close
ఏటా కోటి చదరపు అడుగులు! 

హైదరాబాద్‌లో కార్యాలయాల నిర్మాణాల విస్తీర్ణం అంచనా 
అంతా ఐటీ కారిడార్‌లోనే.. 
మౌలిక వసతులపై ఒత్తిడి 
ఇతర ప్రాంతాల్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి 
ప్రభుత్వానికి క్రెడాయ్‌ హైదరాబాద్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: కార్యాలయాల నిర్మాణాల(ఆఫీస్‌ స్పేస్‌)కు సంబంధించి హైదరాబాద్‌లో ఒకప్పుడు పది లక్షల చదరపు అడుగులు దాటితే గొప్ప అనుకున్నారు. అలాంటిది ప్రస్తుతం ఏటా కోటి చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరువైంది. ఏటా 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని త్వరలోనే కోటి మార్కును హైదరాబాద్‌ మార్కెట్‌ దాటుతుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ నిర్మాణాలన్ని పశ్చిమ హైదరాబాద్‌లోనే వస్తుండటంతో రాబోయే రోజుల్లో మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల ఒక్క వర్షానికే హైటెక్‌సిటీ ప్రాంతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోనూ ఐటీ విస్తరించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే హైదరాబాద్‌ ఒకవైపే కాకుండా నలువైపులా అభివృద్ధి చెందుతుందని సూచిస్తున్నారు.

బెంగళూరులో కార్యాలయాల నిర్మాణం ఏటా కోటి చదరపు అడుగుల మార్కును ఇదివరకే చేరుకుంది. ఇక్కడ నగరానికి నాలుగువైపుల కలిపి కోటి చదరపు అడుగుల్లో నిర్మాణాలు వస్తున్నాయి. మన దగ్గర దీనికి భిన్నమైన పరిస్థితి. ఏటా కడుతున్న 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయాలన్ని పశ్చిమ హైదరాబాద్‌లోని మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ చుట్టుపక్కలనే వస్తున్నాయి. నిర్మాణాలకు తగ్గట్టుగా మౌలిక వసతుల అభివృద్ధి మాత్రం జరగడం లేదు.

అద్దె ధరలు పైపైకి.. 
ఏ గ్రేడ్‌ కార్యాలయాల అద్దె ఐటీ కారిడార్‌లో కొన్ని చోట్ల చదరపు అడుగు రూ.75కు చేరింది. ఇది చాలా ఎక్కువ అని, ముఖ్యంగా ఐటీ ఆధారిత బీపీవో సంస్థలు మనుగడ సాగించలేవని క్రెడాయ్‌ అంటోంది. అద్దెలు ఎక్కువగా ఉంటే ఈ సంస్థలు ద్వితీయ శ్రేణి నగరాలకు తరలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒక దశకు వచ్చాక నగరాలతో నగరాలు పోటీ పడాల్సి ఉంటుందని.. మనం ఇతర నగరాలతో పోటీ పడాలంటే హైదరాబాద్‌లో పశ్చిమానికి ప్రత్యామ్నాయంగా తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేయాలని సూచిస్తోంది.

తూర్పు ప్రాంతానికి సానుకూలాంశాలు 
హైదరాబాద్‌ తూర్పు ప్రాంతానికి అవుటర్‌ రింగ్‌రోడ్డుతో మెరుగైన రవాణా అనుసంధానం ఉండటం, ఉప్పల్‌ వరకు మెట్రో, భూముల లభ్యత, పశ్చిమంతో పోలిస్తే తక్కువ ధరలు, ఇప్పటికే ఐటీ సంస్థలు కొలువుదీరి పదివేల మంది పనిచేస్తుండటం వంటి సానుకూలతలు ఉన్నాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ నూతన అధ్యక్షుడు పి.రామకృష్ణారావు అన్నారు. ఒకవైపే అభివృద్ధి అనేది దీర్ఘకాలంలో నగరానికి మంచిది కాదన్నారు. అలాగని బెంగళూరులో మాదిరిగా ప్రతిపాదనలో ఉన్న కొత్త నిర్మాణాల అనుమతిపై నిషేధం పరిష్కారం కాదన్నారు. ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించడం ఒక్కటే నీటి సమస్యకు పరిష్కారమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉప్పల్‌-పోచారం వైపు ఐటీని ప్రోత్సహించేందుకు లుక్‌ఈస్ట్‌ పాలసీని తీసుకొచ్చిందని, ఇందులో విద్యుత్తు మినహాయింపులు తప్ప ఇతరత్రా ఆకర్షణలు లేవని క్రెడాయ్‌ హైదరాబాద్‌ కోశాధికారి ఆదిత్య గౌర అన్నారు. తూర్పు ప్రాంతంలో ఏ గ్రేడ్‌ కార్యాలయాలు నిర్మిస్తే చదరపు అడుగు అద్దె రూ.30 నుంచి రూ.40 లోపే ఉండే అవకాశం ఉందన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూచించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.