జలక్రీడా అకాడమీ తిరిగి ప్రారంభమయ్యేనా? - Effects of Covid on water sports academy at Thatipudi
close
Updated : 23/10/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జలక్రీడా అకాడమీ తిరిగి ప్రారంభమయ్యేనా?

 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా అంతర్జాతీయ పోటీలలో రాణించేలా చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన తాటిపూడిలోని జలక్రీడా అకాడమీ ప్రస్తుతం వెలవెలబోతోంది. పదహారు నెలలుగా ఈ అకాడమీ మూతపడింది. క్రీడలకోసం ఉపయోగించే పరికరాలు నిరుపయోగంగా మారాయి. శిక్షకుల కొరత క్రీడాకారులను వేధిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో తాత్కాలిక పద్ధతిన ఏర్పాటు చేసిన అకాడమీలలో ఇదీ ఒకటి. దీనికోసం అప్పట్లో రెండుకోట్ల రూపాయలు కేటాయించారు. తాత్కాలికంగా ప్రారంభమైన ఈ అకాడమీకి క్రమంగా ఆదరణ పెరిగింది. పరిసర గ్రామాల నుంచి నిత్యం సుమారు 50 మంది వరకు పిల్లలు ఇక్కడ శిక్షణ పొందేందుకు వచ్చేవారు. అయిదుగురు జాతీయస్థాయి క్రీడాకారులు సైతం ఇక్కడ శిక్షణ తీసుకునేవారు. నాణ్యమైన శిక్షణ పొందిన క్రీడాకారులు, అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి శిక్షణ కొనసాగటం లేదు.

 

నిరుపయోగంగా మారిన క్రీడా సామగ్రి..
అకాడమీ మూతపడటంతో రూ.లక్షలు విలువ చేసే క్రీడా సామగ్రి నిరుపయోగంగా మారిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ఇక్కడి నుంచి కూడా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అనుకున్నాం. సంవత్సరం పాటు అకాడమీలో శిక్షణ బాగా సాగింది. శిక్షణ పొందిన వారిలో చాలామంది పతకాలు కూడా సాధించారు. కానీ 2019 నుంచి అకస్మాత్తుగా శిక్షణ ఆపివేశారు. దీంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అకాడమీలో శిక్షణ ఇవ్వడం ఎందుకు ఆపేశారనే విషయం మాకు తెలియదు’’ అని అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న వారు పేర్కొన్నారు.

వ్యయ భారంతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేక...
జలక్రీడ ఎంతో వ్యయంతో కూడుకున్న ఆట. ఒక్కో విద్యార్థికి రూ.లక్షలలో ఖర్చు అవుతుంది. దీంతో ఇతర ప్రాంతాలలోని అకాడమీలకు వెళ్లలేకపోతున్నామని క్రీడాకారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, అకాడమీని తిరిగి ప్రారంభించి తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.

కొవిడ్‌ కారణంగానే...
జలక్రీడా అకాడమీ మూతపడటం గురించి అధికారులు వివరణ ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా శాప్‌ ఆదేశాల మేరకే జల క్రీడా అకాడమీని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాత తిరిగి శిక్షణ ప్రారంభిస్తామని వెల్లడించారు. శాప్‌ అంగీకరిస్తే కొత్త సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.

 


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని