మారుతీ సుజుకీ లాభం రూ.475 కోట్లు
close

Published : 29/07/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారుతీ సుజుకీ లాభం రూ.475 కోట్లు

దిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.475 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.268 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.4,111 కోట్ల నుంచి రూ.17,776 కోట్లకు దూసుకెళ్లింది. కొవిడ్‌-19 మహమ్మారి రెండో దశ పరిణామాల వల్ల విక్రయాలు, ఉత్పత్తిపై ప్రభావం చూపినా, 2020 ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే ఫరవాలేదని కంపెనీ తెలిపింది. సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ బోర్డు నుంచి 2021 జూన్‌లో పదవీ విరమణ పొందిన ఒసాము సుజుకీ, మారుతీ సుజుకీ బోర్డులో గౌరవ ఛైర్మన్‌ హోదాలో కొనసాగుతారని పేర్కొంది.

విక్రయాలు ఇలా..

కొవిడ్‌ తొలి దశ ప్రభావం అధికంగా ఉన్న 2020 ఏప్రిల్‌-జూన్‌లో 76,599 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది ఇదే సమయంలో 3,53,614 వాహనాలను విక్రయించింది. దేశీయ విపణిలో 3,08,095 వాహనాలు విక్రయించగా, 45,519 వాహనాలను ఎగుమతి చేసింది.

* స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ.441 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.249 కోట్ల నష్టం ప్రకటించింది.

* బీఎస్‌ఈలో బుధవారం షేరు 1.26 శాతం తగ్గి రూ.7,150.20 వద్ద ముగిసింది.


11% పెరిగిన నెస్లే ఇండియా లాభం

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా రూ.538.58 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే సమయంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.486.60 కోట్లతో పోలిస్తే ఇది 10.68%ఎక్కువ. నికర విక్రయాలు రూ.3,041.45 కోట్ల నుంచి 13.83% పెరిగి రూ.3,462.35 కోట్లకు పెరిగాయి. దేశీయ విక్రయాలు   రూ.2,907.74 కోట్ల నుంచి 13.66%పెరిగి రూ.3,304.97 కోట్లకు చేరాయి. ఎగుమతులు రూ.133.71 కోట్ల నుంచి 17.70 శాతం పెరిగి రూ.157.38 కోట్లకు చేరాయి. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.2,436.14 కోట్ల నుంచి 13.93 శాతం పెరిగి రూ.2,775.68 కోట్లకు చేరాయి.  వచ్చే 3-4 ఏళ్లలో భారత్‌లో రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెడతామని గత ఏడాది ప్రకటించగా, ఇప్పటికే రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్‌ తెలిపారు.


అమెరికా సాంకేతిక దిగ్గజాలు అదరహో

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన మూడు సాంకేతిక దిగ్గజ కంపెనీలు- యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లు ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు కనబర్చాయి. ఈ మూడింటి లాభం 50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.75 లక్షల కోట్ల)కు చేరింది. ఈ మూడు సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 6.4 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.480 లక్షల కోట్ల)కు చేరింది. 16 నెలల క్రితం కొవిడ్‌-19 ప్రారంభానికి ముందు ఉన్న ఈ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం.

భారత్‌లో రెండంకెల వృద్ధి..యాపిల్‌: భారత్‌, లాటిన్‌ అమెరికా లాంటి విపణుల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి మొత్తం మీద   81.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు. నికర లాభం 11.2 బి.డాలర్ల నుంచి 21.7 బి.డాలర్లకు చేరింది. 

గూగుల్‌ లాభం మూడు రెట్లు: గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఏప్రిల్‌- జూన్‌లో 18.53 బిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని నమోదుచేసింది. కిందటేడాది ఇదే సమయంలోని 6.96 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే నికర లాభం సుమారు 3 రెట్లు పెరిగింది.  మైక్రోసాప్ట్‌.. 47% వృద్ధి : మైక్రోసాఫ్ట్‌ నికర లాభం 47 శాతం పెరిగి 16.5 బి.డాలర్లకు చేరింది. నికర ఆదాయం 21% వృద్ధితో 46.2 బి.డాలర్లుగా నమోదైంది.


ఐడీబీఐ బ్యాంక్‌ లాభం నాలుగింతలు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్‌ రూ.603.30 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. ఎల్‌ఐసీ నియంత్రణలోని ఈ ప్రైవేటు రంగ బ్యాంక్‌ 2020-21 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.144.43 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది నాలుగింతలు కావడం విశేషం. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.159.14 కోట్ల నుంచి రూ.598.13 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.5,901.02 కోట్ల నుంచి రూ.6,554.95 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 26.81% నుంచి 22.71 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 3.55% నుంచి 1.67 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.888.05 కోట్ల నుంచి రూ.1,751.80 కోట్లకు పెరిగాయి.


సెంట్రల్‌ బ్యాంక్‌ లాభంలో 53% వృద్ధి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.206 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.135 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,349 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక మొత్తం ఆదాయం రూ.6,726.68 కోట్ల నుంచి రూ.6,245.54 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం రూ.2,146 కోట్ల నుంచి రూ.2,135 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 18.10 శాతం నుంచి 15.92 శాతానికి, నికర ఎన్‌పీఏలు 6.76% నుంచి 5.09 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి 79.12 శాతం నుంచి 84.28 శాతానికి మెరుగుపడింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని