3 వేల మంది కొవిడ్‌ బాధితులు ‘మిస్సింగ్‌’! - 3 thousand covid infected people gone missing in bengaluru
close
Published : 28/04/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 వేల మంది కొవిడ్‌ బాధితులు ‘మిస్సింగ్‌’!

ఫోన్లు ఆన్‌లో ఉంచుకోవాలని కర్ణాటక మంత్రి అభ్యర్థన

బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. బెంగళూరులో 3వేల మంది కొవిడ్‌ రోగుల జాడ తెలియడం లేదని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌ నిర్ధారణ అయిన తర్వాత ఎక్కువ మంది వారి మొబైల్‌ ఫోన్లను స్విచాఫ్‌ చేసుకున్నట్లు పేర్కొంది. వారి వల్లే రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి మరింత పెరుగుతుందని కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి అశోక వెల్లడించారు. ఇప్పటికే వారందరిని ట్రేసింగ్‌ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

‘కరోనా వైరస్‌ సోకిన చాలా మంది వారి ఫోన్లను ఆఫ్‌ చేసుకుంటున్నారు. ఇలా దాదాపు 2 నుంచి 3వేల మంది కొవిడ్‌ బాధితులు స్విచాఫ్‌ చేసుకోవడమే కాకుండా వారి ఇళ్లలోనూ లేరు. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు. దీంతో వారి ఆచూకి తెలుసుకోలేకపోతున్నాం. దీంతో పరిస్థితులు మరింత ఇబ్బందిగా మారుతున్నాయి’ కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక వెల్లడించారు. వైరస్‌ సోకినవారికి ఉచితంగానే ఔషధాలు ఇస్తున్నాం. దీంతో 90శాతం బాధితులు ఇంటివద్దే కోలుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఇలా వారి సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకొని.. ఆరోగ్యం విషమించి చివరి క్షణంలో ఆసుపత్రులకు వస్తూ ఐసీయూ పడకలు కావాలని అడుగుతున్నారు. ఇది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చేతులెత్తి ప్రార్థిస్తున్నా..ఇలాంటి వారి ప్రవర్తనతోనే రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి మరింత పెరుగుతోందని కర్ణాటక మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉంటే, కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం కొత్తగా అక్కడ 30వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. కేవలం బెంగళూరు నగరంలోనే నిన్న 17వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటితో పాటు కొవిడ్‌ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15వేల మంది కొవిడ్‌ మహమ్మారికి బలయ్యారు. వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని