సంక్షిప్త వార్తలు
close

Published : 24/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

రూ.2 కోట్ల వరకు గృహ రుణాలకూ 6.66% వడ్డీయే
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ముంబయి: రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు తీసుకునే గృహ కొనుగోలుదార్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.50 లక్షల్లోపు గృహ రుణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న అతి తక్కువ గృహ రుణ రేటు 6.66 శాతాన్నే రూ.2 కోట్ల రుణాల వరకూ వర్తింపజేయనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. ఈ రుణ రేటును గత జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఈ నెల 22 నుంచి నవంబరు 30 వరకు మంజూరు చేసే గృహ రుణాలకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. సిబిల్‌ స్కోరు 700 అంత కంటే ఎక్కువ ఉన్న ఖాతాదార్లకు వారి వృత్తితో నిమిత్తం లేకుండా రుణాలు జారీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ వై.విశ్వనాథ గౌడ్‌ వెల్లడించారు.


రూ.500 కోట్ల సమీకరణలో బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌

హైదరాబాద్‌: విస్తరణ, కార్పొరేట్‌ అవసరాలు, రుణ భారం తగ్గించుకోవడం తదితరాల నిమిత్తం ఐపీఓ ద్వారా రూ.500 కోట్ల సమీకరణకు ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ స్టోర్లను నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా (ఈఎంఐఎల్‌) సిద్ధం అవుతోంది. ఈ మేరకు సెబీ దగ్గర అనుమతి కోరుతూ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. మూడు దశాబ్దాల క్రితం పవన్‌ కుమార్‌ బజాజ్‌, కరణ్‌ బజాజ్‌లు స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కోటి మందికి పైగా వినియోగదారులు, 2,600పైగా ఉద్యోగులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావడంతోపాటు, దేశ రాజధాని దిల్లీలో నెమ్మదిగా విస్తరించే ఆలోచన చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.3,207.37 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.58.62 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ నుంచి మూత్రపిండాల కేన్సర్‌ ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ దేశంలో తొలిసారిగా మూత్రపిండాల కేన్సర్‌ (రీనల్‌ సెల్‌ కార్సినోమా) వ్యాధికి వినియోగించే ‘కాబోజాంటినిబ్‌’ ఔషధాన్ని ఆవిష్కరించింది. ఈ జనరిక్‌ ఔషధాన్ని ‘కాబోలాంగ్‌’ అనే బ్రాండు పేరుతో తీసుకువచ్చినట్లు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ వెల్లడించింది. నెలకు రూ.10,000 కంటే తక్కువ ఖర్చయ్యే విధంగా ఈ మందు ధర నిర్ణయించినట్లు, దీన్ని 20ఎంజీ, 40 ఎంజీ, 60 ఎంజీ డోసుల్లో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ మందును దిగుమతి చేసుకుంటే నెలకు అయ్యే మందు ఖర్చు లక్షల రూపాయల్లో ఉంటోందని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని