పన్ను ఆదాయం రూ.2.6 లక్షల కోట్లు తగ్గొచ్చు - tax revenue may decrease
close

Updated : 18/01/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పన్ను ఆదాయం రూ.2.6 లక్షల కోట్లు తగ్గొచ్చు

ఈ ఆర్థిక సంవత్సరంపై ప్రభుత్వ వర్గాల అంచనా

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితం అవుతున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు లక్ష్యం కంటే రూ.2.6 లక్షల కోట్ల మేర తగ్గొచ్చని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 2020-21 బడ్జెట్‌లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లుగా పేర్కొన్న సంగతి విదితమే. ‘గత ఆర్థిక సంవత్సరానికి సవరించిన పన్ను వసూళ్ల మొత్తానికి సమానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైనా సంతోషమే. అయితే అంతకంటే తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నాం’ అని సదరు అధికారి తెలిపినట్లు వార్తాసంస్థ కోజెన్సీస్‌ పేర్కొంది. 2019-20 స్థూల పన్ను వసూళ్ల సవరించిన అంచనా రూ.21.63 లక్షల కోట్లు. 2019-20లో వసూలైన రూ.20.10 లక్షల కంటే ఈ మొత్తం 7.6 శాతం అధికం. 2020-21 తొలి 6 నెలల్లో వసూలైన పన్ను మొత్తం రూ.7.21 లక్షల కోట్లే. గతేడాది ఇదే సమయం కంటే 21.6 శాతం తక్కువ.

రికవరీపైనే ఆశలు..
లాక్‌డౌన్‌ సమయంలో స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు 2-3 నెలలుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. అందువల్ల పన్ను వసూళ్ల లోటు గతంలో భావించినంత అధికంగా ఉండకపోవచ్చని అంచనా. 2019-20 ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో పన్ను ఆదాయం 32.6 శాతం, జులై-సెప్టెంబరు 13.1 శాతం తగ్గాయి. ముందస్తుపన్ను వసూళ్ల ప్రక్రియ డిసెంబరులో ముగిశాక, ప్రసుత్త ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల అంచనాలను ఆర్థిక శాఖ సవరించొచ్చు. కంపెనీలు కార్పొరేట్‌ పన్నులో మూడోవిడతను, వేతనేతర వ్యక్తులు రెండోవిడత పన్నును డిసెంబరు 15లోగా చెల్లించాల్సి ఉంది.  తాజా సమాచారం ప్రకారం అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ1.05 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే కాలం కంటే ఇవి 10.2 శాతం అధికం. నవంబరులో కూడా జీఎస్‌టీ వసూళ్లు రూ.1.08 లక్షల కోట్లకు చేరతాయనే అంచనా ఉంది. 

గతేడాది మొత్తం పన్ను వసూళ్లు బడ్జెట్‌ అంచనాల కంటే 4.51 లక్షల కోట్లు తగ్గాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని