టర్మ్ బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురవ్వడానికి కారణాలు.. - reasons-for-denying-term-Insurance-claim
close

Published : 27/12/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టర్మ్ బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురవ్వడానికి కారణాలు..

ఎవ‌రైనా బీమా తీసుకునేది పాల‌సీదారుడి త‌ద‌నంత‌రం కుటుంబానికి ఆర్థిక భ‌రోసాగా ఉంటుంద‌నే ఉద్దేశంతోనే. అయితే బీమా క్లెయిం చేసుకునేట‌ప్పుడు వివిధ కార‌ణాల రీత్యా బీమా క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతూ ఉంటుంది. పాల‌సీ తీసుకునే స‌మ‌యంలో అన్నీ క్షుణ్ణంగా చ‌దివి స్వ‌యంగా పాల‌సీప‌త్రంపై సంత‌కాలు చేస్తే దాదాపు ఇటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. కానీ చాలా మంది అలా చేయ‌రు. పాల‌సీప‌త్రంపై సంత‌కాలు చేసి మ‌ధ్య‌వ‌ర్తికి ఇచ్చేస్తారు.

పాల‌సీదారు గురించి స‌మ‌గ్ర స‌మాచారం తెలియ‌కుండానే పాల‌సీ పత్రాన్ని నింప‌డం పూర్త‌వుతుంది. దీంతో క్లెయిం స‌మ‌యంలో బీమా కంపెనీ తిర‌స్క‌రించిన‌ప్పుడు, పాల‌సీదారు నామినీల‌కు ఆందోళ‌న మొద‌లవుతుంది. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఏఏ సంద‌ర్బాల్లో క్లెయిం తిర‌స్క‌రిస్తారో తెలుసుకుంటే మంచిది.

నిజాల‌ను వెల్లడించ‌క‌పోవ‌డం :

పాల‌సీ పత్రంలో సాధ్య‌మైనంత మేర‌కు వాస్త‌వ వివ‌రాల‌నే వెల్ల‌డించాలి. అందుకు ప్ర‌తిగా సంత‌కం చేస్తాం. కొన్ని వివ‌రాల‌కు సంబంధించి నిజాల‌ను దాచినా, అబ‌ద్ధాల‌ను సృష్టించి రాసినా క్లెయిం చేసేట‌ప్పుడు ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంది… నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న పాల‌సీ క్లెయింలు ఎక్కువ‌గా తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్యే అవ‌కాశం ఉంది.

కొన్ని కార‌ణాలకు క్లెయిం వ‌ర్తించ‌దు :

పాల‌సీ తీసుకునేట‌ప్పుడే కొన్ని ర‌కాల మ‌ర‌ణాల‌కు బీమా వ‌ర్తించ‌ద‌ని బీమా కంపెనీలు ముందే తెలియ‌జేస్తాయి. అవేమిటంటే…

  • అతిగా మద్యం, డ్ర‌గ్స్‌ సేవించ‌డం వ‌ల్ల క‌లిగే మ‌ర‌ణాలు

  • ప్రిస్క్రిప్ష‌న్లో లేని మందుల వాడ‌టం

  • ఆత్మ‌హ‌త్య‌

  • యుద్దం, ఉగ్రవాద చ‌ర్య‌ల మూలంగా క‌లిగే మ‌ర‌ణాలు

  • మ‌ద్యం సేవించి ప్ర‌మాదంతో మ‌ర‌ణించిన సంద‌ర్భాల్లో

పాల‌సీ ల్యాప్స్ అవ‌డం :

పాల‌సీ ప్రీమియం చెల్లించేందుకు కొద్ది రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ‌డువు లోపు స‌క్ర‌మంగా ప్రీమియం చెల్లించ‌న‌ట్ల‌యితే పాల‌సీ ల్యాప్స్ అయ్యే ప్ర‌మాదం ఉంది. బీమా క్లెయింలు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డంలో ఎక్కువ కార‌ణాలు పాల‌సీ ల్యాప్స్ అవ్వ‌డానికి సంబంధించిన‌వై ఉంటాయి.

ఇత‌ర పాల‌సీ వివ‌రాలను వెల్ల‌డించ‌కుండా ఉండ‌టం :

ఏ బీమా కంపెనీ అయినా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ఇత‌ర బీమా పాల‌సీల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సిందిగా అడుగుతుంది. చాలా మంది ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌కుండా ఉంటారు. దీని వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌. ఒక‌టి కంటే ఎక్కువ పాల‌సీలను క‌లిగి ఉన్న‌ప్పుడు వివ‌రాల‌ను వెల్ల‌డించ‌కుండా ఉంటే క్లెయిం స‌మ‌యంలో పాల‌సీదారులు న‌ష్ట‌పోతారు.

గ‌డువు లోపు క్లెయిం ద‌ర‌ఖాస్తు చేయ‌క‌పోవ‌డం :

పాలసీదారుకి ఏదైనా జరిగినప్పుడు సాధ్యమైనంత తొందరగా క్లెయిం కోసం దరఖాస్తు చేయాలి. బీమా కంపెనీలను బట్టి ఇందుకోసం 60-90 రోజుల వ్యవధి ఉంటుంది. సమీపంలో ఉన్న సంబంధిత బీమా సంస్థ శాఖకు వెళ్లి, పాలసీదారు మరణానికి సంబంధించిన సమాచారాన్ని లిఖిత పూర్వకంగా అందించాలి. తర్వాత ఏం చేయాలన్న విషయాల గురించి బీమా సంస్థ సేవా కేంద్రాన్ని లేదా సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. నామినీ తనకు సంబంధించిన చిరునామా, ఫోన్‌ నెంబరు బీమా కంపెనీకి తెలియజేయాలి.

ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే క్లెయిం స‌మ‌యంలో ప‌రిహారాన్ని సులువుగా అందుకోవ‌చ్చు. క్లెయిం తిర‌స్క‌ర‌ణకు కార‌ణాలెన్నో ఉండ‌వ‌చ్చు గాక మ‌న నిర్ల‌క్ష్యానికి కార‌ణం ఎత్తిచూపించే ప‌రిస్థితి రాకుండా చూసుకోవ‌డం మంచిది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని