నిరసనల మధ్యే బిల్లుల ఆమోదం
close
Published : 30/07/2021 05:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరసనల మధ్యే బిల్లుల ఆమోదం

 పార్లమెంటులో చల్లారని  పెగాసస్‌ వివాదం

ఉభయ సభలూ పలుమార్లు వాయిదా

దిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ వివాదం పార్లమెంటు ఉభయ సభలను వరుసగా ఎనిమిదో రోజూ కుదిపేసింది. ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను పదేపదే అడ్డుకుంటున్నారు. వారి నిరసనలు గురువారం కూడా కొనసాగాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే లోక్‌సభలో రెండు బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లు ఆమోదం పొందాయి. ఉదయం లోక్‌సభ భేటీ అయిన వెంటనే బుధవారం నాటి ఘటనలపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా వ్యవహారాల ప్రతులను సభ్యులు చింపి విసరటం మనసును నొప్పించిందని తెలిపారు. ఆయన మాట్లాడుతుండగానే విపక్ష సభ్యులు.. ఫోన్ల ట్యాపింగ్‌, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్ని కొనసాగించడంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత మరో రెండుమార్లు సభ తిరిగి సమావేశమైనా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో శుక్రవారానికి సభను వాయిదా వేశారు. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ సమావేశమైనప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..‘భారత విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ ప్రాధికార సంస్థ (సవరణ) బిల్లు-2021’ను, నౌకాయాన, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‌ ‘అంతర్గత జల రవాణా బిల్లు-2021’ను సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే చర్చ జరగకుండానే సభ వీటిని ఆమోదించింది.

పెద్దల సభలోనూ నినాదాలు, నిరసనలు

రాజ్యసభలోనూ సభా కార్యక్రమాలు సజావుగా కొనసాగలేదు. గురువారం ఉదయం నుంచీ ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు కొనసాగాయి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ...‘ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌(అమెండ్‌మెంట్‌) బిల్‌-2021’ను ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చలో పాల్గొనాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు శాంతించలేదు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని