Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - after noon news at one pm
close
Published : 26/09/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. రాష్ట్రంలో బీసీ బంధు అమలు చేయాలి: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

రాష్ట్రంలో బీసీ బంధు అమలు చేయాలని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీసీల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించాలని కోరారు. జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వ పాలనలో బీసీ సబ్‌ప్లాన్‌ అటకెక్కింది. 46 బీసీ కులాలకు నిర్మిస్తామన్న ఆత్మ గౌరవ భవనాల అడ్రస్‌ ఎక్కడ?చేనేత కార్మికులకు బీమా, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి.

2. ఏపీలో సీఎంఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించాలి: అనగాని సత్యప్రసాద్‌

ఏపీలో వైకాపా ప్రభుత్వం సీఎం సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌)ని నిలిపేయడం బాధాకరమని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. కరోనా సమయంలో సీఎం సహాయనిధి ద్వారా సాయం అందక పేదల ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారన్నారు. కరోనా సాయం కింద సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలను పేదల వైద్యానికి వినియోగించాలని లేఖలో కోరారు.

3. మణికొండలో గల్లంతైంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్‌ (42)గా గుర్తించారు. ఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది. షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. వర్షపు నీటితో నిండి దారి కనిపించకపోవడంతో గుంతలో పడ్డారు.

ప్రగతినగర్‌లో దారుణం.. వివాహమైన నెల రోజులకే చంపేశాడు..

4. జీఎస్‌టీ రిఫండ్‌ క్లెయిమ్‌లకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి: సీబీఐసీ

పన్ను చెల్లింపుదార్లు జీఎస్‌టీ రిఫండ్‌లను క్లెయిమ్‌ చేసుకునేందుకు ఆధార్‌ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన పాన్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్‌టీ రిఫండ్‌లు వేసేలా కూడా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్‌టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) సవరణలు చేసింది. సెప్టెంబరు 17న జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీబీఐసీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

5. ఇలాంటి డ్యాన్స్‌ ఎప్పుడూ చూడలేదు..: మహేశ్‌బాబు

‘లవ్‌స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య తనలోని నటుడిని ప్రతిఒక్కరికీ పరిచయం చేశాడని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ‘‘ప్రస్తుతం సమాజంలో మనం చూస్తోన్న ఎన్నో విషయాలను సున్నితంగా చెబుతూ అద్భుతమైన చిత్రాన్ని అందించారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. నాగచైతన్య తనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక, సాయిపల్లవి ఎప్పటిలాగే అదరగొట్టేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? ఆన్‌స్క్రీన్‌పై ఇలాంటి డ్యాన్స్‌ నేను ఇప్పటివరకూ చూడలేదు. ఆమె డ్యాన్స్‌ ఒక కలలా ఉంది. సినిమాకి పవన్‌ అందించిన మ్యూజిక్‌ సెన్సేషనల్‌. రెహమాన్‌ సర్‌.. మీ శిష్యుడు మిమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసిన చిత్ర నిర్మాతలకు నా అభినందనలు’’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

6. 28 వేల కేసులు.. 26 వేల రికవరీలు

దేశంలో కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కొత్త కేసులు  స్వల్పంగా తగ్గి మరోసారి 30 వేలలోపే నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా 300లోపే ఉండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికంటే ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 14,88,945 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 28,326 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

40 ఏళ్లు దాటిన మధుమేహులకు కొవిడ్‌ ఇబ్బందికరమే

7. సూది లేకుండా పట్టీ రూపంలో టీకా!

సూది అవసరం లేకుండానే వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక చిన్నపాటి పట్టీని అభివృద్ధి చేశారు. ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే సాధారణ వ్యాక్సిన్‌ కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తుందని వారు తెలిపారు. త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. చర్మంలో రోగ నిరోధక కణాలు ఎక్కువగా ఉంటాయి. టీకాలకు లక్ష్యాలు ఇవే. చర్మానికి ఈ పట్టీని అతికించడం ద్వారా నేరుగా మంచి ఫలితాలను రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంజెక్షన్‌ ద్వారా చేతి కండరంలోకి నేరుగా చేరవేసిన టీకా కన్నా ఇది 10 రెట్లు సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.

8. అమెరికాలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురి మృతి

అమెరికాలోని మోంటానలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం ముగ్గురు చనిపోయినట్లు లిబర్టీ కౌంటీ షరీఫ్‌ పేర్కొన్నారు. ఎంత మంది గాయపడ్డారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అమ్‌ట్రాక్(అమెరికా జాతీయ రైల్వే)సంస్థకు చెందిన ఎంపైర్‌ బిల్డర్‌ ట్రైన్‌ 7/27 మోంటానలోని జోప్లిన్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ రైలుకు రెండు లోకోమోటీవ్‌లు, 10 బోగీలు ఉన్నాయి. ప్రమాద సమయంలో 147 మంది ప్రయాణికులు, 13 మంది  సిబ్బంది అందులో ప్రయాణిస్తున్నారు.

9. పెరిగిన డీజిల్‌.. స్థిరంగాపెట్రోల్‌

ఇంధన విక్రయ సంస్థలు ఆదివారం(26-09-2021) డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. గత 21 రోజులుగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా పెంపుతో లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.96.68, దిల్లీలో రూ.89.07, కోల్‌కతాలో రూ.89.07కు చేరింది. చివరిసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండూ కలిపి సెప్టెంబరు 5న మారాయి. తర్వాత డీజిల్‌ ధరలను పలుసార్లు పెంచినప్పటికీ.. పెట్రోల్‌ ధరలు మాత్రం మారలేదు.

10. కోహ్లీ తర్వాత బెంగళూరు కెప్టెన్‌ ఎవరంటే..!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఈ ఐపీఎల్ 14వ సీజన్‌ తర్వాత ఆ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఏబీ డివిలియర్స్‌ పేరు వినిపిస్తున్నా.. వయసు రీత్యా అతడు సరైన ఎంపిక కాదని క్రికెట్‌ విశ్లేషకుల భావన. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తాజాగా బెంగళూరు జట్టుకు ముగ్గురి పేర్లను సూచించాడు.

ఇది ఛేదిస్తామనుకున్నా: సంజూ.. ప్రణాళిక ప్రకారమే ఆడతాం: పంత్మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని