మీరు రాసుకున్న కథలు చించేయండి: పూరి  - content is king said purijagannadh in puri musings
close
Updated : 20/11/2020 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరు రాసుకున్న కథలు చించేయండి: పూరి 

హైదరాబాద్: స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ నినాదం తీసుకొచ్చారు. మన దేశంలో తయారు చేసిన వస్తువులనే వాడాలనేది ప్రధాని సూచించిన ఆలోచన. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా ఇలాంటి పిలుపే ఇచ్చారు. ‘లోకల్‌ ఈజ్‌ గ్లోబల్‌’ పేరుతో కొత్త రచయితలు, దర్శకులకు తన సూచనలిచ్చారు. ‘మన సినిమా ప్రమాణాలను మార్చుదాం, మన లోకల్‌ సినిమాని ప్రపంచానికి చూపిద్దాం’ అనేది పూరి ఉద్దేశం. మ్యూజింగ్స్‌ పేరుతో పూరి రోజూ వినిపిస్తున్న పలుకుల్లో ‘లోకల్‌ ఈజ్‌ గ్లోబల్‌’ అనే నినాదం గురించి వినిపించారు. అందులో చెప్పిన విషయం ఆయన మాటల్లోనే... 

‘‘సినిమాలు కావొచ్చు, వెబ్‌ సిరీస్‌లు కావొచ్చు ఓటీటీల్లో మనం వెతకలేనంత కంటెంట్‌ ఉంది. ఏదైనా మంచి సిరీస్‌/సినిమా ఉంటే సిఫార్సు చేయమని ఇప్పటికీ స్నేహితులను అడుగుతుంటాం. ఏదైనా నచ్చలేదంటే వెంటనే మార్చేస్తాం. మనకు ఓపిక తగ్గిపోయింది. ఏ మాత్రం క్వాలిటీ తగ్గినా తట్టుకోలేకపోతున్నాం. కానీ, మంచి కంటెంట్‌ ఏదైనా వస్తే మాత్రం అందరం చూస్తున్నాం. మనమే కాదు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘నార్కోస్‌’, ‘మనీ హైస్ట్‌’ లాంటి వాటిని అన్ని దేశాలు చూసేశాయి. నిజానికి అవి స్పానిష్‌లో చిత్రీకరించారు. అయినా సరే మనం సబ్‌ టైటిల్స్‌ పెట్టుకొని చూసేస్తున్నాం. అంటే విషయం బాగుంటే ప్రపంచం మొత్తం చూసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ‘లోకల్‌ ఈజ్‌ గ్లోబల్‌’. లోకల్‌ కంటెంట్‌ బాగుంటే, భాషతో సంబంధం లేదు. ఇక నుంచి మనం ప్రాంతీయ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయకూడదు. ప్రపంచమంతా నా చిత్రం చూడబోతోంది అని అనుకొని తీయాలి. మనం మంచి ప్రమాణాలున్న చిత్రాలు తీస్తే, ఎన్నో దేశాల్లో చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు. 

‘‘కొన్ని వెబ్‌ సిరీస్‌లు అయితే సినిమాల కంటే బాగున్నాయి. కంటెంట్‌ రైటింగ్‌‌ వేరే లెవల్లో ఉంటోంది. నటీనటులు ఇరగదీస్తున్నారు. చిత్రీకరణ విధానం పూర్తిగా మారిపోయింది. ఇక నుంచి మన సినిమా కూడా మారిపోవాలి. నువ్వు మాస్ చిత్రం తీసినా, అది ప్రపంచం మొత్తం చూసేలా తీయాలి. కోటి రూపాయలతో చిన్న చిత్రం తీసినా, దేశం మొత్తం నా చిత్రం చూస్తారని నమ్మి తీయాలి. రోజులు మారాయి, మీరు కథ చెప్పి ఒప్పించే నటులు, నిర్మాతలు, అందరూ రోజూ ‘హాలీవుడ్‌’ కంటెంట్‌ చూస్తున్నారు. మనం ఆ రేంజిలో లేకపోతే, వాళ్లని ఎంత మాత్రం ఒప్పించలేం. ప్రేక్షకులూ అంతే’’ అని అన్నారు పూరి.

‘‘బి,సి సెంటర్స్‌లో ఆంగ్లం రాకపోయినా, ఇంగ్లిష్‌ చిత్రాలు చూస్తున్నారు. డబ్బింగ్‌ చేయకపోయినా, నేరుగా చైనీస్‌, కొరియన్‌ చిత్రాలను చూసేస్తున్నారు. వాళ్లంతా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. మనమే బి సెంటర్‌, సి సెంటర్‌ అని ఆలోచిస్తున్నాం. రోజులు మారాయి. మంచి కంటెంట్‌ సిద్ధం చేద్దాం. ఇప్పటికే మీరు కొన్ని కథలు రాసుకుంటారు. ఇక్కడ అవి ఆడవు అని చాలామంది మిమ్మల్ని నిరాశపరుస్తారు. అయినా బాధపడకూడదు. వాళ్లకి వివరించండి, మార్చండి. కొత్త రచయితలు రావాలి... చిత్రాలు మారాలి. లాక్‌డౌన్‌కి ముందు రాసుకున్న కథలు ఏమైనా ఉంటే అన్నీ చింపేయండి. మరీ మనసు లాగితే, ఆసక్తికరంగా అనిపిస్తే కూర్చొని మళ్లీ కొత్తగా రాయండి. వచ్చే సంవత్సరం నుంచి సినిమా మారాల్సిన అవసరం ఉంది’’  అని పూరి సూచించారు.

‘‘రీజనల్‌ అనేది మరచిపోండి. ఇప్పుడు ప్రమాణాలు ముఖ్యం. ఓటీటీ కావచ్చు, థియేటర్‌ కావచ్చు.. ఇలా ఎక్కడైనా కంటెంటే మహరాజు. వేల వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్నో ఓటీటీలు సిద్ధంగా ఉన్నాయి. వారందరికీ కంటెంట్‌ అవసరం. రచయితలు నిద్రపోతే, సినిమా పరిశ్రమ నిద్రపోతున్నట్లే. నువ్వు రచయితవని భావిస్తే విశ్రాంతి తీసుకోవద్దు. నీ మీదే అందరూ ఆధారపడి ఉన్నారు. అలాగే సంవత్సరాల తరబడి కథలు రాయకండి. అంత సమయం లేదు ఇక్కడ. నిర్మాతలు డబ్బులు చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. మన దగ్గరే కథలు లేవు. అందుకే వేగాన్ని పెంచుదాం, ప్రమాణాలను మార్చుదాం, మన లోకల్‌ సినిమాని ప్రపంచానికి చూపిద్దాం. ‘లోకల్‌ ఈ జ్‌ గ్లోబల్‌’’ అని చెప్పారు పూరి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని