సంక్షిప్త వార్తలు
close

Updated : 06/05/2021 06:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

‘రోష్‌’ నుంచి మిశ్రమ ఔషధం
అత్యవసర అనుమతి ఇచ్చిన సీడీఎస్‌సీఓ

దిల్లీ: స్విస్‌ సంస్థ అయిన రోష్‌, కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే ఒక మిశ్రమ ఔషధాన్ని మనదేశంలో అందించనుంది. కసిరివిమ్యాబ్‌, ఇమ్‌డెవిమ్యాబ్‌ అనే ఔషధాల మిశ్రమాన్ని విక్రయించడానికి రోష్‌కు మనదేశంలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)  అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇది పరిశోధనలో ఉన్న ఔషధం. దీన్ని యాంటీ బాడీ కాక్‌టెయిల్‌ ఔషధంగా భావిస్తారు. అమెరికాలో ఔషధ నియంత్రణ సంస్థకు తాము అందించిన సమాచారం, ఐరోపా యూనియన్‌లోని కమిటీ ఫర్‌ మెడిసినల్‌ ప్రోడక్ట్స్‌ ఫర్‌ హ్యూమన్‌ యూజ్‌ (సీహెచ్‌ఎంపీ) అభిప్రాయం ఆధారంగా భారతదేశంలో దీనికి తమకు అత్యవసర అనుమతి లభించినట్లు రోష్‌ వివరించింది. భారత ఫార్మా కంపెనీ అయిన సిప్లా లిమిటెడ్‌ ద్వారా దీన్ని ఇక్కడ విక్రయించనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19 వ్యాధి బారిన పడిన పెద్దలు, పిల్లలకు తొలి దశలోనే ఈ మందు ఇచ్చినట్లయితే, వ్యాధి ముదరకుండా కాపాడే అవకాశం ఉంటుందని  రోష్‌ ఫార్మా ఇండియా ఎండీ వి.సింప్సన్‌ ఇమ్మాన్యుయేల్‌ తెలిపారు
 

రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం
అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ నివేదిక

దిల్లీ: కొవిడ్‌-19 ప్రభావం నుంచి అల్పాదాయ వర్గాలు గట్టెక్కాలంటే రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం అవుతుందని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది వర్క్‌ 2021’ నివేదిక వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ ప్రభావంతో దేశంలో 2020 ఆఖరుకు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారు. 1.5 కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి.  
* సంఘటిత రంగంలో పని చేస్తున్న వారిలో సగం మంది అసంఘటిత రంగంలోకి మారిపోయారు. 2019 చివర నుంచి 2020 ఆఖరుకు స్వయం ఉపాధి (30 శాతం), ఒప్పంద వేతనాలు (10 శాతం) అసంఘటిత వేతనాలకు (9 శాతం) వీరు మారారు. అలాగే వారి ఆదాయ స్థాయులు కూడా తగ్గాయి.
* ఏప్రిల్‌, మేలో 20 శాతం పేద కుటుంబాలు తమ పూర్తి ఆదాయాన్ని కోల్పోయాయి.  
* జన్‌ ధన్‌ యోజన కంటే పీడీఎస్‌ అనేది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉండటంతో కనీసం 2021 డిసెంబరు వరకు ఉచిత రేషన్‌ పంపిణీ కొనసాగించాలి.
* జన ధన్‌ ఖాతాలకే కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గృహాలకు 3 నెలలకు రూ.5,000 నగదు బదిలీ చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంచడమే కాకుండా వేతనాలు కూడా పెంచాలి.

టాటా స్టీల్‌ లాభం రూ.7,162 కోట్లు
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో టాటా స్టీల్‌ రూ.7,161.91 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,615.35 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.37,322.68 కోట్ల నుంచి రూ.50,249.59 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.35,432.42 కోట్ల నుంచి రూ.40,052 కోట్లకు చేరాయి.
* ప్రతి షేరుకు రూ.25 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.  


 

ముందస్తు చెల్లింపుల వ్యాపారంలోకి బజాజ్‌ ఫైనాన్స్‌
దిల్లీ: పేటీఎం, అమెజాన్‌ల మాదిరి త్వరలోనే ముందస్తు చెల్లింపుల (ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ) వ్యాపారంలోకి బజాజ్‌ ఫైనాన్స్‌ అడుగుపెట్టనుంది. ఇందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. బజాజ్‌ పేలో భాగంగా ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. అన్ని రకాల చెల్లింపులకు అనుసంధాన ప్లాట్‌ఫాంగా ఇది వ్యవహరించనుంది. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈనెల 4వ తేదీతో పంపిన లేఖలో సెమీ క్లోజ్డ్‌ పీపీఐ (ప్రీ పెయిడ్‌ పేమెంట్‌) కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేసిందనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. జీవితకాలం పాటు కొన్ని షరతులతో ఈ అనుమతులు వర్తిస్తాయని అందులో పేర్కొంద’ని ఎక్స్ఛేంజీలకు బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. క్లోజ్డ్‌ సిస్టమ్‌ పీపీఐల విధానంలో కేవలం ఫలానా సంస్థ నుంచి వస్తువులు, సేవల కొనుగోలుకు చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ, థర్డ్‌ పార్టీ నగదు బదిలీలు చేయడానికి వీలుండదు. సెమీ క్లోజ్డ్‌ సిస్టమ్‌ పీపీఐ విధానంలో ఎంత  మంది వ్యాపారులకైనా లేదా ఎన్ని సంస్థలకైనా చెల్లింపులు చేయొచ్చు. అయితే ఇందులోనూ నగదు ఉపసంహరణకు వీలుండదు.


 

హైదరాబాద్‌లో థాట్‌స్పాట్‌ కార్యాలయం
ఈనాడు, హైదరాబాద్‌: ఆధునిక అనలిటిక్స్‌ క్లౌడ్‌ కంపెనీ థాట్‌స్పాట్‌ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇందులో భాగంగా డేటా ఇంటిగ్రేష్‌ సంస్థ డియోట్టాను స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ స్వాధీనంతో ఉత్తర అమెరికా, భారత్‌లో కొత్తగా 60 మందికి పైగా నిపుణులు థాట్‌స్పాట్‌లో చేరతారని వెల్లడించింది. ఆధునిక క్లౌడ్‌ అభివృద్ధి, పరిశోధనకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని సంస్థ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సుమీత్‌ అరోరా అన్నారు. దేశంలో ఇప్పటికే తమ సంస్థకు 100 మందికి పైగా ఉద్యోగులున్నట్లు తెలిపారు.


 

వృద్ధి 8.2- 9.8 శాతమే:  ఎస్‌ అండ్‌ పీ  
దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ, రుణ వసూళ్లకు కొవిడ్‌-19 రెండో దశ విజృంభణ విఘాతంగా మారొచ్చని ఎస్‌ అండ్‌ పీ అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 11 శాతం మేర వృద్ధి సాధించవచ్చని మార్చిలో ఎస్‌ అండ్‌ పీ పేర్కొంది. మేలో కరోనా కేసులు మోస్తారుగా ఉంటే వృద్ధి 9.8 శాతానికి తగ్గొచ్చని, కేసుల సంఖ్య తీవ్రమై జూన్‌లో గరిష్ఠ స్థాయులకు చేరితే జీడీపీ వృద్ధి 8.2 శాతానికి పరిమితం కావొచ్చని తాజాగా పేర్కొంది.  భారత్‌ రేటింగ్‌ను స్థిర అంచనాతో ‘బీబీబీ-’గా ఎస్‌ అండ్‌ పీ ఉంచింది.  దేశీయ బ్యాంకులకు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని తెలిపింది. స్థూల ఎన్‌పీఏలు 11-12 శాతంగా కొనసాగొచ్చని అభిప్రాయపడింది.


 

ఆరోగ్య వ్యయాలు సీఎస్‌ఆర్‌ కిందకే
దిల్లీ: కొవిడ్‌ చికిత్సలకు అవసరమయ్యే ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు కంపెనీలు వెచ్చించే మొత్తాలను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాలుగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాత్కాలిక కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రుల ఏర్పాటు వ్యయాలను సీఎస్‌ఆర్‌గా పరిగణించనున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చిన కొన్ని వారాల్లోనే తాజా విషయాన్ని వెల్లడించింది. మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ, స్టోరేజీ ప్లాంట్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, సిలిండర్లు, ఇతర ఔషధ పరికరాల తయారీ, సరఫరాకు వెచ్చించే మొత్తాలను సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల కింద పరిగణించనున్నారు.


 

సంక్షిప్తంగా
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి నెలలో 11.73 లక్షల మంది పన్ను చెల్లింపుదార్లకు రూ.15,438 కోట్లకు పైగా రిఫండ్‌లు జారీ చేసినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం వెల్లడించింది.  
* అనైతిక వ్యాపార పద్ధతులు అమలు చేసిందన్న ఆరోపణలపై టాటా మోటార్స్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది.
* క్యూఐపీ ద్వారా రూ.4000 కోట్ల వరకు నిధుల సమీకరణకు ఈ నెల 7న ఇండిగో బోర్డు సమావేశం కానుంది.
* రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ నుంచి రూ.2,397 కోట్లు అక్రమంగా తరలించిన కేసులో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మాజీ సీఈఓ మణిందర్‌ సింగ్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
* రూ.231 కోట్లు బకాయిపడ్డ శరవణ స్టోర్స్‌ మొండి ఖాతాను మోసాపూరిత ఖాతాగా ఇండియన్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇందుకోసం డిసెంబరు త్రైమాసికంలో రూ.115.32 కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని