close

ప్రధానాంశాలు

గూగుల్‌లో A to Z సుందరకాండ

వైదొలగిన వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌
మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత సీఈఓల సరసన చోటు

అసాధ్యమైన ఒక విషయం ఆవిషృతమైతే అది అద్భుతమవుతుంది.
ఆ అద్భుతమైన విషయానికి మించిన అంశం జరిగితే అది అత్యద్భుతం అవుతుంది.
ఇక్కడ అద్భుతం, అత్యద్భుతం.. రెండూ ఒక వ్యక్తే కావడం విశేషం.
ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీకి సీఈఓ కావడం ఒక ఎత్తయితే..
ఆ సంస్థకు చెందిన మాతృ సంస్థ పగ్గాలూ చేతికందడం మరోఎత్తు.
అది కూడా వ్యవస్థాపకులు మరో ఆలోచన లేకుండా అతన్నే విశ్వసించడం అంతకు మించిన అంశం.
ఇక్కడ ఆ సంస్థ గూగుల్‌. మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌.
కానీ వ్యక్తి మన భారత సంతతి వ్యక్తి కావడమే అసలు విషయం.
గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కింది. మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సైతం ఆయనే సీఈఓగా వ్యవహరించనున్నారు. ఈ సాంకేతిక దిగ్గజం సహ వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు తమ పాత్రల నుంచి తప్పుకోవడంతో.. భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్‌ దిగ్గజంగా మారనున్నారు.

పేజ్‌ తన సీఈఓ స్థానం నుంచి; బ్రిన్‌ తన ప్రెసిడెంట్‌ హోదా నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత గూగుల్‌ సీఈఓ బాధ్యతలతో పాటు.. ఆల్ఫాబెట్‌ సీఈఓ పగ్గాలనూ పిచాయ్‌నే చేపట్టనున్నారు. తాజా పరిణామంతో అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా పిచాయ్‌ మారనున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది. ‘పిచాయ్‌ ఇకపై సెర్చ్‌, వ్యాపార ప్రకటనలు, మాప్స్‌, స్మార్ట్‌ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ వీడియో తదితర విభాగాలతో పాటు డ్రోన్‌ డెలివరీలు, ఇంటర్నెట్‌ బీమింగ్‌ బలూన్స్‌ వంటి వాటికీ ఏకైక అధిపతి కానున్నార’ని ఆ పత్రిక పేర్కొంది. 


2015 నుంచీ..

రెండు దశాబ్దాల కిందట గూగుల్‌ను ఏర్పాటు చేసిన పేజ్‌, బ్రిన్‌లు 2015లో పిచాయ్‌ను గూగుల్‌కు సీఈఓగా చేసి.. వారు ఆల్ఫాబెట్‌లోకి వెళ్లారు. ఇపుడు రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్రను మరింత పరిమితం చేసుకున్నారు. కాగా, తాజా మార్పు వల్ల ఆల్ఫాబెట్‌ నిర్మాణంలో ఎటువంటి మార్పూ ఉండదని పిచాయ్‌ స్పష్టం చేశారు. 


సీఈఓకు ముందు..

2015లో సీఈఓగా మారకముందు పిచాయ్‌ అదే కంపెనీలో పలు బాధ్యతలను నిర్వహించారు. క్రోమ్‌ బాధ్యతలతో పాటు, గూగుల్‌ ప్రోడక్ట్‌ చీఫ్‌, యాండ్రాయిడ్‌ అధిపతిగా వ్యవహరించారు. గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక అంతా తానై నిర్వహించారు. ఆయన నాయకత్వంలో గూగుల్‌ వ్యాపార వృద్ధి కొనసాగింది. హార్డ్‌వేర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లోకి విస్తరించింది. తమిళనాడులోని మధురైలో పుట్టిన పిచాయ్‌, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఖరగ్‌పూర్‌లలో విద్యనభ్యసించారు. 


కృతజ్ఞతలు
పిచాయ్‌

‘సాంకేతికత ద్వారా అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవాలనుకునే ఆల్ఫాబెట్‌ దీర్ఘకాల వ్యూహాలను కొనసాగిస్తాం. లారీ, పేజ్‌లకు కృతజ్ఞతలు. బలమైన పునాదులపై బలమైన నిర్మాణాలను భవిష్యత్‌లోనూ కొనసాగుతాయ’ని నియామక ప్రకటన అనంతరం సుందర్‌ ట్వీట్‌ చేశారు. గూగుల్‌, ఆల్ఫాబెట్‌లను భవిష్యత్‌లోకి నడిపించడానికి పిచాయ్‌ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు లేరని సహ వ్యవస్థాపకులు పేర్కొనడం గమనార్హం. 


ఒక్కరు చాలు..
పేజ్‌, బ్రిన్‌

‘ఆల్ఫాబెట్‌ ఇపుడు మెరుగైన వ్యవస్థను కలిగి ఉంది. అదే విధంగా గూగుల్‌, ఇతర అనుబంధ కంపెనీలు స్వతంత్ర కంపెనీలుగా సమర్థంగా పనిచేస్తున్నాయి. ఈ సమయంలో మా యాజమాన్య నిర్మాణాలను సరళీకరించాల్సిన అవసరం ఉంది. ఆల్ఫాబెట్‌, గూగుల్‌లకు ఇద్దరు సీఈఓలు, ఒక ప్రెసిడెంట్‌ ఉండాల్సిన అవసరం కనిపించడం లేదు. పిచాయ్‌ ఇకపై గూగుల్‌తో పాటు ఆల్ఫాబెట్‌కు చెందిన పెట్టుబడులు, ఇతర పోర్ట్‌ఫోలియోలకు కూడా బాధ్యత వహిస్తార’ని ఇద్దరు సహ వ్యవస్థాపకులు ఒక లేఖలో పేర్కొన్నారు. ‘గూగుల్‌, ఆల్ఫాబెట్‌లో మేం బోర్డు సభ్యులుగా, వాటాదార్లుగా, సహ వ్యవస్థాపకులుగా కొనసాగుతాం. అంతే కాకుండా.. సుందర్‌తో మాకిష్టమైన అంశాల గురించి చర్చిస్తూ ఉంటామ’ని అందులో వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.