close

Published : 26/02/2021 06:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెన్సెక్స్‌ 51000.. నిఫ్టీ 15000 పైకి

సమీక్ష

సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు గురువారం దేశీయ మార్కెట్లను ముందుకు నడిపించాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు ఏకంగా రూ.28,739.17 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేయడాన్ని ట్రేడర్లు సానుకూలంగా భావించారు. 2021-22లో భారత వృద్ధిరేటు 13.7 శాతంగా నమోదు కావొచ్చన్న మూడీస్‌ అంచనా కూడా ఉత్తేజం కలిగించింది. కీలక రేట్ల పెంపు ఇంకొన్నేళ్లు ఉండకపోవచ్చని యూఎస్‌ ఫెడ్‌ ప్రకటించడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గి, అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌, టోక్యో లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లూ సానుకూలంగా కదలాడాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 8 పైసలు తగ్గి, 72.43 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 51,207.61 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో 51,386.12 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ఒక దశలో 50,991.76 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసినా, చివరకు 257.62 పాయింట్ల లాభంతో 51,039.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 115.35 పాయింట్లు లాభపడి 15,097.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,176.50-15,065.35 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ 4.66%, ఎన్‌టీపీసీ 4.55%, ఆర్‌ఐఎల్‌ 3.84%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.7%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.94%, పవర్‌గ్రిడ్‌ 2.29%, టీసీఎస్‌ 1.41%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.29%, సన్‌ ఫార్మా 1.19%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.06%, ఎంఅండ్‌ఎం 1.05% చొప్పున రాణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.1%, నెస్లే ఇండియా 1.45%, ఎల్‌అండ్‌టీ 1.2% మేర నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1,752 షేర్లు సానుకూలంగా, 1,213 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి.

టెల్కోల నివేదిక కోసం చూస్తున్నాం: ఎన్‌ఎస్‌ఈ

బుధవారం నాలుగు గంటల పాటు ట్రేడింగ్‌ నిలిచిపోవడానికి కారణం ‘ఆన్‌లైన్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ లేకపోవడమేనని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) పేర్కొంది. ఈ ఆటంకానికి మూల కారణంపై 2 టెలికాం సేవల కంపెనీలు, వెండర్ల నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు ఎక్స్ఛేంజీ తెలిపింది. ఈ విషయంలో సంస్థాగత వైఫల్యాలతో పాటు అన్ని కారణాలను వెలికితీస్తామని సెబీ తెలిపింది. ట్రేడింగ్‌ నిలిపివేతకు 10 నిమిషాల ముందు మాత్రమే ‘టెలికాం సర్వీసు ప్రొవైడర్ల సమస్య వల్లే’ అలా చేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తమకు సమాచారం అందించిందని సెబీ వివరించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని