తిరుగులేని దిల్లీ: 5 విజయాలతో అగ్రస్థానం - delhi own the match
close
Published : 10/10/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుగులేని దిల్లీ: 5 విజయాలతో అగ్రస్థానం

46 పరుగుల తేడాతో రాజస్థాన్‌ (138/10) చిత్తు

దుమ్మురేపిన హెట్‌మైయిర్‌, స్టాయినిస్‌, అశ్విన్‌

షార్జా: దిల్లీ.. దడపుట్టిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా? మైదానం ఏదైనా? తమకు ఎదురేలేదని చాటుతోంది. లీగులో ఐదో విజయం అందుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచులో రాజస్థాన్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్మిత్‌ సేనను 19.4 ఓవర్లకు 138కే కుప్పకూల్చింది. రాహుల్‌ తెవాతియా (38; 29 బంతుల్లో 3×4, 2×6), యశస్వీ జైశ్వాల్‌‌ (34; 6 బంతుల్లో 1×4, 2×6) ఆ జట్టులో టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు మార్కస్‌ స్టాయినిస్‌ (39; 30 బంతుల్లో 4×6), హెట్‌మైయిర్‌ (45; 24 బంతుల్లో 1×4, 5×6) దిల్లీలో అదరగొట్టారు.

తిప్పేసిన యాష్‌

షార్జా చిన్న మైదానం కావడం.. అంతకు ముందే అక్కడ రెండు మ్యాచులు గెలవడంతో.. 185 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఉఫ్‌! అంటుందనే అంతా భావించారు. కానీ దిల్లీ బౌలర్లు సమష్టిగా ఆ జట్టును దెబ్బకొట్టారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (2/22), స్టాయినిస్‌ (2/17), రబాడా (3/35), నార్జె (1/25), అక్షర్‌ పటేల్ (1/8)‌ సమయోచితంగా వికెట్లు తీశారు. జట్టు స్కోరు 15 వద్దే బట్లర్‌ (13)ను యాష్‌ ఔట్‌ చేశాడు. యశస్వీతో కలిసి ధాటిగా ఆడిన స్మిత్‌ (24; 17 బంతుల్లో 2×4, 1×6)ను నార్జె పెవిలియన్‌ పంపించాడు. అప్పుడు స్కోరు 56.

ఆదుకుంటాడని అనుకున్న స్టార్‌ ఆటగాడు సంజు శాంసన్‌ (5).. స్టాయినిస్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు ప్రయత్నించి హెట్‌మైయిర్‌కు చిక్కాడు. క్రీజులో నిలదొక్కుకున్న యశస్వీనీ స్టాయినిసే ఔట్‌ చేశాడు. లోమ్రర్‌ (1), ఆండ్రూ టై (6), ఆర్చర్‌ (2) త్వరగానే పెవిలియన్‌ చేరుకున్నారు. తెవాతియా ఆఖరి ఓవర్‌ వరకు ఉన్నప్పటికీ.. వరుసగా వికెట్లు పడటం.. రన్‌రేట్‌ ఒక్కసారిగా 12 నుంచి 25కు దూసుకెళ్లడం.. తీవ్ర ఒత్తిడిలో అతడేమీ చేయలేకపోయాడు. చివరికి రాజస్థాన్‌ 138కి పరిమితమైంది.

హిట్‌మెయిర్ విధ్వంసం 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ బ్యాటర్లు తొలుత గందరగోళానికి గురయ్యారు. సమన్వయ లోపంతో వరుసగా ఔటయ్యారు. ఆర్చర్‌ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఓపెనర్లు శిఖర్ ధావన్‌ (5),  పృథ్వీ షా (19; 10 బంతుల్లో 2×4, 1×6) త్వరగా ఔటయ్యారు. వరుస బౌండరీలతో చెలరేగుతున్న శ్రేయస్‌ (22; 18 బంతుల్లో 4×4) సైతం యశస్వీ అద్భుత మెరుపు త్రోకు రనౌటయ్యాడు. మరికాసేపటికే రిషభ్‌ పంత్‌ (5) రనౌట్‌ రూపంలోనే వెనుదిరగడంతో దిల్లీ 79/4తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టాయినిస్‌, హెట్‌మైయిర్‌ దిల్లీని ఆదుకున్నారు. భారీ సిక్సర్లతో విజృంభించి స్కోరు వేగం పెంచారు. అయితే జట్టు స్కోరు 109 వద్ద స్టాయినిస్‌ను తెవాతియా, 149 వద్ద హెట్‌మైయిర్‌ను కార్తీక్‌ త్యాగి పెవిలియన్‌ పంపించడంతో మ్యాచ్‌ నెమ్మదించింది. ఈ క్రమంలో ఆండ్రూ టై వేసిన 19వ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ (17; 8 బంతుల్లో 2×4, 1×6) వరుసగా 4, 6, 4తో 22 పరుగులు సాధించడంతో దిల్లీ స్కోరు 184/8కి చేరుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని