మహేశ్‌ జీవితం.. పది మంది కోసం..!
close
Updated : 11/01/2020 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ జీవితం.. పది మంది కోసం..!

ఎన్నెన్ని చేస్తున్నారో..!

మహేశ్‌బాబు నటనకే కాదు.. వ్యక్తిత్వానికి కూడా ఎవరైనా ఫిదా కావాల్సిందే. అమ్మాయిలు కలలుకనే రాకుమారుడే కాదు.. ఊరిని బాగుచేసే ‘శ్రీమంతుడు’. పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించి పది మంది బాగు కోరే నిజ జీవిత కథానాయకుడు. మహేశ్‌లో ఇలాంటి ప్రత్యేకతలు మరెన్నో ఉన్నాయి. అవే ప్రేక్షకులను ఆయనకు మరింత చేరువ చేశాయి, సూపర్‌స్టార్‌పై మక్కువ పెంచాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలైన సందర్భంగా ఆయనలోని నిజ జీవిత ప్రత్యేకలు చూద్దాం..

హేశ్‌.. అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన రూపం. ఆయన్ను ఆకర్షించే మొదటి అంశం ఇది. అందుకే అమ్మాయిల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ‘రాజకుమారుడు’ (1999) నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ (2019) వరకూ ఆయన ఫిట్‌నెస్‌, లుక్స్‌లో పెద్ద మార్పు ఏమీ లేదు. వయసు గడుస్తున్న కొద్దీ మహేశ్‌ ఇంకా యంగ్‌గా తయారైపోతున్నారు. దీనికి కారణం ఏంటని ఆయన్ను అడగగా.. ‘సానుకూలంగా ఆలోచించడం, సరైన ఆహారం, నిద్ర, మన కలల్ని సాధించేందుకు ఎప్పుడూ ప్రోత్సహించే కుటుంబం’ అని మూడు ముక్కల్లో తేల్చి చెప్పారు.

నిషే కాదు.. మహేశ్‌ మనసు కూడా చక్కనిదే. ఆయన పారితోషికంలో 30 శాతం స్వచ్ఛంద సంస్థల కోసం ఉపయోగిస్తుంటారట. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రచారం చేసుకోవడం ఇష్టంలేని మహేశ్‌ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారని సమాచారం. 2013 నుంచి మహేశ్‌ ‘హీల్‌ ఎ చైల్డ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నారు. దీని ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల ఆర్థిక సహాయం చేసి, చికిత్స చేయిస్తున్నారు. 2014లో హుద్‌హుద్‌ తుపాను విశాఖలో బీభత్సం సృష్టించినప్పుడు మహేశ్‌ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు.

2015 ఫిబ్రవరిలో మహేశ్‌ తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. అక్కడ రోడ్లు వేయించి, మంచి నీటి సరఫరా సౌకర్యం కల్పించారు. అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోని సిద్ధాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకుని.. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల భవనాన్ని నిర్మించారు. అనేక మార్లు వైద్య శిబిరాల్ని నిర్వహించి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు జరిపించారు. వైద్య శిబిరాల ద్వారా ఆయన దాదాపు 1000 మందికిపైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయించడం విశేషం.

హాస్యచతురత మహేశ్‌లో ఇతరులకు నచ్చే మరో గుణం. పలకరించనంత వరకే ఇతరులతో ఆయన మౌనం. ఒక్కసారి పరిచయం అయితే తెగ జోక్‌లు వేసి నవ్విస్తుంటారని ఇప్పటికే కథానాయికలు కాజల్‌, భూమిక, త్రిష.. తదితరులు వారివారి ఇంటర్వ్యూల్లో చెప్పారు. మహేశ్‌కు టైమ్‌ సెన్స్‌ ఎక్కువన్న విషయం ఒక్కోసారి ఆయన సినిమాలోని డైలాగ్‌ల డెలివరీలోనూ అర్థమౌతుంటుంది.

హేశ్‌ డైరెక్టర్స్‌ హీరో.. ఎంత గొప్ప సూపర్‌స్టార్ అయినప్పటికీ ఆయన దర్శకుల విషయంలో కొత్త నటుడిలానే ప్రవర్తిస్తుంటారు. సెట్‌లో దర్శక, నిర్మాతలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంటారు. దీని వల్లే మేం ఆయనతో కలిసి స్వేచ్ఛగా పనిచేసి, కావాల్సిన అవుట్‌పుట్‌ రాబట్టుకోగలుగుతామని దర్శకులు అంటుంటారు. ఆయన స్నేహ స్వభావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేతనం ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది.

హేశ్‌ అంటే ఫ్యామిలీ గాయ్.. నిజమేనండీ ఆయనకు సినిమా సెట్‌, ఇల్లు తప్ప మరో లోకం తెలియదట. షూటింగ్‌ లేకపోతే ఇల్లే తన ప్రపంచమని అనేక మార్లు మహేశ్‌ అన్నారు. కుటుంబంతో కలిసి సమయం గడపడానికే ప్రాముఖం ఇస్తానని చెప్పారు. అంతేకాదు వివాదాలకు దూరంగా ఉండటం మహేశ్‌లోని మరో ప్రత్యేకత. ఆయనపై వదంతులు రావడం చాలా అరుదు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని