయాణికుడి బాధ ఇంత వర్ణనాతీతంగా ఉంటే.. లక్షల కోట్ల రూపాయలతో ముడిపడిన స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా నిలిచిపోతే మదుపరిలో క్షణక్షణానికి పెరిగే ఆందోళన కొలవడానికి బీపీ మిషన్లూ సరిపోవు.. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. షేర్ల కదలికలు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ట్రేడింగ్‌ ప్రారంభం అవుతుందోనని సర్వత్రా ఉత్కంఠ. పునఃప్రారంభం కాకుంటే ఏం చేయాలని దానిపై బ్రోకరేజీల కసరత్తు... ఎప్పుడూ లేనివిధంగా మళ్లీ గం..3.30 తర్వాత ట్రేడింగ్‌ తిరిగి మొదలుకావడం.. సూచీలు భారీ లాభాలతో ముగియడం..ఇలా ఎన్నో రకాల అనూహ్య అనుభవాలకు నిన్నటి రోజు వేదికయ్యింది.


గం.9.00: స్టాక్‌ మార్కెట్‌ ప్రతి రోజులానే ఆరంభమైంది. సూచీలు లాభాలతో శుభారంభం చేశాయి. కొంత సేపు తర్వాత ఎన్‌ఎస్‌ఈలో సాంకేతిక సమస్యతో షేర్ల కదలికలు ఆగాయి. డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల్లో మాత్రం ధరలు మారుతున్నాయి. సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని, వెంటనే సాధారణ స్థితికి తెస్తామని ఎక్స్ఛేంజీ తెలియజేసింది. బీఎస్‌ఈలో మాత్రం కదలికలు ఎప్పటిలాగానే ఉన్నాయి.


గం.11.40: సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈక్విటీ, డెరివేటివ్స్‌, కరెన్సీలో ట్రేడింగ్‌ను ఎన్‌ఎస్‌ఈ నిలిపివేసింది. వెంటనే ట్రేడింగ్‌ను పునరిద్ధరిస్తామని తెలిపింది. దీంతో మదుపర్లు ట్రేడింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ఎదురుచూస్తూ కూర్చున్నారు.


గం.1.00: ఎన్‌ఎస్‌ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ట్రేడింగ్‌ను పునఃప్రారంభించవచ్చనే వార్తలతో మదుపర్లు ఆశగా ఎదురుచూశారు. కానీ ట్రేడింగ్‌ ప్రారంభం కాలేదు.   ఎన్‌ఎస్‌ఈ నుంచి కూడా కచ్చితమైన సమయంపై ఎలాంటి స్పష్టత రాలేదు.


గం.2.45: ట్రేడింగ్‌ సమయం ముగియడానికి దగ్గరపడటం.. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌ పునరుద్ధరణపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో మదుపర్లలో ఆందోళన పెరిగిపోయింది. మార్జిన్లతో ఇంట్రాడే ట్రేడింగ్‌ చేసే వాళ్ల బాధ మరోరకం. రేపటి వరకు పొజిషన్లను బ్రోకరేజీలు కొనసాగిస్తాయా? లేదా.. స్క్వేర్‌ ఆఫ్‌ చేస్తాయా? ఒకవేళ స్క్వేర్‌ ఆఫ్‌ చేస్తే నష్టపోవాల్సి వస్తుందా? అనే ప్రశ్నలు వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంట్రాడే ఆర్డర్లను ఏం చేయాలనే దానిపై అటు బ్రోకరేజీ సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి.


గం.3.00: ఈక్విటీ, ఫ్యూచర్స్‌, ఆప్షన్లు అన్ని విభాగాల్లో కొత్త ఆర్డర్లను బ్రోకరేజీలను రద్దు చేశాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఇంట్రాడే ఆర్డర్లను మరుసటి రోజుకు కొనసాగిస్తామని, బుధవారం కొన్న ధరే ఉంటుందని బ్రోకరేజీలు తెలియజేశాయి. ఎలాంటి రుసుములూ ఉండవని తెలిపాయి.


గం.3.30: అనూహ్యంగా ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌ పునఃప్రారంభమైంది. సాయంత్రం గం.5:00ల వరకు కొనసాగుతుందని తెలియజేసింది. దీంతో యధావిధిగా అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ జరిగింది. ట్రేడింగ్‌ పునఃప్రారంభమయ్యాక సూచీలు, షేర్లు తీవ్ర ఊగిసలాట మధ్య కదలాడాయి. గం.4:00 తర్వాత ఒక్కసారిగా భారీ లాభాల వైపు పరుగులు తీశాయి. అప్పటివరకు స్తబ్దుగా ఉన్న షేర్లు కూడా ఒక్కసారిగా దూకుడుగా కదలాడాయి. నిఫ్టీతో సమానంగా అటు సెన్సెక్స్‌ కూడా జోరు పెంచింది.


గం.5.00: గంటన్నర పాటు పొడిగించిన ట్రేడింగ్‌లో చివరకు సెన్సెక్స్‌ 1,030.28 పాయింట్ల లాభంతో 50,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 274.20 పాయింట్లు పెరిగి 14,982 వద్ద స్థిరపడింది.


వివరణ అడిగిన సెబీ
సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం (డిజాస్టర్‌ రికవరీ సైట్‌) వైపు ఎందుకు వెళ్లలేదో తెలియజేయాలని ఎన్‌ఎస్‌ఈని సెబీ వివరణ అడిగింది. ట్రేడింగ్‌ నిలిపివేతకు సంబంధించి పూర్తి కారణాలను తెలియజేయాలని సూచించింది. కాగా.. కనెక్టివిటీ కోసం రెండు టెలికాం సంస్థలపై ఆధారపడ్డామని, అయితే ఆ రెండు సంస్థలూ విఫలమవ్వడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని