Yadadri: ఏడేడు లోకాలు ఏలే స్వామికి.. సప్త గోపురాల సన్నిధి!
close
Published : 19/09/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yadadri: ఏడేడు లోకాలు ఏలే స్వామికి.. సప్త గోపురాల సన్నిధి!

రెండు ప్రాకారాల్లో.. మూడు రకాలుగా నిర్మాణం గోపురాల సన్నిధి!

ఆలయానికి అల్లంత దూరం నుంచే భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేవి గోపురాలు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోనూ వీటిని సంపూర్ణ శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు. నల్లరాతితో పునర్నిర్మిస్తున్న ఈ దివ్య క్షేత్రంలో ఏడు గోపురాలను నిర్మిస్తున్నారు. వీటికోసం రూ.248 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రధానాలయంలో విమాన, మొదటి ప్రాకారంలో ఈశాన్యం, పడమర దిక్కున గోపురాలుంటాయి. బాహ్య ప్రాకారంలో తూర్పులో ఇంద్ర, పడమర వరుణ, దక్షిణాన యమ, ఉత్తరం దిక్కున కుబేర  రాజగోపురాలు నిర్మించారు...

ప్రవేశ ద్వారం... ఇంద్రగోపురం

తూర్పున రెండో ప్రాకారంలో పంచతల రాజగోపురం నిర్మించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ గోపురం నుంచే ఆలయంలోకి ప్రవేశిస్తారు. దీనికి ఇరువైపులా ఐదు అడుగుల ఎత్తున్న రెండు ఐరావతాలు, ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి. 55 అడుగుల ఎత్తు ఐదు అంతస్తుల్లో ఈ గోపురం ఉంది. దీన్ని ఇంద్ర గోపురంగా వ్యవహరిస్తారు.

ముక్తిదాయకం... విమాన దర్శనం

యాదాద్రిలో స్వామివారి గర్భాలయంపై ఉన్న పంచతల విమాన గోపురం ముక్తిదాయకమని చెబుతున్నారు. స్వామివారి దర్శనం ఇచ్చే ఫలాన్ని ఈ గోపుర దర్శనం ఇస్తుందని అంటారు. సర్పాకారంలో జ్వాలా, యోగముద్రలో యోగానంద, అమ్మవారితో కలిసి లక్ష్మీనరసింహమూర్తులు కొలువైన గర్భగుడికి ఈ గోపురం ప్రత్యేకంగా నిలుస్తోంది. 45 అడుగుల ఎత్తు.. అయిదు అంతస్తులు కలిగిన ఈ విమానం నల్లరాతితో నిర్మించిన వాటిలో అతి పెద్దదని ప్రధాన స్థపతిగా విధులు నిర్వర్తించిన వేలు ఆనందాచారి పేర్కొన్నారు. దీనికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు చేస్తున్నారు.

స్వామివారికి సంకేతం... ఈశాన్య గోపురం

యాదాద్రి ఆలయానికే ప్రత్యేకమైందీ గోపురం. మొదటి ప్రాకారంలో ఈశాన్య దిక్కున ఈ త్రితల గోపురం నిర్మించారు. మూడు అంతస్తులతో 45 అడుగులు ఎత్తున్న ఈ గోపురం నుంచే భక్తులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు.స్వామివారికి సంకేతంగా ఈశాన గోపురంగా దీన్ని వ్యవహరిస్తారు.

మహోన్నతం... మహా రాజగోపురం

పశ్చిమాన రెండో ప్రాకారంలోని సప్తతల రాజగోపురం అత్యంత విశేషమైంది. ఏడు అంతస్తులతో 75 అడుగుల ఎత్తుతో మహోన్నతంగా దీన్ని తీర్చిదిద్దారు. అన్ని ఆలయాల్లో భగవత్‌ దర్శనానికి ఆలయంలోకి ప్రవేశించే తూర్పు రాజగోపురాన్ని అన్నిటి కంటే ఎత్తుగా నిర్మిస్తారు. కానీ, ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహస్వామి పశ్చిమ ముఖంగా ఉండడంతో స్వామివారికి అభిముఖంగా ఉండే ఈ గోపురం ఉన్నతంగా ఉండాలనే సంప్రదాయాన్ని అనుసరించారు. దీనికి ఇరువైపులా ఐదు అడుగుల ఎత్తున్న రెండు ఐరావతాలు ప్రతిష్ఠించారు. దీన్ని కూడా వరుణుడికి సంకేతంగా భావిస్తారు.

ఉత్తర ద్వార దర్శనం

ఉత్తరాన రెండో ప్రాకారంలోని పంచతల రాజగోపురం అయిదు అంతస్తులతో 55 అడుగుల ఎత్తుతో కట్టారు. ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తున్న రెండు సింహాల ప్రతిమలను ప్రతిష్ఠించారు. గతంలో ఉత్తరద్వారం లేకపోవడంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన తూర్పు ద్వారాన్నే ఉత్తర ద్వార దర్శనానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం ముక్కోటి దర్శన భాగ్యాన్ని ఉత్తరం నుంచే చేసుకునే వీలు కలిగింది. దీన్ని కుబేరుని సంకేతంగా వ్యవహరిస్తారు.

వరుణుడికి సంకేతం

పశ్చిమ దిక్కున మహారాజగోపురానికి లోపలివైపు మొదటి ప్రాకారంలో పంచతల రాజగోపురం నిర్మించారు. అయిదు అంతస్తులతో 55 అడుగుల ఎత్తున్న ఈ గోపురానికి ఇరువైపులా జయవిజయులు ఉంటారు. వీటి ముందు ఐరావతం ప్రతిమలను ప్రతిష్ఠించారు. పశ్చిమ గోపురాన్ని వరుణుడికి¨ సంకేతంగా వరుణగోపురంగా వ్యవహరిస్తారు.

యమగోపురం

దక్షిణం దిక్కున రెండో ప్రాకారంలో ఉండే పంచతల రాజగోపురం అయిదు అంతస్తులతో 55 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తున్న రెండు సింహాల విగ్రహాలున్నాయి. యమునికి సంకేతంగా దీన్ని యమగోపురంగా వ్యవహరిస్తారు.

స్వామివారి దర్శన భాగ్యం ఇలా...

తూర్పు రాజగోపురం ద్వారా ప్రవేశించి దక్షిణగోపురం వైపు ప్రదక్షిణ పూర్వకంగా వెళ్లి పడమర, ఉత్తర రాజగోపురాలను చూస్తూ ఈశాన్య త్రితల గోపురంలోంచి స్వామివారి ప్రథమ ప్రాకారంలోకి భక్తులు ప్రవేశిస్తారు. అక్కడి నుంచి లోనికి వెళ్లి స్వామి, అమ్మవారిని దర్శనం చేసుకునేలా ఆగమ శాస్త్రానుసారంగా ప్రధానాలయాన్ని నిర్మించారని ఆలయ పూజారి కాండురి వెంకటాచార్యులు తెలిపారు.- యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే; ఈనాడు, సూర్యాపేట మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని