close

తాజా వార్తలు

83 సంబరాలను మళ్లీ తెస్తుంది


చిత్రబృందంతో కమల్‌, కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌ తదితరులు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: క్రికెట్‌.. భారతీయుల ఆత్మ. జాతి, మతం, భాషలకు అతీతమైంది. 1983వ ప్రపంచకప్‌లో దేశఖ్యాతిని భారత క్రీడాకారులు ఎలుగెత్తి చాటారు. చరిత్రలో చెరగని ముద్రవేసిన ఆ మ్యాచ్‌ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించిన విషయం తెలిసిందే. కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో జీవా నటించారు. తమిళంలో రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరుపై కమల్‌హాసన్‌ వైనాట్‌ స్టూడియోస్‌తో కలసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందులో కమల్‌హాసన్‌, కపిల్‌దేవ్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, రణ్‌వీర్‌సింగ్‌, జీవా, నిర్మాత శశికాంత్‌, దర్శకుడు కబీర్‌ఖాన్‌ పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘భారత్‌ 83లో ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నప్పుడు నేను చిన్న పిల్లాడిని. దేశం అంతటా సంబరాలు చేసుకున్న తరుణమది. అప్పుడు జట్టులోని యువ క్రీడాకారులు కూడా ఆ సందర్భాన్ని నమ్మలేకపోయారు. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఉద్వేగంతో రూపొందించాం. ఈ చిత్రాన్ని తమిళంలో కమల్‌ విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని’ చెప్పారు. కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ.. ‘ముందుగా ఒకప్పటి నా 83 క్రికెట్‌ జట్టుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఆ ఘటాన్ని తెరపైకి తీసుకొస్తున్న బృందానికి అభినందనలు. తొలిసారిగా తమిళనాడు వచ్చినప్పుడు ఈ భాషను చూసి నేర్చుకోవాలని ఆశపడ్ఢా తమిళం అందమైన భాష. చెన్నై అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది’ అని చెప్పారు. కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘ఇంత మంది ప్రతిభావంతులు ఒక్కచోట చేరడం ఆనందంగా ఉంది. 83లో ప్రపంచకప్‌ను గెలవడం మాత్రమే మనకు తెలుసు. కానీ దర్శకుడు దాని వెనక ఉన్న కథను చెప్పారు. చాలా ఆశ్చర్యపోయా. ఇది నిజమైన సూపర్‌హీరోస్‌ చిత్రం. కపిల్‌దేవ్‌కు అసలైన అభినందనలు ఇంకా దక్కలేదని అనుకుంటున్నా. కానీ దానికోసం ఆయన ఏమాత్రం ఆవేదన చెందరు. క్రికెటర్‌ శ్రీకాంత్‌ను నా సినిమాలో నటించాలని కొన్ని సార్లు ప్రయత్నించా. కానీ కుదరలేదు. నాకు మంచి స్నేహితుడు ఆయన. ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించినట్టుగానే భావిస్తున్నా. కానీ నా కన్నా క్రికెట్‌పై ఎక్కువ అభిమానం కలిగిన కబీర్‌ఖాన్‌ తెరకెక్కించడం ఆనందంగా ఉందని’ చెప్పారు. జీవా మాట్లాడుతూ.. ‘18 ఏళ్ల క్రితం కమల్‌ సార్‌ ఇదే వేదికపై నన్ను పరిచయం చేశారు. ఇలాంటి ఓ సినిమాతో ఇప్పుడు మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. రణ్‌వీర్‌తో కలసి నటించడం మరిచిపోలేని అనుభవం’ అని తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.