జస్ట్‌ డయల్‌లో రిలయన్స్‌ రిటైల్‌కు 41% వాటా - Telugu news Reliance Retail Acquires 41 pc Stake In Just Dial
close

Updated : 17/07/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జస్ట్‌ డయల్‌లో రిలయన్స్‌ రిటైల్‌కు 41% వాటా

రూ.3,497 కోట్లతో కొనుగోలు ఒప్పందం
 మరో 26 శాతం వాటాకు ఓపెన్‌ ఆఫర్‌

ముంబయి: వ్యాపార సంస్థల సమాచారం తెలిపే జస్ట్‌ డయల్‌లో మెజార్టీ వాటా (66.95 శాతం) కొనుగోలుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) సిద్ధమైంది. సంస్థలో ప్రమోటర్ల నుంచి 40.95 శాతం వాటా కొనుగోలుకు శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రూ.3,497 కోట్లు వెచ్చించనుంది. జస్ట్‌ డయల్‌ వ్యవస్థాపకుడు వీఎస్‌ఎస్‌ మణి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హోదాలో కంపెనీని ముందుకు నడిపించేలా ఈ ఒప్పందం జరిగింది. కచ్చితంగా అమలయ్యేలా కుదరిన ఒప్పందం ప్రకారం, ఆర్‌ఆర్‌వీఎల్‌ కొనుగోలు చేస్తున్న 40.95% వాటాలో 25.33 శాతాన్ని (2.12 కోట్ల ఈక్విటీ షేర్లు) కంపెనీ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో జస్ట్‌ డయల్‌ కేటాయించనుంది. ఇందుకు ఒక్కో షేరుకు రూ.1,022.25 చొప్పున ఆర్‌ఆర్‌వీఎల్‌ చెల్లించనుంది. వ్యవస్థాపకులు వీఎస్‌ఎస్‌ మణి నుంచి 1.31 కోట్ల షేర్లను (15.62 శాతం వాటా) రూ.1,020 చొప్పున కొనుగోలు చేయనుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌ చొప్పిస్తున్న ఈ మూలధనాన్ని సంస్థ వృద్ధికి, విస్తరణకు వినియోగించనున్నట్లు జస్ట్‌ డయల్‌  వెల్లడించింది. ‘లక్షల సంఖ్యలో ఉన్న మా భాగస్వామి వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల కోసం డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థను మరింత పెంచేందుకే జస్ట్‌ డయల్‌లో వాటా కొనుగోలు చేస్తున్నామ’ని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ వెల్లడించారు. జస్ట్‌ డయల్‌ను 25 ఏళ్ల కిందట మణి ప్రారంభించారు. ‘రిలయన్స్‌ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా బి2బి ప్లాట్‌ఫామ్‌పై మా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళతామ’ని మణి తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని