అన్నయ్యను అలా చూడాలన్న కల నెరవేరింది
close
Published : 08/01/2020 22:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నయ్యను అలా చూడాలన్న కల నెరవేరింది

‘ఎంత మంచివాడవురా ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: ‘‘కల్యాణ్‌రామ్‌ అన్న సినిమాల విషయంలో నాకు ఎక్కడో చిన్న వెలితి ఉండేది. ఆ కల ‘ఎంత మంచివాడవురా’తో తీరింది’’ అన్నారు ఎన్టీఆర్‌. నందమూరి కల్యాణ్‌రామ్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకుడు. గోపీసుందర్‌ సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్‌ సమర్పకులు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తెలుగు చిత్రసీమ మరింత ముందుకెళ్లాలి: ‘‘కల్యాణ్‌రామ్‌ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. అయినా నాకు ఎక్కడో వెలితి ఉండేది. కుటుంబ కథా చిత్రంలో కల్యాణ్‌ అన్నను చూడాలనేది నా కల. ఆ కల వేగేశ్న సతీశ్‌ దర్శకత్వంలో నెరవేరుతోంది. కృష్ణప్రసాద్‌గారు నిర్మాత కాదు.. మా కుటుంబం సభ్యుడు. ఆయన సమర్పణలో, ఆదిత్య మ్యూజిక్‌ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం మీ ముందుకొస్తోంది. మంచి సినిమాలను ఆదరించే గుణం మీకు ఉంది. ఈ చిత్రానికి కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను. ఈ పండక్కి వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో..’, ‘ఎంత మంచివాడవురా’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. తెలుగు చిత్రసీమ మరింత ముందుకెళ్లాలి’’ అని అన్నారు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఆదిత్య మ్యూజిక్‌కు ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తాకు స్వాగతం. వారికి ఈ చిత్రం ద్వారా మంచి హిట్‌ అందాలి. ఈ సంక్రాంతికి వస్తున్న రజనీకాంత్‌, మహేశ్‌బాబు, బన్నీ సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. మా సినిమా కూడా మంచి హిట్టు అవ్వాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. 

సతీశ్‌ వేగేశ్న మాట్లాడుతూ ‘‘1960ల్లోనే మా నాన్నగారు సీనియర్‌ ఎన్టీఆర్‌కు అభిమాని. ఎన్టీఆర్‌ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షులు కూడా. నందమూరి కుటుంబంతో సినిమా తీస్తున్నందుకు ఈ క్షణం మా తండ్రి ఉంటే ఎంతో సంతోషించేవారు. కల్యాణ్‌రామ్‌ తీసిన ‘అతనొక్కడే’, ‘118’ సినిమాలతో క్లాసు, మాసు కలిపితే వచ్చిందే ఈ ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమాను 72 రోజుల్లోనూ పూర్తి చేశాం. అందుకు సినిమా బృందం మొత్తం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

‘‘సంక్రాతి పండగకు పిండి వంటలు, కోడి పందేలతో పాటు ‘ఎంత మంచివాడవురా’ సైతం పోటీలో ఉండబోతోంది. నాతో ‘118’ సినిమాలో కల్యాణ్‌రామ్‌ పనిచేశారు. ‘శతమానం భవతి’ సినిమాలో దర్శకుడు సతీశ్‌ పనిచేసి ఏకంగా జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. ఈ సంక్రాంతికి నా రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వాటితో పాటు ఈ సినిమా మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’అని దిల్‌ రాజు అన్నారు. కథానాయిక మెహరీన్‌ మాట్లాడుతూ ‘‘ఎంత మంచివాడవురా’ టైటిల్‌ మాత్రమే కాదు.. విడుదల తర్వాత సినిమా బృందం మొత్తం ఎంత మంచి వాళ్లురా అని అభిమానులే అంటారు. ‘ఎఫ్‌ 2’ హిట్‌ తర్వాత మంచి సినిమాలో మంచి పాత్ర కోసం దాదాపు ఐదు నెలలు ఎదురుచూశాను. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎంతో ఎంజాయ్‌ చేశాను. అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘క్రమశిక్షణకు మారుపేరైన నందమూరి కుంటుంబంతో నాలుగు సినిమాలు చేశాను. కల్యాణ్‌రామ్‌కు ఎంతో పట్టుదల ఉంది. ఆ విషయం సినిమా చిత్రీకరణ సమయంలో తెలిసింది. ఈ సినిమా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం’’ అని శివలెంక కృష్ణప్రసాద్‌ అన్నారు. కార్యక్రమంలో శరత్‌బాబు, రాజీవ్‌ కనకాల, భద్రమ్‌, శుభలేఖ సుధాకర్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని